ఒక సామాన్యుడు తెగిస్తే కుటుంబం కోసం ఎంతదూరం వెళ్తాడో అదే ఈ ‘ఆదర్శ కుటుంబం’ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

0
1
Aadarsha Kutumbam Grand Pre-Release Event
Aadarsha Kutumbam Grand Pre-Release Event

ఘనంగా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ ప్రీ రిలీజ్ వేడుక

‘ఆదర్శ కుటుంబం’ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.. సిక్సర్ కొట్టబోతున్నాం : విక్టరీ వెంకటేష్

ఒక సామాన్యుడు తెగిస్తే కుటుంబం కోసం ఎంతదూరం వెళ్తాడో అదే ఈ ‘ఆదర్శ కుటుంబం’ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపావళి వెలుగులను కాస్త ముందుగానే తీసుకొస్తూ అక్టోబర్‌ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. “20 ఏళ్ల తర్వాత నాది, త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుంది. ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడి ఉండటం సహజం. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు చేసిన తరువాత కథ ఎంచుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ, త్రివిక్రమ్ ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్, సస్పెన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో ఇలాంటి అద్భుతమైన కథ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అక్టోబర్‌ 30న ఆదర్శ కుటుంబం విడుదల కాబోతుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను ఫ్యామిలీ సినిమాలు చాలా చేశాను. కానీ, ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఏం జరిగినా నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఈ ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను, వాళ్ళతోనే ఉంటాను.. అదే ఆదర్శ కుటుంబం. అభిమానుల ప్రేమ ఉంటే చాలు నాకు. మొదటి నుంచి నాకు ఆ ప్రేమను ఇస్తూనే ఉన్నారు. మన ఇండియన్ క్రికెటర్లు ఎలా సిక్సర్లు కొడుతున్నారో.. ఈ సినిమాతో స్టేడియం బయట మేము అలా సిక్సర్లు కొడతాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇంత మంచి సినిమాని ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ కి, నిర్మాతలు చినబాబు గారికి, నాగవంశీకి ప్రత్యేక కృతఙ్ఞతలు.” అన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఎంత గొప్ప ఫోటో అయినా లేదా పెయింటింగ్ అయినా అది తగిలించడానికి ఒక గోడ కావాలి. ఈ సినిమా ఇంత గొప్పగా తీర్చిదిద్దబడటానికి తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక గోడలాగా నిలబడ్డాడు. ఇవాళ పొద్దున్నే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్ చేశాం. నా గ్రాటిట్యూడ్ ని ఎలా ఎక్స్‌ప్రెస్‌ చేయాలో తెలియక.. తమన్ మాట్లాడున్న సమయంలో వచ్చి వెనక నిల్చున్నాను. నాకు అతనిలాగా సంగీతంతో మాట్లాడటం రాదు. కాబట్టి నా స్పర్శతోనే అతనితో మాట్లాడే ప్రయత్నం చేసి, అతని భుజం మీద చెయ్యేశాను. రచయితగా నా ప్రయాణాన్ని వెంకటేష్ గారి పవిత్ర బంధం సినిమాతోనే మొదలుపెట్టాను. ఓ రకంగా ఆయన నాతో ఓనమాలు దిద్దించారు. పెళ్ళి చేసుకుందాం సినిమా సమయంలో నేను ఎవరో తెలియకపోయినా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ‘నువ్వు నాకు నచ్చావ్’ కథ చెప్పినప్పుడు, అసలు నా మీద ఏ నమ్మకం ఉందో తెలియదు.. నేను కథ చెప్పడం పూర్తయిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం, ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దని రవికిశోర్ గారికి, విజయభాస్కర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటినుంచి నా కెరీర్ వేరే టర్న్ తీసుకుంది. అందుకే నేను వెంకటేష్ గారికి ఎప్పుడు కృతజ్ఞుడినై ఉంటాను. అదే సపోర్ట్ ఇప్పటికీ ఉంది. మేము బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే ప్రతిరోజూ సాయంత్రం మాతో నాలుగైదు గంటలు కూర్చొని నాకు, తమన్ కి ఎంతో హుషారు ఇచ్చారు. ఆయన ఉన్నారనే హుషారుతో తమన్ ఇంకా చెలరేగిపోయాడు అనిపించింది నాకు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క భాగం పంచుకున్నారు. కుటుంబంలో ప్రతివారికి గది ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో పని చేసిన ప్రతిఒక్కరికీ ఒక పార్టు ఉంది. ఇంటర్వెల్ లో కెవిన్ మాస్టర్ తాలూకు విశ్వరూపం చూస్తారు. ఆయన ఒక ఫైట్ ని కొరియోగ్రాఫ్ చేయలేదు, ఒక సీన్ ని డైరెక్ట్ చేశాడు. పాటలకి కొరియోగ్రాఫర్ అంటే ఆ మూడు రోజులో నాలుగు రోజులో వచ్చి వెళ్ళిపోతారు. కానీ, భాను మాస్టర్ అలా కాదు. మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పటి నుంచే మాతో టైం స్పెండ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి గారంటే మా కుటుంబం లాగా. సీతారామశాస్త్రి గారి సమయం నుంచే మాకు పరిచయం. శ్రీనిధి శెట్టి కథ వినగానే ఓకే చెప్పింది. నివేదా పేతురాజ్ మా కుటుంబం లాగా. అందుకే కథ కూడా వినకుండా ఓకే చెప్పేసింది. సెట్ లో సత్య నటనను చూసి మేమెంత ఎంజాయ్ చేశామో.. థియేటర్లలో మీరు అంత ఎంజాయ్ చేస్తారు. కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. మనం సెలెక్ట్ చేసుకోము. ఏ అమ్మానాన్నకి పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి అది మన చేతుల్లో ఉండదు. కావున కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. బంధాలన్నీ మనకి ఇవ్వబడతాయి. కానీ స్నేహితులను మనం ఎంచుకుంటాం. ప్రేమ కోసమైతే కోరుకుంటాం, వెంటపడతాం, ప్రాణాలు తీసుకునే అంతగా ప్రయత్నిస్తాం, యుద్ధం కూడా చేస్తాం. కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. స్నేహితులను మనం ఎంచుకుంటాం. ప్రేమ మనం కోరుకుంటాం. అలా ఒక ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడుకోవడానికి నలుగురు మనుషులు. చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు మనుషులు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎంత దూరం వెళ్ళారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా తాలూకు కథ. ఇంకో మాటలో చెప్పాలంటే.. కృష్ణుడు గీత రెండుసార్లు చెప్పాడు. మొదటిది అర్జునుడికి కురుక్షేత్రం సమయంలో.. అది భగవద్గీత. రెండోవది యాదవుల్లో ముసలం పుట్టి, యమునా నది దగ్గర ఒకరినొకరు చంపుకుంటుంటే.. అతను నాకు వీళ్ళతో సంబంధం లేదని చెప్పి, తన కుటుంబం తన కళ్ళ ముందే చనిపోతుంటే, నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే.. ఉద్ధవుడు అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పిన గీతను ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవ గీతలో రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ తాలూకు మనస్తత్వాలు ఎలా ఉంటాయి? చెప్పాడు. మనుషుల్లో ఆశ, కోరిక, కలహ ప్రియత్వం ఈ మూడూ ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచంలో మనుషులు అలాగే ఉన్నారు. ప్రపంచ ఇలా ఉంటుందని దాదాపు 5000 సంవత్సరాల క్రితమే ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమాజంలో కుటుంబం మాత్రమే మనకి ఇంకా తోడుగా ఉంది. అది కూడా ముక్కలైపోతే మనుషులు దేనికోసం బతకాలి. మనుషులు బతకడానికి ఒక పర్పస్ అయితే ఉండదు. అందుకే నేను కుటుంబ బంధాలను గానీ, కుటుంబ విలువలను గానీ అంతలా ఇష్టపడతాను. వాటి గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని బావుల్లోనుంచి ఎంత నీరు తోడినా ఆ నీరు పూర్తవదు. ఎందుకంటే ఆ బావి ఎండిపోదు. కుటుంబం కూడా అలాంటి బావి. చాలా లోతైనది, చాలా తియ్యనైనది. మన దాహాన్ని, మన ఆర్తిని తీరుస్తుంది. అలాంటి కుటుంబాలు, వాటిని ఆనందింపజేసే విషయాలు, వాటిని ఉత్తేజపరిచే విషయాలు, వాటిని భయపెట్టే విషయాలు, వాళ్ళ తాలూకు సమస్యలు, వాటి పరిష్కారాలు.. ఇవన్నీ చెప్పడానికి సరైన మనిషి ఎవరున్నారు వెంకటేష్ గారు తప్ప. కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రెస్ వెంకటేష్ గారు. ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన హీరో వెంకటేష్ గారు. ‘ప్రపంచమొక పద్మవ్యూహం – కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కుటుంబం ఒక పద్మవ్యూహం.. అందులోకి అభిమన్యుడిలాగా వెళ్ళి, బయటకు రావడం తెలియక చనిపోతారా? అర్జునుడిలాగా వెళ్ళి గెలిచి విక్టోరియస్ గా బయటకు వస్తారా? అనేదే ఈ సినిమా మనకి చెప్తుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా పేరుపేరునా కృతఙ్ఞతలు. ప్రస్తుతం ఆంధ్రాలో తుఫాను బీభత్సం ఉంది. అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలని.. ఈ తుఫాను వాళ్లకి నీళ్లనే ఇస్తుంది తప్ప కన్నీళ్లను మిగల్చదని నమ్ముతూ.. మనందరి తరపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అన్నారు.

కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “మరో మూడు రోజుల్లో అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ విడుదలవుతుంది. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. తెలుగు అమ్మాయిలా అనిపించాలని నేను సొంతంగా డబ్బింగ్ చెప్పాను. హారిక అండ్ హాసిని బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. చినబాబు గారు, నాగవంశీ గారు ఎంతో సపోర్ట్ చేశారు. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో సినిమా చేయడమనేది వరంలా భావిస్తున్నాను. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో ఖచ్చితంగా సినిమా చేయాలని నా తోటి నటీనటులందరికీ చెబుతాను. వెంకటేష్ గారిని అందరూ దశాబ్దాలుగా ఎంతో అభిమానిస్తూ వస్తున్నారు. షూటింగ్ సమయంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ కోసం నేను ఎంతగానో ఎదురుచూశాను. నువ్వు నాకు నచ్చావ్ నుంచి వీరి సినిమాలు నాకెంతో ఇష్టం. ఆ కలయికలో సినిమా చేయడం అనేది డ్రీమ్ లాంటిది. ఇది పాటల సినిమా కాదు.. మాటల సినిమా. త్రివిక్రమ్ గారి మాటలంటే ఎంతో ఇష్టం. ఆదర్శ కుటుంబం కొత్తగా ఉంటుంది. సినిమా కోరినట్టుగా కొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏడు ట్రాక్స్ ఉన్నాయి. అవన్నీ మీ అందరినీ మెప్పిస్తాయి. మొదటి రోజు నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా పని చేశాను. నేను అతడు సినిమాకి మణిశర్మ గారి దగ్గర ప్రోగ్రామర్ గా పనిచేశాను. అప్పుడే త్రివిక్రమ్ గారిని చూసి జీనియస్ అనుకున్నాను. ఆయన ఆలోచనలు పది అడుగులు ముందుంటాయి. జీవితంలో మనం ఒక్కరి మాటైనా వినాలి. నేను త్రివిక్రమ్ గారి మాట వింటాను. త్రివిక్రమ్ గారితో చేసిన అరవింద సమేత సినిమా తరువాత నా జీవితం మారిపోయింది. నా జీవితాన్ని కొత్తగా రచించిన త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు. నిర్మాత రాధాకృష్ణ గారు ఏ విషయంలోనూ రాజీ పడకుండా, నీ వెనుక నేనున్నాను అని ప్రోత్సహిస్తూ ఉంటారు. వెంకటేష్ గారు ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. మనం ఏదైనా పని చేస్తుంటే ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. ‘ఆదర్శ కుటుంబం’ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.

నటి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. “ఆదర్శ కుటుంబం షూటింగ్ ప్రతిరోజూ ఓ హాలిడేలా అనిపించింది. మళ్ళీ మళ్ళీ షూట్ కి వెళ్ళాలి అనిపించింది. మూవీ టీం అంతా ఎంతో పాజిటివ్ గా ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్ గారు గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఇది నాకు రెండో సినిమా. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మొదటి అవకాశమిచ్చారు త్రివిక్రమ్ గారు. నటిగా ఆ సినిమా నాకెంతో గుర్తింపు తీసుకొచ్చింది. ఆదర్శ కుటుంబంలో నాకు అవకాశమిచ్చిన త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. అక్టోబర్ 30న విడుదలవుతున్న ‘ఆదర్శ కుటుంబం’ కోసం మీ అందరిలాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” అన్నారు.

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ గారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. ఆయన సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోతుంది. త్రివిక్రమ్ గారు రాసిన మాటలను పలకడం అనేది నటీనటులకు అదృష్టం లాంటిది. ఆ అదృష్టం నాకు దక్కింది. వెంకటేష్ గారు ఎన్ని హిట్లు వచ్చినా పొంగిపోకుండా మహర్షిలా ఉంటారు. నిర్మాత చినబాబు గారు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. అక్టోబర్ 30న విడుదలవుతున్న మంచి సినిమా ‘ఆదర్శ కుటుంబం’ను చూసి అందరూ ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాను.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ప్రీ రిలీజ్ వేడుక ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. నటీనటులు రజిత, సత్య, ఉదయ్‌బీర్ సంధు, యువినా, రాజ్ ప్రజ్వల్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, కొరియోగ్రాఫర్ భాను మాస్టర్, ఫైట్ మాస్టర్ కెవిన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని ‘ఆదర్శ కుటుంబం’ ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here