‘వెంకట్రామయ్య గారి తాలుకా’ సినిమా రివ్యూ

0
2

‘వెంకట్రామయ్య గారి తాలుకా’ సినిమా రివ్యూ

చిత్రం: వెంకట్రామయ్య గారి తాలుకా
విడుదల తేదీ: 17 జూలై 2026
నటీనటులు: మురళీధర్ గౌడ్, సుధ, దివిజ, దినేష్, సత్య శ్రీ, సెల్వ రాజ్ వర్మ, తదితరులు
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రాఫర్: బొట్ట అనిల్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
నిర్మాత: కోమలి మహేందర్
దర్శకుడు: సతీష్ ఆవల

‘పిల్లలే ప్రాణంగా బతికిన ఓ తండ్రి కథ’ అనే ఒక్క లైన్‌తో మొదలయ్యే ఈ సినిమా, మన ఇంట్లో, మన ఊళ్లో ప్రతి రోజు జరిగే కథ. దర్శకుడు సతీష్ ఆవల ఒక సాధారణ రైతు కుటుంబాన్ని కేంద్రంగా పెట్టుకుని, త్యాగం, ప్రేమ, కుటుంబ బాధ్యతల గురించి చాలా హృదయానికి హత్తుకునేలా చెప్పారు. లవ్, యాక్షన్ హడావుడి లేకుండా కేవలం ఎమోషన్‌తోనే ప్రేక్షకులను కదిలించాలన్న ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. పల్లెటూరి నేపథ్యం, వ్యవసాయం, కుటుంబ విలువలను గౌరవంగా చూపిస్తూ, ‘తండ్రి’ అనే పాత్ర ఎంత పెద్దదో గుర్తు చేసే సినిమా ఇది. జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకట్రామయ్య గారి తాలుకా ఎలా ఉందో చూద్దాం

కథ

వెంకట్రామయ్య – సీత దంపతులు. వ్యవసాయమే జీవితం. వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. పొలమే వారి ఆస్తి, పిల్లలే వారి ప్రపంచం. పెద్ద కూతుళ్ల పెళ్లి కోసం 5 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్ముతాడు వెంకట్రామయ్య. కొడుకుకు రైల్వే ఉద్యోగం కోసం మరో ఎకరం. చిన్న కూతురు లత ప్రేమించిన రాజును పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. మొదట్లో అత్తగారి స్వభావం వల్ల భార్య సీత ఒప్పుకోకపోయినా, కూతురి సంతోషం కోసం వెంకట్రామయ్య ఒప్పిస్తాడు.

పిల్లల పెళ్లిళ్లు అయ్యాక, కొడుకు ఉద్యోగం కోసం సిటీకి, కూతుళ్లు అత్తవారింటికి వెళ్లిపోతారు. చేతిలో మిగిలింది ఒక్క ఎకరం. దానితో బతుకుదామని ఆశపడుతుండగా ఊహించని సమస్యలు వస్తాయి. అప్పటి నుంచి వెంకట్రామయ్య జీవితం ఎలా మారుతుంది? పిల్లల కోసం అంతా ధారపోసిన తండ్రికి చివరికి దక్కిందేంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాకు ప్రాణం నటీనటులే. ప్రతి ఒక్కరూ తమ పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. మురళీధర్ గౌడ్, వెంకట్రామయ్యగా అద్భుతం చేశారు. ఆయన నటించలేదు, ఆ పాత్రగా బతికారు. పొలాన్ని చూసుకునే తీరు, పిల్లల కోసం ఆస్తులు అమ్మేటప్పుడు కళ్లలో కనిపించే బాధ, భార్యతో మాట్లాడేటప్పుడు ఉండే మృదుత్వం, క్లైమాక్స్‌లో కుప్పకూలే సన్నివేశం ప్రతిదీ చాలా సహజంగా ఉంది. ఆయన తప్ప ఈ పాత్రలో ఇంకెవరినీ ఊహించలేం.

సుధ, సీతగా మరోసారి తన నటనతో మెప్పించారు. తల్లిగా ఆమె ఆందోళన, కోపం, ప్రేమ, నిస్సహాయత అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ముఖ్యంగా కూతురి కోసం భర్తతో వాదించే సన్నివేశాలు, చివర్లో భర్తకు అండగా నిలిచే సన్నివేశాలు గుండెకు తాకుతాయి. దివిజ ప్రభాకర్ లతగా చాలా ఫ్రెష్‌గా ఉంది. ప్రేమ, భయం, అత్తింటి కష్టాలు అన్నింటినీ సహజంగా చూపించింది. దినేష్ రాజుగా తన పరిధిలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

సాంకేతికనిపుణుల పనితీరు:

సాంకేతికంగా సినిమా సింపుల్‌గా ఉంది. పల్లెటూరి లొకేషన్స్, కెమెరా వర్క్ కథకు తగ్గట్టు సహజంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఎమోషన్‌ను మరింత పెంచింది. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టు ఉన్నాయి. ఎడిటింగ్‌లో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల సాగదీత అనిపించినా, మొత్తంగా దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ చాలా స్పష్టంగా, హృదయపూర్వకంగా వెళ్లింది.

విశ్లేషణ

మొదటి సగం వెంకట్రామయ్య కుటుంబాన్ని, వారి బంధాలను పరిచయం చేస్తుంది. పొలం పట్ల ఆయనకున్న ప్రేమ, పిల్లల కోసం ఒక్కొక్క ఎకరం అమ్ముతున్నప్పుడు ఆయన పడే మానసిక సంఘర్షణను దర్శకుడు చాలా నిదానంగా, అందంగా చూపించారు. ఈ భాగంలో కుటుంబ సన్నివేశాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, కూతురి ప్రేమ వ్యవహారం అన్నీ చక్కగా కుదిరాయి. ప్రేక్షకుడికి వెంకట్రామయ్య అంటే గౌరవం, సీత అంటే అనుబంధం ఏర్పడుతుంది.

రెండో సగం పూర్తిగా ఎమోషనల్ జర్నీ. పిల్లలు దూరమైన తర్వాత తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, సమాజం చూసే చూపును దర్శకుడు నిజాయితీగా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మన సొంత తండ్రి గుర్తొచ్చేలా చేస్తుంది. ఇటీవల కాలంలో పల్లెటూరి కథలు లవ్ ట్రాక్‌లకే పరిమితమవుతుండగా, ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా రావడం ఆహ్వానించదగ్గ విషయం.

రేటింగ్: 3.25/5

చివరగా: కుటుంబంతో కూర్చుని చూడదగ్గ, మనసుని తాకే సినిమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here