‘నరుడి బ్రతుకు నటన’ మూవీ రివ్యూ
చిత్రం : నరుడి బ్రతుకు నటన
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, S స్క్వేర్ సినిమాస్
రిలీజ్ డేట్: 2024-10-25
CBFC రేటింగ్: UA
నిడివి: 2 గం 5 నిమిషాలు
నటీనటులు: శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య, వైవా రాఘవ్, దయానంద్ రెడ్డి.. తదితరులు
నిర్మాత: సింధు రెడ్డి, సుకుమార్ బోరెడ్డి, TG విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం, ఎడిటింగ్: రిషికేశ్వరి యోగి
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ముఖ్య పాత్రల్లో తెరకెక్కించిన ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో తెరకెక్కగా టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. నరుడి బ్రతుకు నటన సినిమా నేడు అక్టోబర్ 25న గ్రాండ్ థియెట్రికల్ రిలీజ్ అయింది.
కథ :
సత్య బాగా డబ్బున్న వ్యక్తి కొడుకు. యాక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న(దయానంద్ రెడ్డి) పేరు ఉపయోగించినా, సొంతంగా వెళ్లి ఆడిషన్స్ ఇచ్చినా ఒక్క అవకాశం కూడా రాదు. ఓ సారి అతనికి యాక్టింగ్ రాదు అని, అతను వరస్ట్ యాక్టర్ అని వాళ్ళ నాన్న, ఆడిషన్ లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్, ఆఖరికి అతని క్లోజ్ ఫ్రెండ్(వైవా రాఘవ్) కూడా చెప్తారు. లైఫ్ లో ఎమోషన్స్ లేకుండా యాక్టింగ్ లో ఎమోషన్స్ రావు, జీవితం అంటే ఏంటో తెలియాలి అని సత్య ఫ్రెండ్ చెప్పడంతో ఇల్లు వదిలేసి బయటకి వెళ్ళిపోతాడు సత్య. అలా కేరళ వెళ్లి తన దగ్గరున్న డబ్బులు అన్ని అయిపోవడంతో రోడ్డు మీద పడతాడు. డబ్బులు లేక, ఫోన్ పోగొట్టుకొని, తిండి లేక ఓ కేరళలోని ఓ పల్లెటూరు బస్టాప్ లో సత్య ఉండగా సల్మాన్ పరిచయం అవుతాడు. తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి, ఫుడ్ పెడతాడు. సత్య కథ విన్న సల్మాన్ తనని అక్కడే ఉండనిస్తాడు. దీంతో సత్య సల్మాన్ తో అదే ఊర్లో ఉంటూ ఆ ఊరి వాళ్ళతో పరిచయం చేసుకుంటూ అక్కడే గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో పక్కింట్లో ఒంటరిగా ఉండే ప్రగ్నెంట్ లేడి లేఖ(శృతి జయన్)ని ఇష్టపడతాడు సత్య. కానీ లేఖ డబ్బుల కోసం ఎవరికో సరోగసి ద్వారా బిడ్డని కనిచ్చిందని, సల్మాన్ కి ఓ లవ్ ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉందని తెలుస్తాయి. సత్య, సల్మాన్ ఎంత క్లోజ్ అయ్యారు? సత్య లేఖకు తన ప్రేమ విషయం చెప్తాడా? సత్య కేరళలోని ఆ పల్లెటూళ్ళో జీవితం గురించి ఏం నేర్చుకున్నాడు? సత్య యాక్టర్ అయ్యాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
జీవితం గురించి చెప్పే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అప్పట్లో వచ్చిన కమల్ హాసన్ సత్యం శివమ్ నుంచి ఇటీవల వచ్చిన కార్తీ సత్యం సుందరం సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ నరుడి బ్రతుకు నటన కూడా అదే కోవలోకి చెందిన సినిమా. యాక్టర్ అవ్వాలన్న ఓ వ్యక్తికి అసలు తనకు యాక్టింగ్ రాదు అని విమర్శలు ఎదుర్కొన్నాక జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనే క్రమంలో అతను ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అని చాలా బాగా చూపించారు. కేరళలోని ఓ పల్లెటూరు, అక్కడి మనుషులు, అక్కడి ప్రకృతి అందాలను బాగా చూపించాడు దర్శకుడు. సినిమా 90 శాతం కేరళలోనే జరిగినా, అక్కడక్కడా మలయాళం మాట్లాడినా భాష పరంగా ఎక్కడా ప్రాబ్లమ్ రాకుండా అందరికి అర్ధమయ్యే విధంగా బాగా రాసుకున్నాడు దర్శకుడు.
ముఖ్యంగా కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఏ యాక్టింగ్ అయితే రాదు అని సత్యని పంపించేసారో అదే యాక్టింగ్ లోని రకరకాల ఎమోషన్స్ తన ఫేస్ లో సహజంగా వచ్చేలా వాటి చుట్టూ సీన్స్ రాసుకొని ఆ సమయంలో సత్య ఎమోషన్ ఏంటి అని అద్భుతంగా చూపించారు. ప్రగ్నెంట్ లేడీతో ప్రేమ ఏంటి అని మొదట్లో అనుకున్నా దానికి ఇచ్చిన ఎండింగ్ బాగుంది. సల్మాన్ లవ్ స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. కమల్ హాసన్ గురించి ప్రస్తావించే సీన్స్ అన్ని బాగున్నాయి. ఇక కామెడీ పరంగా కూడా కొన్ని సన్నివేశాల్లో బాగా నవ్వించారు. మొత్తంగా ఓ వ్యక్తి అన్ని వదిలేసి దూరంగా వేరే ఊరు వెళ్లి జనాల్లోకి అతనికి ఓ వ్యక్తి పరిచయమై ఫ్రెండ్ అయ్యాక అతని జీవితం ఎలా మారింది అని చాలా అందంగా చూపించారు.
నటీనటులు పర్ఫార్మెన్స్ :
ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్స్ లో మెప్పించిన శివ కుమార్ రామచంద్రవరపు ఈ సినిమాలో స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఓ యాక్టర్ గా మెయిన్ లీడ్ లో అద్భుతంగా నటించి మెప్పించాడు. ప్రసన్నవదనం, అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లో అదరగొట్టిన నితిన్ ప్రసన్న ఈ సినిమాలో చాలా పాజిటివ్ రోల్ చేసి, అక్కడక్కడా నవ్వించి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలను అని నిరూపించాడు. మలయాళీ భామ శృతి జయన్ ప్రగ్నెంట్ లేడీ పాత్రలో అదరగొట్టేసింది. ఐశ్వర్య, వైవా రాఘవ.. మిగిలిన కేరళ నటీనటులు అందరూ కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కేరళ లొకేషన్స్ అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనసుకు హత్తునుకునేలా ఉంది. పాటలు అయితే వినడానికి చాలా బాగున్నాయి. ఒక సింపుల్ లైన్ ని అద్భుతమైన సన్నివేశాలతో రాసుకొని దర్శకుడు పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు. దర్శకుడే ఎడిటర్ కావడంతో ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసుకున్నాడు. నిర్మాణ పరంగా కూడా కథకు తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా బాగానే ఖర్చుపెట్టారు.
రేటింగ్ : 3.25/5
తుది తీర్పు : నటన నేర్పిన అందమైన జీవిత సత్యం “నరుడి బ్రతుకు నటన”