‘ఆయ్’ సినిమా రివ్యూ

0
342

రిలీజ్ డేట్:  15-08-2024 (ప్రీమియర్)
CBFC రేటింగ్: U/A
నిడివి: 2 గం 22 నిమిషాలు
దర్శకత్వం: అంజి K మణిపుత్ర
నిర్మాత: బన్నీ వాసు, విద్య కొప్పినీడి
బ్యానర్: GA2 Pictures
సంగీతం: రామ్ మిరియాల, అజయ్ అరసదా
DOP: సమీర్ కళ్యాణి
ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్

తారాగణం: నార్నె నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మైమ్ గోపి.. తదితరులు..

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆయ్’. నితిన్, నయన్ సారిక జంటగా సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రల్లో GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ఆయ్ సినిమా తెరకెక్కింది. ఆయ్ సినిమా నేడు ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చింది.

కథ :
హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో గోదావరి జిల్లాలోని తన ఊరికి వస్తాడు. ఊళ్ళో చిన్నప్పట్నుంచి కలిసి తిరిగిన ఫ్రెండ్స్ సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి) హరి(అంకిత్ కొయ్య)లతో తిరుగుతాడు. కార్తీక్ కి వాళ్ళ నాన్న బురయ్య(వినోద్ కుమార్) ఏమి సంపాదించలేదని, తన చదువుకి సపోర్ట్ చేయలేదని ఇష్టం ఉండదు. ఓ రోజు కార్తీక్ పల్లవి(నయన్ సారిక)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి ఆమె వెనక పడతాడు. ఇద్దరూ ప్రేమలో పడి కొన్ని రోజులు తిరిగాక కార్తీక్ క్యాస్ట్ తమ క్యాస్ట్ ఒకటి కాదని ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకుంటుంది పల్లవి. పల్లవి నాన్నవీరవాసరం దుర్గ(మైమ్ గోపి)కి క్యాస్ట్ పిచ్చి ఎక్కువ. మరి పల్లవి – కార్తీక్ ప్రేమకి పెద్దలు ఓకే చెప్పారా? కార్తీక్, అతని ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి పనులేంటి? కార్తీక్ వాళ్ళ నాన్నకి దగ్గరయ్యాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
నార్నె నితిన్ తన రెండో సినిమాకి మరింత పరిణీతి తెచ్చుకొని చాలా బాగా నటించాడు. నయన్ సారిక క్యూట్ గా, బబ్లీగా మెప్పించింది. అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీతో బాగా నవ్వించారు. వినోద్ కుమార్, మైమ్ గోపి, సరయు, VTV గణేష్.. మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు.

సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమాని తీశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సాంగ్స్ కూడా వినడానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కట్ చేసారు. పాత కథే అయినా చాలా కొత్త స్క్రీన్ ప్లేతో చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు అంజి. కొన్ని డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఇక సినిమాకు నిర్మాణపరంగా బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

విశ్లేషణ :
ఆయ్ సినిమాలో ఒక మంచి సీరియస్ క్యాస్ట్ సబ్జెక్ట్ ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కార్తీక్ ఊరికి రావడం, ఫ్రెండ్స్ తో చేసే కామెడీ, పల్లవితో ప్రేమ.. సాగుతుంది. ఇంటర్వెల్ ముందు పల్లవి ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకొని హీరోకి షాక్ ఇస్తుంది. దీంతో సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరూ కలుస్తారా అనే ఆసక్తి కలుగుతుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం ఫుల్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీసినట్టు అనిపించినా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ తో ప్రేక్షకులని మెప్పించారు. ఎవరూ ఊహించని ఆ క్లైమాక్స్ లో, ఎలివేషన్స్ కి ప్రేక్షకుల నుంచి విజిల్స్, అరుపులు వస్తాయి. సినిమా మొత్తాన్ని ఆ క్లైమాక్స్ ఇంకో ఎత్తుకు తీసుకెళ్లింది. తండ్రి ఎమోషన్ ని కూడా చివర్లో పండించారు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రత్యేకత ఉండేలా బాగా రాసుకున్నారు. హీరోయిన్ సోషల్ మీడియా స్టార్ గా, హరి రమ్య అనే ఆంటీ వెనక పడేలా, సుబ్బు కూడా పల్లవిని ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అయ్యేలా ఇలా.. ఒక్కొక్కరి క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో గోదావరి స్లాంగ్ అని చెప్పి తీసినా అవి సూట్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన గోదావరి యాస, వెటకారాన్ని చూపించారు. ఇక సినిమా మొత్తం గోదావరి జిల్లాల్లోని పచ్చని అందాలతో నింపేశారు. వర్షాకాలంలో సినిమా తీయడంతో మంచి విజువల్స్ తో ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. సినిమా చూసాక ఒక్కసారైనా గోదావరి జిల్లాలకు వెళ్లి రావాలని అనిపించడం ఖాయం. ఆయ్ సినిమా చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఆయ్ సినిమా ఫుల్ కామెడీ కోసం, ఒక మంచి ఆహ్లదకరమైన విజువల్స్ కోసం థియేటర్లో చూడొచ్చు. ఇంటర్ క్యాస్ట్ లవ్ కథలను ఇన్నాళ్లు చాలా సీరియస్ గా చూపిస్తే ఈ సినిమాలో మాత్రం కొత్తగా చూపించి ఆశ్చర్యపరిచారు.

"ఆయ్" పీపుల్స్ ఫ్రెండ్లీ బ్లాక్ బస్టర్ - 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here