నేను – కీర్తన మూవీ రివ్యూ
నటీనటులు: రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ తదితరులు
బ్యానర్; చిమటా ప్రొడక్షన్స్
ఫైట్స్: నూనె దేవరాజ్,
సినిమాటోగ్రఫీ; కె.రమణ
ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్: ఎమ్.ఎల్.రాజా
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)
నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)
విడుదల తేది: 30-08-2024
కథ : జానీ (రమేష్ బాబు) ఒక యావరేజ్ తెలుగు కుర్రాడు. తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఆపదలో ఉండి, తన సాయం అర్ధించేవారి కోసం ప్రాణాలు పణంగా పెట్టేస్తూ ఉంటాడు. అలాంటి జానీ జీవితంలోకి కీర్తన(రిషిత) అనే అమ్మాయి ప్రవేశించాక… అతని జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా వినియోగించాడన్నది ఈ సినిమా కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రమేష్ బాబు నటన గురించే. సినిమా ఆద్యంతం తనదైన నటనతో ఆకట్టుకున్న రమేష్ బాబు యాక్షన్ సీన్స్ తో దుమ్ము రేపుతూనే డాన్స్ తో కూడా భళా అనిపించాడు. విజయ రంగరాజు, జీవాల విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? భయపెట్టేశారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. ఇక కొత్తవాళ్ళయినా హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా రేణు ప్రియ ఐటమ్ సాంగ్ నిలిచింది.
టెక్నికల్ టీం పనితీరు:
రైటర్, డైరెక్టర్ కూడా తనే అయిన రమేష్ బాబు… పెద్ద హీరోలకయితే బ్రహ్మాండంగా పేలేలా డైలాగ్స్ రాసుకున్నాడు. అయితే మొదటి సినిమా కావడంతో హీరోగా మనోడికి అవి కొంచెం సేలబుల్ అనిపించలేదు. ఇక దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేసిన రమేష్ బాబు… రైటర్ గా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ మరీ హెవీ అయ్యాయేమో అనిపిస్తుంది. అలాగే సినిమా మొత్తం చూశాక ఒకే సినిమాలో ఇన్ని జోనర్లు చొప్పించడం అవసరమా? అనే ఫీలింగ్ కలిగితే అది మీ తప్పు కాదు. ఎడిటింగ్ క్రిస్పీగానే ఉన్నా… ల్యాగ్ అనిపించకుండా సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. ఇక బడ్జెట్ ను బట్టి చూస్తే కెమెరా వర్క్ బాగున్నది. సంగీతంలో ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం సినిమాకి సెట్ అయింది. కులు మనాలిలో చిత్రీకరించిన పాట, ఫైట్స్ అదిరిపోయాయి. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
ముందు నుంచి ఈ సినిమాను ఒక “మల్టీ జోనర్ ఫిల్మ్”గా ప్రచారం చేసిన ఈ సినిమాలో చెప్పినట్టుగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేసిన తీరు బాగున్నా, ఒకేసారి ఇన్నిటిని ఎందుకు చొప్పించారు అని ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు. హీరోకి వరం దొరకడం దాని వలన ఇబ్బందులు పడడం వంటి లైన్స్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో కథ మలుపులు తిరిగేకొద్దీ ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా ఎవరైనా స్టార్ హీరోకి పడి, జానర్లను కుదించి కామెడీ, రివెంజ్, హర్రర్ వరకు పరిమితం చేసేలా కథను సిద్ధంచేసి దిగి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. అయితే మొదటి సినిమాకే రమేష్ బాబు చేసిన ప్రయత్నం అభినందనీయం.
చివరిగా చెప్పాలంటే…
చిన్న చిన్న లోపాలు, మిస్సైన లాజిక్స్ పక్కన పెడితే “నేను – కీర్తన” ఎంగేజ్ చేస్తుంది.
రేటింగ్ : 3/5