రివ్యూ: ఓ బేబీ

0
1180

రివ్యూ: ఓ.. బేబీ

బ్యానర్ : సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్‌ పిక్చర్స్‌

తారాగణం: సమంత అక్కినేని, నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, తేజ సజ్జా, ప్రగతి, సునయన, ఊర్వశి తదితరులు.

స్పెషల్‌ అప్పియరెన్స్‌: నాగచైతన్య, జగపతిబాబు, అడివి శేష్‌.

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌

ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ

సంగీతం: మిక్కీ జె.మేయర్‌

మాటలు: లక్ష్మీభూపాల

సహ నిర్మాతలు : వివేక్ కూచిబొట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశి బండారు  

నిర్మాతలు: డి.సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్‌, హ్యున్‌వూ థామస్‌ కిమ్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి

విడుదల తేదీ: 05.07.2019

ప్రతి మనిషికీ కొన్ని కలలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎక్కువే ఆలోచిస్తారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి, పెళ్ళి తర్వాత తమ జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవాలి… ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అయితే జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి ఆ కోరికలు తీరకపోవచ్చు. ఆ నిరాశా నిస్పృహలతోనే వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. అలాంటి ఓ బామ్మ కథే ఈ శుక్రవారం విడుదలైన ‘ఓ.. బేబీ’. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’కి రీమేక్‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా బి.వి.నందినిరెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్‌ పిక్చర్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘మిస్‌ గ్రానీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అందించేందుకు దర్శకనిర్మాతలు ఎలాంటి కృషి చేశారు. ‘ఓ.. బేబీ’గా సమంత అక్కినేని తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ మరోసారి మెస్మరైజ్‌ చెయ్యగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

ఆమె పేరు సావిత్రి(లక్ష్మి). అందరూ ఆమెను బేబి అని పిలుస్తారు. 70 సంవత్సరాల బేబిలో వయసుతోపాటు వచ్చిన ఛాదస్తం ఉంటుంది. ఆమె చెప్పే మాటలు మంచివే అయినా ఎదుటి వారిని హర్ట్‌ చేస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో కొడుక్కి(రావు రమేష్‌), మనవడి(తేజ సజ్జా) తప్ప ఆమె అంటే అందరికీ అయిష్టమే. అత్తాకోడళ్ళ మధ్య అప్పుడప్పుడు మనస్ఫర్థలు వస్తుంటాయి. బేబి అనే మాటలకు కోడలు(ప్రగతి) మనస్తాపానికి గురవుతూ ఉంటుంది. ఓరోజు హఠాత్తుగా కోడలికి హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చి మంచాన పడుతుంది. ఆమె ఆరోగ్యం కుదుట పడాలంటే బేబీని దూరంగా ఉంచాలని డాక్టర్‌ సలహా ఇస్తుంటాడు. ఇది తెలుసుకున్న బేబీ ఎవరికీ చెప్పకుండా తనంతట తానే బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఊహించని విధంగా ఆమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయి. 70 ఏళ్ళ బామ్మ, 24 ఏళ్ళ భామగా మారిపోతుంది. బేబీ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అచ్చు అలాగే తయారవుతుంది. చిన్నవయసులోనే పెళ్ళి జరగడం, బాబు పుట్టడం, భర్త చనిపోవడం వంటివి చూసిన బేబీ అనుకోకుండా అమ్మాయిగా మారిపోవడంతో తను కోల్పోయిన ఆనందాల్ని ఆ క్షణం నుంచి వెతుక్కోవడం మొదలుపెడుతుంది. అమ్మాయిగా మారిన బేబీ ఆ తర్వాత ఏం చేసింది? ఎలాంటి సంతోషాల్ని పొందగలిగింది? తను జీవితంలో సాధించాలనుకున్నది ఏమిటి? బేబీ తిరిగి బామ్మగా మారిందా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

‘ఓ.. బేబీ’ చిత్రంలో ప్రధానంగా నాలుగు క్యారెక్టర్స్‌ నాలుగు పిల్లర్స్‌లా నిలిచాయి. యూ టర్న్‌, రంగస్థలం, మజిలీ చిత్రాల్లో అద్వితీయమైన నటనను ప్రదర్శించి నటిగా అందరి ప్రశంసలు అందుకున్న సమంత అక్కినేని ‘ఓ.. బేబీ’ చిత్రంలో మరోసారి తన పెర్‌ఫార్మెన్స్‌తో అందరి మనసులు దోచుకుంది. అమ్మాయిగా మారినా 70 ఏళ్ళ వృద్ధురాలిలాగే నడవడం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్‌ చెప్పడం… ఇలా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేసింది సమంత. కామెడీ సీన్స్‌లో ఎంటర్‌టైన్‌ చెయ్యడమే కాదు, కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌లో సైతం కంటతడి పెట్టించింది. బేబీ క్యారెక్టర్‌ సమంత తప్ప మరొకరు చెయ్యలేరు అన్నంతగా ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయింది. ‘ఓ.. బేబీ’ సినిమాతో సమంత అక్కినేని మరో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 70 ఏళ్ళ బామ్మగా నటించిన లక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటించిన ప్రతి సన్నివేశంలో ఆమె నటన ఎంతో సహజంగా, మన ఇంట్లోని బామ్మని చూస్తున్న ఫీలింగ్‌ కలిగిస్తుంది. ఆ బామ్మకు చిన్ననాటి స్నేహితుడు చంటిగా రాజేంద్రప్రసాద్‌ మరోసారి తనలోని సహజ నటుడ్ని బయటికి తీసుకొచ్చారు. తల్లి జాడ కోసం తల్లడిల్లిపోయే కొడుకుగా రావు రమేష్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. తల్లీకొడుకుల అనుబంధం గురించి సెకండాఫ్‌లో రావు రమేష్‌ చెప్పిన కొన్ని డైలాగ్స్‌ కంటతడి పెట్టిస్తాయి. 24 ఏళ్ళ అమ్మాయిగా మారిన బేబీతో లవ్‌లో పడే అబ్బాయిగా నాగశౌర్య సైతం తన క్యారెక్టర్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అయి నటించారు. మిగిలిన క్యారెక్టర్స్‌లో మనవడిగా తేజ సజ్జా, చంటి కూతురుగా సునయన, కోడలుగా ప్రగతి తమ క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. కథను మలుపు తిప్పే మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో జగపతిబాబు స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు. అలాగే అడివి శేష్‌ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారు. చివరలో ఫ్లాష్‌లా వచ్చే ఓ క్యారెక్టర్‌లో అక్కినేని నాగచైతన్య అందర్నీ ఆశ్చర్యపరిచారు.

సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాలంటే రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద హైలైట్‌గా చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే క్వాలిటీని మెయిన్‌టెయిన్‌ చేయడం వల్ల సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా సమంతను ఎంతో అందంగా చూపించడంలో ప్రసాద్‌ పనితనం కనిపిస్తుంది. కథను ఎక్కడా బోర్‌ కొట్టకుండా ముందుకు తీసుకెళ్ళడంలో ఎడిటర్‌ జునైద్‌ సిద్ధిఖీ కృషి మెచ్చుకోదగిందే. మిక్కీ జె. మేయర్‌ సంగీతంలో ఎలాంటి మెరుపులు కనిపించకపోయినా కథకు అవసరమైన పాటల్ని అందించడంలో తనవంతు కృషి చేశారు. కథ, కథనాలకు తగ్గట్టుగా తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఆకట్టుకున్నారు. లక్ష్మీభూపాల రాసిన మాటలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సెంటిమెంట్‌ డైలాగ్స్‌ కంటతడి పెట్టించేలా రాసిన లక్ష్మీభూపాలను అభినందించాల్సిందే. కుటుంబ నేపథ్యంలో సాగే ఒక అందమైన సినిమాను ప్రేక్షకులకు అందించడంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్‌ పిక్చర్స్‌ సంస్థలు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాయి. సన్నివేశం ఏదైనా, లొకేషన్‌ ఏదైనా సినిమాలో రిచ్‌నెస్‌ ఎక్కడా తక్కువ కాకుండా అన్‌కాంప్రమైజ్డ్‌గా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను అభినందించి తీరాలి. ఇక డైరెక్టర్‌ బి.వి.నందినిరెడ్డి గురించి చెప్పాలంటే.. ఆల్రెడీ ప్రూవ్‌ అయిన సబ్జెక్ట్‌ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలిచి దాన్ని స్క్రీన్‌పై అందంగా ప్రజెంట్‌ చెయ్యడంలో నందినిరెడ్డి కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవ్వకుండా, తర్వాతి సీన్‌లో ఏం జరగబోతోందనే క్యూరియాసిటీని కలిగించారు నందినిరెడ్డి. కథలో ఉన్న డెప్త్‌ని అర్థం చేసుకొని తమ క్యారెక్టర్స్‌లో ఇన్వ్‌వాల్వ్‌ అయిన సమంత, లక్ష్మి, రావు రమేష్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి గొప్ప ఆర్టిస్టుల నుంచి అసమానమైన నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు నందినిరెడ్డి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని కలిగించారు. ఫైనల్‌గా చెప్పాలంటే ‘ఓ.. బేబీ’ కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమా.

బాటమ్‌ లైన్‌: ఓ.. బేబీ – ఓ గొప్ప అనుభూతి

రేటింగ్ : 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here