మిస్సింగ్ మేఘన మూవీ రివ్యూ
చిత్రం: మిస్సింగ్ మేఘన
విడుదల తేదీ: సెప్టెంబర్ 18, 2026
నటీనటులు: రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, కౌశిక్, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం: వాచస్పతి
నిర్మాత: పంచుమర్తి నరేష్ బాబు
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
సినిమాటోగ్రఫీ: శామ్ కె. నాయుడు
ఎడిటింగ్: బసవ
నేటి తరం ప్రేక్షకులు బాగా ఆదరించే థ్రిల్లర్ జానర్ లో ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ తెచ్చుకున్న చిత్రం ‘ మిస్సింగ్ మేఘన ‘. టైటిల్ లోనే చిత్ర కథ దేని గురించి చెప్పిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ
మేఘన (అమ్ము అభిరామి) ఓ రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందుతాడు. పోలీసుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో మేఘనకు కాబోయే భర్త, ఏసీపీ అర్జున్ (కౌశిక్) స్వయంగా కేసును టేకప్ చేస్తాడు. చివరిసారిగా ఆమెను డ్రాప్ చేసిన బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్)పై అనుమానం మొదలవుతుంది. అయితే తనకు మేఘనతో సంబంధమే లేదని కార్తీక్ చెప్పడం కేసును మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అతని గత ప్రేమకథ, మేఘనతో ఉన్న కాల్ రికార్డులు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతాయి. చివరకు ఈ మిస్సింగ్ కేసు ప్రేమ, మర్డర్స్, డ్రగ్స్‌తో ముడిపడిన సంక్లిష్ట క్రైమ్‌గా మారుతుంది.
నటీనటుల పనితీరు
అమ్ము అభిరామి మేఘన పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చింది. పాత్రలోని క్యూట్‌నెస్‌తో పాటు పరిస్థితులు మారుతున్న కొద్దీ కనిపించే భావోద్వేగాలను ఆమె చక్కగా పలికించింది. ముఖ్యంగా కథను ముందుకు నడిపించే పాత్రగా ఆమె నటన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
రామ్ కార్తీక్, కార్తీక్ పాత్రలో మెప్పించాడు. ప్రేమ విఫలమైన వ్యక్తిగా కనిపించే సన్నివేశాల్లో ఒకరకమైన సాఫ్ట్‌నెస్‌ను చూపిస్తూనే, కేసు మిస్టరీలోకి వెళ్లిన తర్వాత పాత్రలో వచ్చే మార్పును బాగా క్యారీ చేశాడు. సెకండాఫ్‌లో యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో మరింత ఎనర్జిటిక్‌గా కనిపించాడు.
కౌశిక్, ఏసీపీ అర్జున్‌గా కథకు అవసరమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్‌ను బలంగా మోశాడు. కేసును ఛేదించాలనే పట్టుదల, సీరియస్ బాడీ లాంగ్వేజ్ పాత్రకు సరిపోయాయి. అంకిత్ కొయ్య తనకు లభించిన పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. వైదిక సెంజాలియా కూడా కథలో తన పాత్రకు తగ్గ గుర్తింపు తెచ్చుకుంది. గోపరాజు రమణ తండ్రి పాత్రలో సహజమైన ఎమోషన్‌ను పలికించారు. వెంప కాశి, ఇతర సహాయ నటీనటులు కూడా తమ వంతు సహకారం అందించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు వాచస్పతి మిస్సింగ్ కేసును ఒక్క కోణంలో కాకుండా ప్రేమ, క్రైమ్, మర్డర్, డ్రగ్స్ అంశాలతో విస్తరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ వరకు అనుమానాలను పెంచుతూ, తర్వాత కథను మరో ట్రాక్‌లోకి తీసుకెళ్లిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది.
శామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటి. లొకేషన్లు, కలరింగ్ సహజంగా ఉండటంతో ఇన్వెస్టిగేషన్ వాతావరణం కనిపిస్తుంది. ఆర్.ఆర్. ధృవన్ పాటలు కథకు అవసరమైన ఎమోషనల్ టచ్‌ను అందిస్తాయి. అయితే థ్రిల్లర్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్సిటీ తో ఉంటే ఉత్కంఠ ఇంకాస్త పెరిగేది. బసవ ఎడిటింగ్ సెకండాఫ్‌లో మంచి పేస్‌ను అందించినప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను కాస్త కుదించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగిన స్థాయిలో ఉన్నాయి.
విశ్లేషణ
ఫస్ట్ హాఫ్‌లో మేఘన మిస్సింగ్ కేసును స్థాపించడానికి, ప్రధాన పాత్రల మధ్య సంబంధాలను పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందువల్ల అక్కడక్కడా కథనం నెమ్మదిగా అనిపించినా, అదే సమయంలో అనుమానాలను ఒక్కొక్కటిగా పెంచుతూ ప్రేక్షకుడిని కేసులోకి లాగుతాడు. కార్తీక్‌పై అనుమానం, అతని గత ప్రేమకథ, మేఘనతో కాల్ రికార్డులు వంటి అంశాలు మిస్టరీకి అవసరమైన ప్రశ్నలను సృష్టిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథనం పూర్తిగా మరో మలుపు తీసుకోవడం సినిమాకు కీలకమైన ప్లస్. సెకండాఫ్‌లో మిస్సింగ్ కేసు క్రమంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌గా మారడం, వరుసగా బయటపడే నిజాలు, హీరో–పోలీస్ ఇన్వెస్టిగేషన్ కలిసి ముందుకు సాగడం ఆసక్తిని పెంచుతాయి. కొన్ని మలుపులను ముందుగానే ఊహించే అవకాశం ఉన్నప్పటికీ, కథలోని క్రైమ్ లేయర్స్ ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేసేలా చేస్తాయి.
టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, సహజమైన లొకేషన్లు, కలరింగ్ సినిమాకు మంచి వాతావరణాన్ని సృష్టించాయి. సంగీతం, పాటలు కథలోని ఎమోషనల్ టచ్ అందించాయి. ఎడిటింగ్‌లో ఫస్ట్ హాఫ్ ల్యాగ్ కొంత తగ్గి ఉంటే థ్రిల్లర్ మరింత షార్ప్‌గా మారేది. క్లైమాక్స్ పూర్తిగా ఊహించని స్థాయిలో లేకపోయినా, కథను ఒక ముగింపుకు తీసుకెళ్లే విధానం సంతృప్తికరంగానే ఉంటుంది. మొత్తంగా మిస్సింగ్ మేఘనలో కొత్త కాన్సెప్ట్ కంటే దాన్ని క్రైమ్ థ్రిల్లర్‌గా మలిచిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ పేస్, నటీనటుల సహజమైన పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణలు. సస్పెన్స్, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు చూడదగిన థ్రిల్లర్‌గా సినిమా నిలుస్తుంది.
రేటింగ్: 3/5
చివరగా: ఆసక్తి రేపే మలుపులతో ఆకట్టుకునే థ్రిల్లర్



