నటసింహం సినీ స్వర్ణోత్సవం
నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో ఆయన రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు. అన్నీ రకాల జోనర్స్ సినిమాల్లో నటించిన అగ్ర హీరోగా ఆయనకొక ప్రత్యేకమైన గుర్తింపుంది. రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలను సాధించి ఔరా అనిపించారు. ఆయన అన్‌స్టాపబుల్ జోరు చూస్తే కుర్ర హీరోలు సైతం వెనుకడుగు వేస్తుంటారు. అభిమానులు ముద్దుగు గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకునే నందమూరి సినీ ప్రయాణంలో 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 అక్టోబర్ 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో బాల నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారభించిన ఆయన నేటితో సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకోవటం విశేషం. అరుదైన ఘనతను సొంతం చేసుకన్న ఆయన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు
* తండ్రికి తగ్గ వారసుడిగా
స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ.. నటనలో తనదైన ముద్ర వేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ ఎవరూ ఊహించని రీతిలో బాక్సాఫీస్ రికార్డులను సాధించటం బాలకృష్ణకే సాధ్యమైంది. మాస్ కథలతో పూనకాలు తెప్పించారు. క్లాస్ కథలతో తనకి తానే సాటి అని చాటారు. చరిత్ర సృష్టించారు… దాన్ని తిరగరాశారు.
* 14 ఏళ్లకే నటుడిగా …
ఎన్టీఆర్ రూపొందించిన తాతమ్మ కల చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. అప్పుడాయన వయసు 14 ఏళ్లు మాత్రమే. 1974లో అనేక సవాళ్లను దాటి ఆ సినిమా అక్టోబర్ 30న విడుదలైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో ‘తాతమ్మ కల’ ఒకటి. ఈ సినిమా రెండు నెలల పాటు నిషేధానికి గురైన సంగతి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. 1974లో ‘ఇద్దరు ముద్దు ఆపై వద్దు’ అనే ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారు ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన పరిమిత సంతానానికి వ్యతిరేకం. సంతానం ఎందరుండాలనే దానిపై తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికీ హక్కు ఉండదని నమ్ముతారు. తర్వాత తండ్రితో కలిసి అన్నదమ్ముల అనుబంధం, అనురాగదేవత, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సింహం నవ్వింది వంటి సాంఘిక చిత్రాలు.. దానవీరశూరకర్ణ, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, శ్రీమద్విరాటపర్వం వంటి పౌరాణిక చిత్రాలు.. వేములవాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి వంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించి శభాష్ అనిపించుకున్నారు.
* హీరోగా ఎంట్రీ…
1984లో సాహసమే జీవితం చిత్రంతో బాలకృష్ణ హీరోగా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కెరీర్ తొలినాళ్లలోనే మంగమ్మగారి మనవడు చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కథానాయకుడు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, ముద్దుల క్రిష్ణయ్య, భార్యాభర్తల బంధం, భలే తమ్ముడు, సీతారామ కళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు, మువ్వగోపాలుడు, రాము, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, రక్తాభిషేకం, భలే దొంగ, ముద్దుల మావయ్య, ప్రెసిడెంట్‌గారబ్బాయి, నారి నారి నడుమమురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్, డిక్టేటర్, పైసా వసూల్, జైసింహా, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఫ్యాక్షన్ సినిమాల హీరోగా..
కేవలం సాంఘిక చిత్రాల్లో మాత్రమే కాకుండా జానపద, పౌరాణిక, హిస్టారికల్ మూవీస్‌లోనూ నటించిన నేటి తరం హీరోగా అరుదైన రికార్డును బాలకృష్ణ సొంతం చేసుకోవటం విశేషం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి బాలయ్య తర్వాతే ఎవరైనా అనేంతలా సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను సాధించారు. 15కుపైగా చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా బాలకృష్ణ
* అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు…
2014లో లెజెండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ అదే ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. హిందూపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో విజయాన్ని సాధించారు. అక్కడి నుంచి సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. 2019లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్య.. 2024లో హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
* కొత్తదనానికి పెద్దపీట
నందమూరి బాలకృష్ణలోని మాస్ హీరోయిజం ఉన్న సినిమాలను చేయాలనుకోవటమే కాదు, కొత్త కథ, కథనాలు, పాత్రలకు ప్రాధాన్యతనిస్తారు. నేటి తరం కథానాయకుల్లో అన్నీ జోనర్ చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు బాలకృష్ణ మాత్రమే కావటం మన తెలుగువారి అదృష్టం. సాంఘిక చిత్రాలతో పాటు జానపద చిత్రాలు, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ఘన విజయాలను సొంతం చేసుకోవటం ఆయనకే చెల్లింది.
* వారసుడి ఎంట్రీకి సిద్ధం..
ఇప్పుడు టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలో నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని మూవీ సర్కిల్స్ సమాచారం. నటన, డాన్సులు వంటి విషయాల్లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలోనే ఈయన సినీ రంగ ప్రవేశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
* సేవా కార్యక్రమాల్లో…
బాలృష్ణ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలు చేస్తూనే, ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్నారు. అంతే కాకుండా.. సేవా కార్యక్రమాల్లోనూ భాగమవుతున్నారు. కరోనా సమయంలో తెలుగు సినీ కార్మికులకు కోటి రూపాలు, సీసీసీకి పాతిక లక్షల రూపాయలను విరాళంగా అందించారు. మరో వైపు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఉంటూ క్యాన్సర్ బాధితులకు వైద్యం అందించే పనిలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు.
* డిజిటల్ రంగంలోనూ సెన్సేషన్…
సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే బాలకృష్ణ మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవటంలోనూ ముందుంటారు. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అన్‌స్టాపబుల్ అనే టాక్ షోలో హోస్ట్‌గా వ్యవహరించారు. అసలు బాలకృష్ణ టాక్ షోను ఎలా హ్యాండిల్ చేస్తారని అందరూ భావించారు. ఎవరూ ఊహించని రీతిలో ఐఎండీబీలోనే ఈ అన్‌స్టాపబుల్ టాక్ షో నెంబర్ వన్‌గా నిలిచింది. త్వరలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 3 ప్రారంభం కానుందని సమాచారం.
సినిమాలు, రాజకీయాలు ఓటీటీలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ప్రజా సేవ చేయటంలోనూ ముందుంటున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం తన 109వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. సినీ కెరీర్‌లో 50 వసంతాలను పూర్తి చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవాన్ని సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ బాలకృష్ణ తన ప్రస్థానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..