ఖైదీ మూవీ రివ్యూ

0
1622

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2019
నటీనటులు : కార్తీ, నరైన్,రమణ, దీనా,హరీష్ ఉత్తమన్ తదితరులు
సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్,
సంగీతం : శ్యామ్ సీఎస్,
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్,
సమర్పణ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ కె.కె రాధామోహన్,
నిర్మాత‌లు : ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్,
దర్శకత్వం : లోకేష్ కనకరాజ్.

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. అక్టోబర్ 25 న భారీ అంచనాలతో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

కథ :

డిల్లీ (కార్తి) ఒక కేసులోయావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. పదేళ్ల శిక్ష పూర్తయ్యాక.. సత్ ప్రవర్తన కారణంగా మిగతా నాలుగేళ్ల శిక్ష తగ్గించి అతణ్ని విడుదల చేస్తారు. అప్పటిదాకా ఒక్కసారీ చూడని తన కూతురిని చూడాలని బయలుదేరుతుండగా ఒక పెద్ద ప్రమాదం నుంచి దాదాపు 40 మంది పోలీసు అధికారుల్ని కాపాడాల్సిన బాధ్యత అతడిపై పడుతుంది. అంతమంది పోలీసులు అతడిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?.. వాళ్లను అతను కాపాడాడా లేదా?.. తన కూతురిని కలిశాడా ? అనేది కథ.

విశ్లేషణ :

‘ఖైదీ’ సినిమా నిడివి దాదాపుగా రెండున్నర గంటలు. ఈ రెండున్నర గంటల కథ రాత్రి వేళ కొన్ని గంటల్లోనే ముగిసిపోతుంది. ఐతే ఇంత నిడివిలో ఒక్కటంటే ఒక్క పాట కూడా లేదు. హీరోయిన్ లేదు. ఒక సన్నివేశంలో హీరో తనను తక్కువ అంచనా వేసిన పోలీస్ అధికారికి తన గురించి హింట్ ఇస్తూ.. ‘‘నేను పదేళ్లు జైల్లో ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. అంతకుముందు ఏం చేశానో తెలీదు కదా’’ అంటాడు. మరో సన్నివేశంలో హీరో గతమేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పక్కనున్న కుర్రాడు భార్య గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే… హీరో ఆ కథ చెప్పనారంభిస్తాడు. ఈ రెండు సందర్భాల్లో గతంలోకి వెళ్లి కొంత కథను నడిపించడానికి అవకాశముంది. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాత్రం కేవలం రెండు నిమిషాల సంభాషణలతో హీరో గతం తాలూకు గాఢతనంతా చెప్పిస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. ఎక్కడా బిగి సడలని రేసీ స్క్రీన్ ప్లే తో.. స్ట్రెయిట్ నరేషన్ తో రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కదలకుండా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి ‘ఖైదీ’ని ఒక పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా మలిచాడు. కథలో విషయం ఉండి.. కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుంటే.. అలాంటి హంగులేమీ అవసరం లేకుండానే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయొచ్చని చాటి చెబుతుంది ‘ఖైదీ’. ఇంత సిన్సియర్ గా ఓ కథను చెప్పే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తెరపై బొమ్మ పడ్డప్పటి నుంచి ముగింపు వరకు కథతోనే సాగుతుంది ‘ఖైదీ’. అలాగని ఇందులో హీరో ఎలివేషన్లేమీ తక్కువగా లేవు. కానీ అవన్నీ కథ భాగంగా ఉండటమే దీని ప్రత్యేకత.

కార్తి ఎంత మంచి నటుడో ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ‘ఖైదీ’ అతడిని మరిన్ని మెట్లు ఎక్కించింది. తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఉద్వేగంతో చెప్పే సన్నివేశంలో అతడి నటనను ఎంత పొగిడినా తక్కువే. ఒక అరగంట ఎపిసోడ్ నడిపితేే వచ్చే ఫీల్ ను తన హావభావాలు.. డైలాగులతో అతను తీసుకురాగలిగాడు. ఇంకా కూతురిని తలుచుకునే ప్రతి సన్నివేశంలోనూ కార్తి నటన కట్టిపడేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘నన్ను క్షమించమ్మా’.. అని తన కూతురికి చెప్పే సీన్లో కార్తి నటనకు మంచి అప్లాజ్ వస్తోంది. ఇక వీరత్వం చూపించే ఘట్టాల్లోనూ ఆకట్టుకున్నాడు. కార్తి కెరీర్లో ‘ఢిల్లీబాబు’ పాత్ర ఓ మైలురాయి అనడంలో సందేహం లేదు. హీరోతో పాటు ట్రావెల్ అయ్యే పోలీస్ అధికారిగా నరేన్ కూడా బాగా చేశాడు. వీళ్లిద్దరి వెంట ఉండే కుర్రాడు చక్కగా నటించాడు. హరీష్ ఉత్తమన్ కు మంచి పాత్ర దక్కింది. కానిస్టేబుల్ సహా మిగతా నటీనటులుందరూ బాగా చేశారు.

‘ఖైదీ’కి సాంకేతిక నిపుణులు పూర్తి బలాన్నిచ్చారు అని చెప్పొచ్చు. సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో.. ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది అని చెప్పొచ్చు.సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం గురించి చెప్పడానికి చాలా ఉంది. పూర్తిగా రాత్రి పూట సాగే సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఛాయాగ్రాహకుడి కష్టం.. ప్రతిభ కనిపిస్తాయి. ముఖ్యంగా లారీ ఛేజింగ్ సీన్ లో అన్ని కార్ల అద్దాలలోనుండి చూపించే సీన్ కెమెరా ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి కథతో సినిమా చేయడానికి ముందుకొచ్చి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాతలు ఎస్.ఆర్.ప్రభును అభినందించాలి. సినిమా అంతా నైట్ షూట్ అయినప్పటికీ విజువల్ పరంగా గ్రాండ్ గా కనిపించేలా ఎక్కడా రాజి పడకుండా నిర్మించారు. వారు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ‘నగరం’ సినిమాతో సత్తా చాటిన లోకేష్ కనకరాజ్.. ఈసారి ఒక సాహసోపేత కథను ఎంపిక చేసుకొని తనకు తానే సవాల్ విసురుకున్నాడు. టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆసక్తికరంగా నడిపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

‘ఖైదీ’లో పాత్రల పరిచయం కోసం కూడా పెద్దగా సమయం తీసుకోకుండా నేరుగా కథను మొదలుపెట్టిన దర్శకుడు.. హీరో పాత్ర తెరపైకి వచ్చేటప్పటికీ కథను విప్పేశాడు. పావు గంటకే హీరో టాస్క్ ఏంటి అన్నది వెల్లడైపోతుంది. మత్తు మందు కలిపిన మద్యం తాగిన పోలీసుల్ని ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం.. ఆ తర్వాత భారీగా డ్రగ్స్ నిల్వ ఉన్న పోలీస్ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న వాళ్లను కాపాడి సరకు బయటికి వెళ్లకుండా చూడటం అతడి బాధ్యతలు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తూ తన బాధ్యతల్ని పూర్తి చేశాడన్నదే ‘ఖైదీ’ కథ. సినిమా అంతా బోలెడంత యాక్షన్ ఉండటంతో ఆ వర్గం ప్రేక్షకులు పూర్తి సంతృప్తి చెందుతారు. ఇక హీరో-కూతురు మధ్య నడిచే ఎమోషనల్ థ్రెడ్ ఆడియన్స్ హృదయాల్ని తాకుతుంది. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే ప్రీ – క్లైమాక్స్ సన్నివేశాలు సెకండ్ హాఫ్ కి బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో మెషీన్ గన్ సీన్ సినిమాకే హైలైట్. వావ్ అనిపించే ఆ సీన్ కు తోడు హీరో-కూతురు మధ్య భావోద్వేగ సన్నివేశంలో సినిమాకు అదిరిపోయే ముగింపునిచ్చాయి. కథకు కట్టుబడి.. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్లకు ‘ఖైదీ’ ఒక బెస్ట్ ఛాయిస్. ఖైది లాంటి విభిన్న యాక్షన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్ గట్స్ కి హ్యాట్సాఫ్. ఈ చిత్రాన్ని మెయిన్ ఎసెన్స్ మిస్ అవకుండా తెలుగు ప్రేక్షకులకి శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై అందించిన కె కె రాధామోహన్ కి అభినందనలు.

బాటమ్ లైన్ : పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్

రేటింగ్ : 3.5 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here