రవితేజ “మిస్టర్ బచ్చన్ “ రివ్యూ

0
328

 

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్, తదితరులు
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్
DOP: అయనంక బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి

రవితేజ హీరోగా భాగ్యశ్రీ అనే కొత్త మరాఠీ భామ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్, డీజే వంటి మాస్ మసాలా సినిమాలు చేసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్లతో ఒక్కసారిగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకుపోయింది. దానికి తోడు పాటలు కూడా సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులలో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయింది. అంతకన్నా ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
కోటిపల్లి అనే గ్రామానికి చెందిన బచ్చన్(రవితేజ) ఒక నిజాయితీ గల ఇన్కమ్ టాక్స్ అధికారి. ఒక పొగాకు వ్యాపారి మీద రైడ్ చేసినందుకుగాను పై అధికారులు సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ కారణంగా సొంత గ్రామానికి వచ్చి ఒక ఆర్కెస్ట్రాలో హిందీ పాటలు పాడుకుంటూ గడిపేస్తూ ఉంటాడు. అదే ఊరికి వ్యాపార నిమిత్తం వచ్చిన ఒక మార్వాడి కుటుంబానికి చెందిన జిక్కి(భాగ్యశ్రీ)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా బచ్చన్ మీద మనసు పారేసుకుంటుంది. అంతా బావుంది అనుకుంటున్న సమయంలో ఇంట్లో తెలిసి పోవడంతో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఒక బిగ్ షాట్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ రైడ్ చేయాలని టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ కోసం పెళ్లికి ముందు బచ్చన్ తన సొంత గ్రామానికి చెందిన ఒక క్రూరుడైన బిగ్ షాట్(జగపతి బాబు) ఇంటికి వెళ్తాడు. అతని పేరు చెబితేనే వణికిపోయే స్థాయిలో ఉన్న సదరు బిగ్ షాట్ ఇంటికి రవితేజ రైడ్ కి వెళ్ళాడా? వెళితే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి? జిక్కి, బచ్చన్ ఒకటయ్యారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే ముఖ్యంగా రవితేజ ఈ సినిమాలో వన్ మాన్ షో చేశాడని చెప్పొచ్చు. తనదైన స్టైల్ తో స్వాగ్ తో ఒక రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు. రవితేజ అంటేనే ఎనర్జీ ఎనర్జీ అంటేనే రవితేజ అని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా డాన్స్, ఫైట్లు, డైలాగులు వంటి విషయాల్లో తనను కొట్టే వాడే లేడు అని మళ్ళీ రవితేజ నిరూపించుకున్నట్టు అనిపించింది. రవితేజ జోడిగా నటించిన భాగ్యశ్రీ మొదటి సినిమా అని ఎక్కడా అనిపించలేదు. డాన్స్ లో అయితే రవితేజ తో పోటీపడి కుర్రకారుని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. స్క్రీన్ మీద ఆమె చాలా అందంగా కనిపించింది. అసభ్యతకు తావు లేకుండానే ఆమె తనదైన శైలిలో అందాలను వెదజల్లి ప్రేక్షకులను మాయ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్దు జొన్నలగడ్డ కనిపించింది కాసేపే అయినా అదరగొట్టాడు. దేవిశ్రీప్రసాద్ కూడా ఒక పాటలో వచ్చి ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ విజిల్స్ వేయించేలా చేసుకున్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి సీఎం పీఏ పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. ఇక సత్య, చంద్ర కామెడీ అయితే ఒక రేంజ్ లో పండింది. అన్నపూర్ణమ్మ కూడా తన శైలిలో నవ్వించింది అంటే కామెడీ ట్రాక్స్ ఎంత బాగా వర్కౌట్ అయ్యాయో మీరు అర్థం చేసుకోవచ్చు.

విశ్లేషణ
హరీష్ శంకర్ చెబుతూ వచ్చినట్లుగానే ఈ సినిమా రైడ్ రీమేక్ అంటే అంత త్వరగా నమ్మలేము. ఎందుకంటే రైడ్ చూసినవాళ్లు ఈ సినిమా చూస్తే కేవలం ఒక్క రైడ్ సీక్వెన్స్ మాత్రమే తీసుకున్నారు మిగతాదంతా తెలుగు ధనానికి తగినట్టు మార్పులు చేర్పులు చేశారని చెప్పేస్తారు. రవితేజ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలో చాలా మార్పులు చేసినట్లు ఈజీగా అర్థమయిపోతుంది. ఒక నిజాయితీ గల అధికారి సస్పెన్షన్ కి గురై, వచ్చి పాటలు పాడుకుంటూ ఉండగా ప్రేమలో పడటం ఆ తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఒక పెద్ద టాస్క్ వచ్చి పడటం లాంటివి ఆసక్తికరం అనిపిస్తాయి. రవితేజ మార్క్ కామెడీతో ఫస్టాఫ్ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదరగొట్టేలాగే ఉన్నా ఆ తర్వాత కథ కాస్త ఊహకు అందేలానే ఉంటుంది. అయితే మధ్యలో వచ్చే హిందీ సాంగ్స్ తో పాటు తెలుగు సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఇది ఒక ఫక్తు కమర్షియల్ సినిమా. నిజాయితీగల హీరో, ఒక మంచి లవ్ ట్రాక్, అద్భుతమైన పాటలు, హీరో హీరోయిన్లు రొమాన్స్, టాపు లేపే ఫైట్లు ఇలా అన్ని లెక్కలు వేసుకుని సమపాళ్లలో మసాలా దట్టించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఏ సెంటర్ ఆడియన్స్ సంగతి పక్కన పెడితే బీ,సీ సెంటర్ల ఆడియన్స్ కి ఒక రేంజ్ లో ఎక్కేసే సినిమా ఇది. కామెడీతో పాటు రొమాన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతమైన సాంగ్స్ లాంటివి ఈ సినిమాని మాస్ ఆడియన్స్ లోకి బాగా తీసుకువెళ్తాయి. కొన్ని కొన్ని లోపాలు పక్కన పెట్టి చూస్తే ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ సినిమా అంటేనే లాజిక్స్ పక్కన పెట్టి చూడాలి కాబట్టి ఈ సినిమాని మాస్ ఆడియన్స్ ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా డైరెక్టర్ డీల్ చేశాడు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే హరీష్ శంకర్ దర్శకుడిగా ఎంత కష్టపడ్డాడో డైలాగ్ రైటింగ్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నాడు. మరో డైలాగ్ రైటర్ తో కలిసి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల కామెడీ ట్రాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయినంక బోస్ సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. హీరో హీరోయిన్లను చాలా కలర్ ఫుల్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం విలువలు బాగా సినిమాని ఎలివేట్ చేశాయి.

రేటింగ్ : 3/5

మిస్టర్ బచ్చన్ ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here