“కమిటీ కుర్రోళ్లు” మూవీ రివ్యూ

0
211

నటీనటులు :
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల,
బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్,
నిర్మాతలు – పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ,
సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు,
మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్,
ఎడిటర్ – అన్వర్ అలీ,
డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్,
నృత్యం – జె.డి మాస్టర్,
.

మెగా డాటర్ నిహారిక ఇప్పటికే సినిమా హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది, కానీ పెద్దగా ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. నిర్మాతగా మారిన ఆమె ఇప్పటివరకు వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాలు చేసింది. మొదటిసారిగా ఆమె థియేటర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమా చేసింది. నిహారిక సమర్పిస్తూ తన తల్లి పేరుని నిర్మాతగా ప్రకటిస్తూ కమిటీ కుర్రోళ్లు అనే సినిమా చేసింది. 11 మంది హీరోలు, కొత్త దర్శకుడు కావడంతో సినిమా ఎలా ఉంటుందా? అని చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే టీజర్ తో పాటు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. సినిమా ప్రమోషన్స్ తో ఆ ఆసక్తి నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 9వ తేదీన తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ ముందే ఈ సినిమా హక్కులు మరో నిర్మాత కొనుగోలు చేయడం కొంత ఆసక్తి రేకెత్తించింది. అయితే మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

కథ విషయానికి వస్తే
ఈ సినిమా కథ గోదావరి జిల్లాలోని ఒక కల్పిత గ్రామంలో జరుగుతూ ఉంటుంది. రాబోతున్న జాతర ఏర్పాట్లలో భాగంగా ఊరి పెద్దలు పంచాయతీ నిర్వహిస్తారు. ఆ పంచాయతీలో శివ (సందీప్ సరోజ్) తన తండ్రి (గోపరాజు రమణ) స్థానంలో ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతాడు. మరోపక్క అప్పటికే ప్రెసిడెంట్ గా ఉన్న బుజ్జి (సాయికుమార్) వర్గం శివకి ఏం అనుభవం ఉందని ప్రశ్నిస్తారు. అయితే అనుభవాల సంగతి పక్కన పెడితే ఊరి జాతర అయిన పది రోజులకే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జాతరలో గొడవలు జరగకుండా జాతర పూర్తయిన తరువాతే ప్రచారం చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతరలో జరిగిన విషయాన్ని గురించి కూడా హెచ్చరిస్తారు. అయితే అసలు 12 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఒక జట్టులా తిరిగే 11మంది కుర్రాళ్ళు ఎందుకు చుట్టుకొకరు పుట్టుకొకరుగా విడిపోయారు? స్నేహితులుగా ఉన్న వీరికి కులాలు, రాజకీయాలు రంగు ఎందుకు పులుముకుంది ? ఆ స్నేహితులు తిరిగి మళ్ళీ ఒక్కటవుతారా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రసాద్ బెహరా అనే కుర్రాడు తప్ప మిగతా పదిమంది కుర్రాళ్ళు మనకి కొత్త వాళ్లే.. అయినా సరే వాళ్లు వాళ్ల ఒరిజినల్ పేర్ల కంటే తమ పాత్రల పేర్లతోనే గుర్తిండి పోయేలా నటించారు. ముఖ్యంగా సందీప్ సరోజ్ అనే కుర్రోడు శివ అనే పాత్రలో నటించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. సుబ్బు, సూరి, విలియం, బ్రిటిష్, ఆత్రం అంటూ ఒక్కొక్కరు తమ పాత్రలలో లీనమైపోయి నటించారు. ప్రసాద్ బెహరాకి తన కెరీర్లో అత్యద్భుతమైన రోల్ పడిందని చెప్పచ్చు. ఇప్పటివరకు తనకున్న కామెడీ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో నటించాడు. కంచారపాలెం కిషోర్ కి కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. గోపరాజు రమణ, సాయికుమార్, బలగం జయరాం సహా ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. నిహారిక ఒక సాంగ్ లో కనిపించి సందడి చేసింది.

విశ్లేషణ :
సినిమా ప్రారంభమే ఒక పంచాయతీతో ఉంటుంది. పెద్దగా సమయం తీసుకోకుండానే కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కొందరికి డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఎక్కువమంది ఆ సీన్స్ కు కనెక్ట్ అయ్యేలా రాసుకోవడం దర్శకుడు పనితనానికి నిదర్శనం. నిజానికి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ప్రేక్షకులు చాలామంది తమ చిన్నతనంలో చేసిన చిలిపి పనులను, సరదా అంశాలను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. అలాగే తమ చిన్ననాటి స్నేహితులతో కొంతసేపైనా సమయం గడుపుతూ బావుండు అనిపించేలా ఆ సీన్స్ అనిపిస్తాయి. సరదా సరదాగా సాగిపోతున్న సినిమాని రిజర్వేషన్ల అంశంతో ఒక్కసారిగా హీట్ ఎక్కించారు. నిజానికి రిజర్వేషన్ల విషయం చాలా సున్నితమైనది. కానీ దాన్ని తనదైన శైలిలో డీల్ చేయడం దర్శకుడు తీసుకున్న డేరింగ్ స్టెప్.. ఏమాత్రం తేడాపడినా ఈ సినిమా మీద ఎన్నో వివాదాలు తెరమీదకు వచ్చేవి.. కానీ ఎంతో పరిశీలిస్తే తప్ప అర్థం కాని విధంగా దర్శకుడు తీసిన కొన్ని షాట్స్ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగిపోతూ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సీరియస్ నోట్ లోకి వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా అంతా ఎమోషనల్ గా అనిపిస్తుంది. కాస్త సున్నితమైన వారు, స్నేహం మీద మంచి అభిప్రాయం ఉన్నవారు కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు అనడంలో సందేహం లేదు. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎన్నికల సన్నివేశాలు కూడా ఒకవైపు నవ్విస్తూ మరొక వైపు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ మరోలా ఉంటే సినిమా రిజల్ట్ మీద ఇంకా మంచి ఎఫెక్ట్ ఉండేదేమో?

టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాలో 11 మంది హీరోలతో పాటు 12వ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనోడు ఇచ్చిన చాలా పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. సినిమాటోగ్రాఫర్ సినిమాలో కోనసీమ అందాలను చూపించడంతో పాటు చాలా సీన్స్ ఎలివేట్ అయ్యేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ అదిరిపోయింది. కానీ నిడివి విషయంలో ఎడిటింగ్ టేబుల్ మీద మరింత కేర్ తీసుకుంటే బాగుండేది.

రేటింగ్: 3.25/5
చివరగా: కమిటీ కుర్రోళ్లు అన్ని ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్.. స్నేహితులతో చూస్తే మరింత కనెక్ట్ అయ్యే సినిమా ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here