‘కర్మాఖ్య’ మూవీ రివ్యూ..

0
6
"Karmakhya" Movie Review

‘కర్మాఖ్య’ మూవీ రివ్యూ..

చిత్రం: కర్మాఖ్య
రిలీజ్ డేట్: జూలై 31 2026
నిర్మాణ సంస్థ: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT లిమిటెడ్
నటీనటులు: సమైరా, సముద్రఖని, అభిరామి, శరణ్య ప్రదీప్, మధునందన్, ఆనంద్..తదితరులు
సంగీతం: గ్యాని
ఛాయాగ్రహణం: రమేష్ రెడ్డి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
నిర్మాత : వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
దర్శకుడు: అభినయ కృష్ణ

జబర్దస్త్ అదిరే అభి దర్శకుడిగా మారి కామాఖ్య టెంపుల్ లీడ్ తీసుకొని తెరకెక్కిన సినిమా చివర్లో సెన్సార్ ఇబ్బందులతో కర్మాఖ్య టైటిల్ గా మార్చుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ :

కొన్నేళ్ల క్రితం అస్సాం కామాఖ్య ఆలయం నుంచి తంత్ర విద్యలు చేసే ఓ కుటుంబం ఆంధ్రలోని ఓ గ్రామానికి వలస వస్తారు. చేతబడులు, బలి ఇస్తున్నారు అని ఆ వ్యక్తి(మధునందన్), అతని భార్యని గ్రామస్థులు చంపేస్తారు. 20 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం.. ఓ హాస్టల్ లో కామాఖ్య(సమైరా) తన ఫ్రెండ్ ప్రవల్లిక(శరణ్య ప్రదీప్)తో కలిసి ఉంటుంది. కామాఖ్య జాబ్ పోయి ఖాళీగా ఉంటుంది. ప్రవల్లిక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఓ రోజు ప్రవల్లిక అర్జెంట్ గా ఊరు వెళ్లాల్సి రావడం, ఇక్కడ కూడా అర్జెంట్ వర్క్ ఉండటంతో తన పని కామాఖ్య చేస్తాను అని చెప్పి ప్రవల్లిక పేరుతో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా దూరంగా ఉన్న ఓ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో సరోజిని(అభిరామి), తన భర్త(ఆనంద్), తన మతిస్థిమితం లేని కొడుకుతో కలిసి ఉంటుంది. తమ కూతురు ప్రజ్ఞ(ఐశ్వర్య)మరణించడంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కామాఖ్యను మొదట బాగానే పలకరించిన ఆ కుటుంబం తర్వాత బెదిరించి, నిన్ను బలి ఇస్తాం అని చెప్పి బంధిస్తారు. అసలు సరోజిని, ఆ ఫ్యామిలీ ఎవరు? కామాఖ్యని ఎందుకు బలి ఇవ్వాలి అనుకుంటారు? అక్కడ్నుంచి కామాఖ్య ఎలా తప్పించుకుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

కామాఖ్య పాత్రలో కొత్త హీరోయిన్ సమైరా అయితే అదరగొట్టేసింది. ఒకే ఇంట్లో బందీగా ఉండి, తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే ఇబ్బందులతో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. శరణ్య ప్రదీప్ తన పర్ఫార్మెన్స్ తో షాక్ ఇస్తుంది. సీనియర్ నటి అభినయ తన నటనలో వెంటవెంటనే వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించి మెప్పించింది. సముద్రఖని పోలీస్ గా అక్కడక్కడా నవ్వించి చివర్లో సీరియస్ గా కనిపించి ట్విస్ట్ ఇస్తారు. ఆనంద్, ధనరాజ్, మధునందన్, ఐశ్వర్య ఉల్లింగల, వైష్ణవ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. ఒకే ఇంట్లో సగం నడిపించినా విజువల్స్ లో ప్రతి సీన్ లో కొత్తగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు యావరేజ్. ఎడిటింగ్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లేకు తగ్గట్టు ఎడిటింగ్ చాలా బాగా చేశారు. సినిమా మొదట్లో చూపించిన AI విజువల్స్ కూడా బాగున్నాయి. సింపుల్ కథే అయినా ఆసక్తికర ట్విస్టులతో బాగా రాసుకొని, సాంకేతికంగా మేకింగ్ విషయంలో కేర్ తీసుకొని బాగా తెరకెక్కించాడు దర్శకుడు అదిరే అభి. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

విశ్లేషణ..

ఫస్ట్ హాఫ్ 20 ఏళ్ళ క్రితం ఓ సీన్ చూపించి ప్రస్తుత కథలోకి వస్తారు. కామాఖ్య, తన ఫ్రెండ్ హాస్టల్ లో ఉండటం, లోన్ రికవరీ అని ధనరాజ్ వచ్చి కాసేపు కామెడీ చేయడంతో సింపుల్ గా సాగుతుంది. ప్రవల్లిక బదులు కామాఖ్య ఆ ఇంటికి వెళ్లడంతో అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో మనుషులు వింతగా ప్రవర్తించడం, ఏదో జరగబోతుంది అని క్యూరియాసిటీ నెలకొంటుంది. ఇంటర్వెల్ కి కామాఖ్యాని బలి ఇస్తాం అని ఆ ఫ్యామిలీ చెప్పడంతో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ లో కామాఖ్య ఆ ఇంట్లో నుంచి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్ గా సాగుతాయి. శరణ్య ఎంట్రీతో పెద్ద ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను షాక్ చేస్తారు. అక్కడ్నుంచి వరుసగా ట్విస్టులతో సాగుతుంది. ఓపెనింగ్ సీన్ లో 20 ఏళ్ళ క్రితం చూపించిన కథ కు చెందిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి వచ్చే ట్విస్టులు బాగుంటాయి. క్లైమాక్స్ లో కూడా ఇంకో రెండు ట్విస్ట్ లు ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు.

ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఫస్ట్ హాఫ్ కొంత నిదానంగా సాగిన ఇంటెర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఉత్కంఠంగా సాగుతుంది. చేతబడులు, తంత్ర విద్యల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా కర్మాఖ్య సినిమా మెప్పిస్తుంది.

చివరగా :

జబర్దస్త్ అదిరే అభి కామాఖ్య ఆలయం లీడ్ తీసుకొని చేతబడులు, తంత్ర విద్యల బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికర థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించాడు.

రేటింగ్ :

3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here