సూపర్ స్టార్ మహేష్.. తెలుగు సినీ ఇండస్ట్రీని విజయాల పరంగా, సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కించి, నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకుని తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్న హీరో కృష్ణ తనయుడిగా.. తండ్రికి తగ్గ కొడుకుగా సినీ ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. హీరోగా మారటం ఎవరైనా చేస్తారేమో కానీ తండ్రి అడుగు జాడల్లో నడటం అనే బాధ్యతను గుర్తెరిగి దాన్ని అభిమానుల నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్నారు మహేష్. ఓ వైపు అభిమానుల ఆశలను నేరవేరుస్తూ, కుటుంబానికి ప్రాదాన్యతనిస్తూ, వృత్తిపరంగా సూపర్‌స్టార్ ఇమేజ్‌ను కాపాడుకుంటూ ఇంటెగ్రేటెడ్ పర్సనాలిటీగా నిరూపించుకుంటున్నారు. ఆయన ఈ ప్రయాణంలోనూ మహేష్ ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. ఆ ప్రయాణాన్ని ఓ సారి చూస్తే…
బాలనటుడిగా…
హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తండ్రి కృష్ణ ఇచ్చిన స్ఫూర్తితో చిన్నతనంలోనే మహేష్ నీడ చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకుదిద్దిన కాపురం, అన్నాతమ్ముడు, బాలచంద్రుడు చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు.
హీరోగా సినీ ప్రయాణం..
రాజకుమారుడు చిత్రంతో మహేష్ హీరోగా తన సినీ జర్నీని స్టార్ట్ చేశారు. అశ్వినీదత్ నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటుడిగా మంచి మార్కులను సంపాదించుకున్నారు మహేష్. ఈ సినిమాతో డెబ్యూ హీరోగా తొలి నంది అవార్డును కూడా దక్కించుకున్నారు. తర్వాత యువరాజు, వంశీ చిత్రాలతో అలరించిన మహేష్ తర్వాత నటించిన మురారి చిత్రంలో బెస్ట్ పెర్ఫామర్‌గా ప్రేక్షకుల నుంచే కాదు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో కమర్షియల్ సినిమాల దర్శకులకే కాదు, డిఫరెంట్ సినిమాలు చేయాలనుకునే వారికి మహేష్ ఓ సమాధానంగా దొరికారు. తర్వాత చేసిన టక్కరి దొంగ, బాబీ వంటి ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ చేసిన మహేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కల్ట్ క్లాసిక్ మహేష్‌ను స్టార్ హీరోగా నిలబెట్టింది. నిజం సినిమాలో మహేష్‌లోని యాక్టర్‌ను ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేసింది. అలాగే నాని వంటి ఎక్స్‌పెరిమెంట్ మూవీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే అర్జున్ వంటి కమర్షియల్ మూవీతో మెప్పించారు. ఈ సినిమా కూడా నంది అవార్డును దక్కించుకుంది.
అతడు నుంచి మహేష్ స్పీడందుకున్నారు. కథలో వైవిధ్యంతో పాటు హీరోయిజమున్న సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఆక్రమంలోనే ఆయన చేసిన అతడు సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌తో చేసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ సూపర్‌స్టార్‌గా మారారు. తర్వాత అతిథి, సైనికుడు, ఖలేజా చిత్రాలతో ఆడియెన్స్‌ను అలరించిన మహేష్ దూకుడు సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ సాధించి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపించారు. అదే స్పీడులో చేసిన బిజినెస్ మేన్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. అలాగే నేటి తరం హీరోల్లో మల్టీస్టారర్ చిత్రాలకు శ్రీకారం చుట్టారు. వెంకటేష్‌తో కలిసి ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీ సంక్రాంతి సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచింది. తర్వాత ఆగడు వంటి కమర్షియల్, వన్ నేనొక్కడినే వంటి టాప్ టెక్నికల్ మూవీతో మహేష్ అభిమానులను అలరించారు. కేవలం కమర్షియల్ ఫార్మేట్ చిత్రాలకే కాకుండా ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ చేసిన మహేష్ సందేశాత్మక చిత్రాలకు కూడా పెద్ద పీట వేశారు. శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి దేశభక్తి చిత్రాల్లో నటించారు. తర్వాత సర్కారు వారి పాట, గుంటూరు కారం వంటి కమర్షియల్ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను కొల్లగొట్టి తన రేంజ్ ఏంటో చూపించారు.
రాజమౌళి దర్శకత్వంలో..
ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటి వరకు ఏ చిత్రం కోసం ఖర్చు పెట్టని బడ్జెట్‌లో ఫారెస్ట్ అడ్వెంచరస్ కథతో దీన్ని తెరకెక్కించనున్నారు. దీని కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మంచి మనసు…
తండ్రికి తగ్గ తనయుడిలా మహేష్ సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చాలా చురుకుగా ఉంటున్నారు. శ్రీమంతుడు సినిమాలోలాగానే నిజ జీవితంలోనూ మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి రియల్ హీరోగా నిలిచారు మహేష్. ఇక కరోనా సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ఇవ్వటమే కాకుండా తెలుగు సినీ కార్మికుల కోసం పాతిక లక్షలు రూపాయలు విరాళాన్ని అందించి తన మంచి మనసుని చాటుకున్నారు సూపర్‌స్టార్.
బ్రాండ్ అంబాసిడర్, వ్యాపారవేత్త, నిర్మాతగా..
మహేష్.. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ స్టార్ట్ చేసి శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఏషియన్ మల్టీప్లెక్స్ వారితో కలిసి హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏఎంబీ మాల్‌ను నిర్మించారు. ఇక పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు నెంబర్ వన్ పోజిషన్‌లో నిలిచారు మహేష్.
ఇలా సూపర్‌స్టార్‌గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మహేష్ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మహేష్ ఇలాంటి పుట్టినరోజులను మరెన్నింటినో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…