రివ్యూ : ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌

0
715

సినిమా: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌
న‌టీన‌టులు: న‌వీన్ పోలిశెట్టి, శ్రుతి శ‌ర్మ త‌దిత‌రులు
సంస్థ‌: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్
స్క్రీన్ ప్లే: స్వరూప్ ఆర్.ఎస్.జే & నవీన్ పొలిశెట్టి
మ్యూజిక్: మార్క్ క్రోబిన్
కెమెరామెన్: సన్నీ కురపాటి
ఎడిటర్: అమిత్ తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
కాస్టూమ్ డిజైనర్: మౌనిక యాదవ్, వనజా యాదవ్
కథ, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా

డిటెక్టివ్ సినిమాలంటేనే యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ అంశాల‌తో సీరియ‌స్‌గానే సాగే సినిమాలే. అయితే తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే ఇందులోచంట‌బ్బాయ్ త‌ర‌హా సినిమాలో డిటెక్టివ్ కామెడీ కూడా చేస్తాడు. చంటబ్బాయ్ త‌ర‌హా కామెడీ డిటెక్టివ్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన సినిమాయే `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌`, `నేనొక్క‌డినే` చిత్రాల్లో చిన్న పాత్ర‌ల్లో న‌టించిన న‌వీన్ పొలిశెట్టి, స్క్రిప్ట్ రైట‌ర్‌గా కూడా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు ఆయ‌నే టైటిల్ పాత్ర‌ధారిగా న‌టించిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` ఎంత మేర ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడో చూద్దాం..

ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్‌గా రాణించాల‌నే ఆస‌క్తితో డిటెక్టివ్ సినిమాలు, పుస్త‌కాలు చ‌దివి ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌(ఎఫ్‌.బి.ఐ) అనే సంస్థ‌ను స్టార్ట్ చేస్తాడు. ఆత్రేయ ద‌గ్గ‌ర స్నేహ(శృతి శ‌ర్మ‌) అనే అమ్మాయి అసిస్టెంట్‌గా జాయిన్ అవుతుంది. ఆత్రేయ ప్రారంభంలో రెండు, మూడు చిల్ల‌ర కేసులు ప‌రిష్క‌రిస్తాడు. అదే క‌మ్రంలో ఆత్రేయ స్నేహితుడు, క్రైమ్ రిపోర్ట‌ర్ రైల్వే ట్రాక్స్ ద‌గ్గ‌ర గుర్తు తెలియ‌న శ‌వాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయ‌ని, పోలీసుల‌కు కూడా ఈ విష‌యం అర్థం కావ‌డం లేద‌ని చెబుతాడు. ఆ క్ర‌మంలో రైల్వే ట్రాక్ ద‌గ్గ‌రున్న ఓ గుర్తు తెలియ‌ని శ‌వం ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు ఆత్రేయ‌. అయితే పోలీసులు ఆత్రేయ‌నే అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేష‌న్‌లో ఆత్రేయ‌కి మారుతీరావు అనే ముస‌లాయ‌న త‌న కూతురు దివ్య క‌న‌ప‌డటం లేద‌ని ఫిర్యాదు చేస్తే పోలీసులు త‌న‌నే అన్యాయంగా ఇరికించార‌ని చెబుతాడు. జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆత్రేయ ఆకేసును టేక‌ప్ చేస్తాడు. అందులో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఫాలో అవుతుంటాడు. ఉన్న‌ట్లుండి ఆ ఇద్ద‌రినీ ఎవ‌రో హ‌త్య చేస్తారు. ఆ హ‌త్య కేసు ఆత్రేయ‌పై ప‌డుతుంది. సాక్ష్యాలు కూడా ఆత్రేయ‌కు వ్య‌తిరేకంగానే ఉంటాయి. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆత్రేయ‌, కేసు విచార‌ణ స్టార్ట్ చేస్తాడు. ఆ విచార‌ణ‌లో చాలా షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఆ విష‌యాలేంటి? అస‌లు దోషులెవ‌రు? చివ‌ర‌కు ఆత్రేయ నేర‌స్థుల‌ను ప‌ట్టుకున్నాడా? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

భ‌క్తి, భ‌యం అనేవి మ‌నిషిలో ఓ న‌మ్మకాన్ని క‌లిగిస్తాయి. ఇలాంటి న‌మ్మ‌కాల‌ను కొంత మంది వారి స్వార్ధానికి వాడుకుంటూ ఉంటారు. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్ర‌మే `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. టైటిల్ పాత్ర‌లో న‌టించిన న‌వీన్ పొలిశెట్టి చాలా అద్భుతంగా న‌టించాడు. సినిమా అంతా అత‌ని చుట్టూనే తిరుగుతుంది. మ‌నిషి ఏదో కామెడీ చేస్తున్నాడు అనేలా ఓ పాత్ర‌ను క్రియేట్ చేసి కాస్త కామెడీనీ ద‌ట్టించినా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బ‌లంగా ఉన్నాయి. త‌డ నుండి నెల్లూరు ప్రాంత నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌. అక్క‌డ జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు, ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని లింక్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రానీ ఓ పాయింట్ అనే చెప్పాలి. హ‌త్య‌లు అవ‌య‌వాల కోసం జ‌రుగుతున్నాయ‌ని అనుకుంటామంద‌రం… కానీ క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ బావుంది.

న‌వీన్ పొలిశెట్టి హీరోగా పాత్ర‌కు వంద‌కు వంద శాతం న్యాయం చేశాడు. మంచి క‌థ‌, స్క్ర్రీన్‌ప్లే అమ‌రింది. ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం చాలా బావుంది. మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో కీల‌కంగా మారింది. పాత్ర‌ల‌కు నెల్లూరు యాస‌ను ఆపాదించ‌డంతో అవి మాట్లాడుతున్న‌ప్ప‌డు కామెడీగా అనిపిస్తాయి.

ఫ‌స్టాఫ్ అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఏదో కేసును ప‌ట్టుకుని దాని వెన‌కే తిర‌గ‌డం వంటి సన్నివేశాలుంటాయి. ఈ పార్ట్‌లోకామెడీ కూడా ఉంటుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌చ్చేసరికి సినిమా సీరియ‌స్‌, థ్రిల్లింగ్ మోడ్‌లోనే సాగుతుంది. అస‌లు సినిమా కంటెంట్ అంతా ఇక్క‌డే ఉంది. న‌వీన్ పాత్ర త‌ర్వాత … హీరోయిన్ శృతిశ‌ర్మ పాత్ర‌కు న్యాయం చేసింది. ఇక లుక్ ప‌రంగా కూడా బావుంది. ఇక సినిమాలో మిగిలిన పాత్ర‌ధారులు ప్రేక్ష‌కుల‌కు ఇంత‌కు ముందే తెలిసినా, పేర్లు మాత్రం ప‌రిచ‌యం లేదు. స‌న్నీకూర‌పాటి కెమెరా ప‌నిత‌నం బావుంది.

మ‌నిషి న‌మ్మ‌కంతో ఉండాలి కానీ.. మూఢ న‌మ్మ‌కంతో కాదు.. అనే పాయింట్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌

బాటమ్ లైన్ : ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌.. ఆక‌ట్టుకునే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్
రేటింగ్‌: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here