35 చిన్న కథ కాదు రివ్యూ
కథ
తిరుపతిలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ ఉంటాడు ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ). 10త్ క్లాస్ తప్పిన సొంత మరదలు సరస్వతి(నివేదా థామస్) నే పెళ్లి చేసుకోగా వారికి పెద్దోడు అరుణ్ (అరుణ్ దేవ్), చిన్నోడు వరుణ్ సంతానం. అరుణ్ కి చిన్నప్పటినుంచి లెక్కలు అంటే ఎందుకు ఆసక్తి ఉండదు. అసలు 0 కి 1 ముందు పెడితే ఒక విలువ, వెనుక పెడితే ఒక విలువ ఎలా వస్తుంది? అనే లాజికల్ ప్రశ్నకు సమాధానం దొరకపోవడంతో లెక్కల మీద అతనికి ఆసక్తి ఏమాత్రం కలగదు. సరిగ్గా అదే సమయానికి స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన మ్యాథ్స్ టీచర్ చాణక్య వర్మ(ప్రియదర్శి)కి అరుణ్ అడిగే లాజికల్ ప్రశ్నలు నచ్చవు. దాంతో ఆరో తరగతిలో ఫస్ట్ బెంచ్ లో స్నేహితుడు పవన్ తో కూర్చునే అరుణ్ ని డీమోట్ చేయించి అయిదో తరగతిలో లాస్ట్ బెంచ్ లో కూర్చో బెడతాడు. అక్కడ ఒక వివాదం జరగడంతో అరుణ్ మ్యాథ్స్ లో కనీసం 35 మార్కులు తెచ్చుకోకపోతే స్కూల్ నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అరుణ్ 35 మార్కులు తెచ్చుకున్నాడా ? 10వ తరగతి కూడా పాస్ అవ్వని తల్లి సరస్వతి అరుణ్ ను ఎలా ముందుకు నడిపించింది అనేది “35 చిన్న కథ కాదు” సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ సినిమా మొత్తాన్ని తన భుజస్కందాల మీద వేసుకుని నడిపించింది నివేధా థామస్. ఒక బ్రాహ్మణ గృహిణి పాత్రలో ఆమె జీవించింది. నివేద థామస్ నటన అద్భుతం అనే మాటకు తక్కువ కాదు. ఇప్పటివరకు ఆయన హీరోయిన్ మెటీరియల్ గానే చూసాం కానీ ఈ సినిమాలో అమ్మగా ఆమె నటనలో మెచ్యూరిటీ కనిపించింది..నిజంగా ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె వైవాహిక జీవితం ఇలాగే ఉంటుందేమో అనేలా ఆమె అలరించింది. ఇక ఆమె తరువాత అరుణ్ పాత్రలో నటించిన అరుణ్ కి మళ్ళీ అంతలా నటించే స్కోప్ దొరికింది. నిజానికి సినిమాలో అతని తమ్ముడు వరుణ్ పాత్రలో నటించిన నటుడు తో పాటు మరో పాప ముఖాలు మాత్రమే గుర్తుంటాయి మిగతా చాలా మంది పిల్లలు నటించారు కానీ పెద్దగా రిజిస్టర్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే వారంతా తమ పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. భాగ్యరాజా పాత్ర చిన్నది అయిన ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఇక ప్రియదర్శి మరోసారి తన నటనలో భిన్నత్వాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది.. విశ్వదేవ్ పాత్రకి న్యాయం చేశాడు.
టెక్నికల్ టీం
ఈ సినిమా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు.. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటి అనే విషయం మీద చాలా స్పష్టత ఉన్నట్టు అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమా డైలాగ్స్ చాలావరకు గట్టిగా తగిలేలా రాసుకున్నారు. “అడుగు ఆగినపుడే కదా నడక విలువ తెలిసేది, మెట్లు ఎక్కి వెళ్తేనే కదా మంచి దర్శనం, తల్లి ఒడి తొలి బడి, నా మొదటి చదువు మీ నాన్న అప్పుడే మీరు డిగ్రీలు గా వచ్చారు ఇప్పుడు చేస్తున్నది పీహెచ్డీ”లు లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమా మొత్తాన్ని ఒక నాస్టాలజిక్ ఫీల్ వచ్చేలా చూపించింది. మనమే తిరుపతిలో ఉండి ఏ గోడ మీద కూర్చుని ఈ సినిమా మొత్తాన్ని చూస్తున్న ఫీలింగ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు మేకర్లు.
విశ్లేషణ
నిజానికి మనం ప్రేక్షకులుగా ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం వాటిలో కొన్ని చూడడానికి బాగుంటే కొన్ని చూసిన తర్వాత కొంత ఆలోచనలు కూడా రేకెత్తిస్తాయి. ఈ 35 కూడా అలాంటి కథే, సినిమానే. సాధారణంగా మాథ్స్ అందరికీ రాదు.. రానివాళ్లు దాన్ని ఒక భూతంలా చూస్తే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళను అదోరకంగా చూస్తూ ఉంటారు.. మ్యాథ్స్ రాని ఒక కుర్రాడు మ్యాచ్లో ఎలా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు అది కూడా తన టెన్త్ ఫెయిల్ అయిన తల్లి చెప్పిన ట్యూషన్ తో అనే లైన్ తోనే ఈ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. వినడానికి చిన్న కథలా అనిపిస్తుంది కానీ చిన్న కథ మాత్రం కాదు ఇది. పదుల సంఖ్యలో ఉన్న పిల్లలతో ఇలాంటి సినిమా అంటే దర్శకుడి కష్టాన్ని అభినందించకుండా ఉండలేము. అంత కష్టపడి ఖర్చుపెట్టి కమర్షియల్ హంగులకు పోకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ని చాలా సిన్సియర్గా చెప్పినట్టు అనిపించింది. అనుకున్నది అనుకున్నట్టు చెప్పడానికి సినిమా మొత్తాన్ని వాడుకున్నాడు. ఈ సినిమా డబ్బుల కోసమే చేసి ఉన్నట్లయితే కమర్షియల్ లెక్కలు ఇప్పుడే చెప్పలేం కానీ పేరు కోసమో అవార్డుల కోసం కనుక తీసి ఉంటే వాటిని అలంకరించుకోవడానికి రెడీగా ఉండొచ్చు. చూస్తూ చూస్తూ కథలోకి పూర్తిగా తీసుకువెళ్లకుండానే ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా అంతా ఎమోషనల్ వేలో సాగుతుంది..
చివరిగా చెప్పాలంటే
ఒక ‘మంచి కథ’…… అందరికీ చెప్పాల్సిన కథ.
రేటింగ్
3.25/5