రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నా కోరిక… అయితే త్రివిక్రమ్ కమిట్మెంట్స్ చూసుకోవాలి – నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఇంటర్వ్యూ 

0
190

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ‘స్రవంతి’ రవికిశోర్ ముచ్చటించారు. ఆ విశేషాలు…

నిర్మాతగా 38 ఏళ్ళ ప్రయాణం మీది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?
దాదాపుగా నేను చేసిన సినిమాలు అన్నీ సంతృప్తి ఇచ్చాయి. ఆర్ధికంగా కాకపోయినా నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఉన్నాను. ఎందుకు చేశాననే ఫీలింగ్ అయితే లేదు. నాకు కథ బాగా నచ్చితే ముందడుగు వేస్తా. నమ్మకం కుదరకపోతే సినిమా చేయను. ఎప్పుడూ డబ్బులు గురించి ఆలోచించను. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? లేదా? అని  ఆలోచిస్తా.

మీ ప్రయాణంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం?
మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు దర్శకుడు ఏం తీయబోతున్నాడో నాకు ముందుగా తెలియాలని కోరుకుంటా. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సెట్స్ మీదకు వెళతా. ఐదారు నెలల నుంచి ఒక స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరో మూడు నెలలు పట్టవచ్చు. ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు మరో స్క్రిప్ట్ గురించి ఆలోచించను. తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. నేను ఇప్పటి వరకు బౌండ్‌ స్క్రిప్ట్ లేకుండా ఒక్క సినిమా కూడా చేయలేదు. నాకు సినిమా తప్ప మరో వ్యాపారం లేదు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్… ఏదైనా బాధ్యత నేను తీసుకుంటా. మరొకరిని నిందించను.

మీ మొదటి తమిళ సినిమా ‘కిడ’. ఈ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది?
నేను చెన్నైలో ఉన్నప్పుడు కథలు వింటున్నా. నా స్నేహితుడు ఒకరు ‘ఓ కథ విన్నా. మీరూ వినండి’ అని పది నిమిషాలు చెప్పాడు. నాకు నచ్చింది. వెంటనే దర్శకుడు ఆర్ఏ వెంకట్ నంబర్ తీసుకుని ఫోన్ చేశా. వేరే నిర్మాతతో చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే చెప్పమని అడిగా. పదిహేను రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. వేరే నిర్మాతకు ఏవో సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు స్క్రిప్ట్ అంతా రికార్డ్ చేసి పంపించమని అడిగా. బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్‌ చేసి పంపించాడు. అది విని ఓకే చేశా. నేను ఏ రోజూ అతని పనిలో జోక్యం చేసుకోలేదు. ప్రాణం పెట్టి కథ రాసుకున్నాడు. బడ్జెట్ ఎంత? ఎన్ని రోజులు షూటింగ్ చేస్తావ్? అని మాత్రమే అడిగా. ఎప్పటికప్పుడు డబ్బులు ఏర్పాటు చేశా. శ్రీకర్ ప్రసాద్, తపస్ నాయక్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్లు హెల్ప్ చేశారు. నేపథ్య సంగీతం జరిగేటప్పుడు నేను వెళ్ళా.

థియేటర్లలో విడుదల చేయడానికి ముందు ‘దీపావళి’కి అవార్డులు వచ్చాయి! మీ ఫీలింగ్ ఏంటి?
దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 11న తెలుగులో ‘దీపావళి’ పేరుతో, తమిళనాడులో ‘కిడ’ పేరుతో విడుదల చేస్తున్నాం. నేను కథ నమ్మి ఇన్వెస్ట్ చేశా. నాకు లాభం ఎంత వస్తుందని ఆలోచించకుండా మంచి సినిమా అవుతుందని నమ్మాను. సినిమా చూసిన కొందరు మిత్రులు ‘ఫిల్మ్ ఫెస్టివల్స్ లేదా అవార్డులకు ఎందుకు పంపించకూడదు?’ అని అడిగారు. అప్పటికి థియేటర్లలో విడుదల చేద్దామా? ఓటీటీకి ఇద్దామా? అని ఆలోచిస్తున్నా. స్నేహితుల మాటలతో ఇండియా పనోరమాకు పంపించా. ఒక రోజు సినిమా సెలెక్ట్ అయ్యిందని ఫోన్ వచ్చింది. అదొక గొప్ప అనుభూతి. తర్వాత చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి ఇస్తుంది. మనసుకు హత్తుకునే చిత్రమిది.

మనకి సంక్రాంతి పెద్ద పండగ. తమిళులకు దీపావళికి పెద్ద పండగ. ఆర్ఏ వెంకట్ అయితే కథకు న్యాయం చేస్తారని తమిళంలో సినిమా చేశా. ముందు తెలుగులో మన తనికెళ్ళ భరణి గారితో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించినా తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నా.

పేరున్న నటీనటులతో కాకుండా పూ రాము, కాళీ వెంకట్… ఇలా ప్రేక్షకులకు కొంచెం పరిచయం ఉన్న ఆరిస్టులతో సినిమా తీయడానికి కారణం?
తమిళంలో సినిమా తీశాం. వాళ్ళు తమిళులకు బాగా తెలుసు. కరోనా తర్వాత మన ప్రేక్షకులకు తెలుగు కంటెంట్ మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదని, అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారని అర్థం అయ్యింది. డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగుతో సమానంగా ఆదరిస్తున్నారు. తమిళంలో తీసినా సరే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్నాయి. ‘బలగం’ చూసిన తర్వాత తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నా.

ప్రీమియర్ షోలకు ఎటువంటి స్పందన లభిస్తోంది?
తెలుగులో ‘దిల్’ రాజుతో పాటు మీడియా కూడా సినిమా చూసింది. బావుందని ప్రశంసించారంతా. చెన్నైలో సుమారు 200 మంది మీడియా మిత్రులకు షో వేశాం. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అంతకు ముందు గోవాలో కూడా అటువంటి స్పందన లభించింది.

అవార్డు సినిమాలకు కమర్షియల్ సక్సెస్ ఉండదనే అభిప్రాయం గతంలో ఉండేది. ఇప్పుడు అది మారింది. ఇటువంటి సినిమా తీయడానికి అదీ ఓ కారణమా?
కరెక్ట్ పాయింట్ అండి! తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా ఆదరిస్తారని నమ్ముతున్నా. కమర్షియల్ సినిమాలతో పాటు ఇటువంటి సినిమాలు కూడా తీయాలని ఆలోచన.

దీపావళికి పెద్ద సినిమాల మధ్య మీ ‘దీపావళి’ సినిమాను విడుదల చేస్తున్నారు! దీపావళి పండక్కి బాణాసంచా వెలుగులు ఎంత ముఖ్యమో… పిండి వంటలు, కొత్త దుస్తులు కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా కూడా అంతే! ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ని కూడా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నా.

ఆర్ఏ వెంకట్ ఆఫీస్ బాయ్‌గా వర్క్ చేశారని విన్నాం. ఆయనకు ‘దీపావళి’ దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి కారణం?
కథ అండీ. కథ నచ్చింది. అందులో భావోద్వేగాలు నచ్చాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అనిపించింది. అందుకని, అవకాశం ఇచ్చాను. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు.

తమిళంలో ఇంకా కథలు వింటున్నారా?
కరోనా తర్వాత ఇండియా అంతా ఒక్కటే అనిపిస్తుంది. మంచి కథ కుదిరితే ఎక్కడ అయినా సరే మనం సినిమా చేయవచ్చు.

‘దీపావళి’ని మిగతా భాషల్లో కూడా విడుదల చేస్తారా?
ఓటీటీలో అనువదిస్తే బావుంటుంది. ఆ దిశగా ఆలోచించాలి. థియేట్రికల్ రిలీజ్ ప్లాన్స్ అయితే లేవు.

మీ ఇంట్లో స్టార్ హీరో ఉన్నారు. మీరు అడిగితే పెద్ద హీరోలు కూడా సినిమాలు చేస్తారు. మీరు చిన్న సినిమా చేయడానికి కారణం?
రామ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నేను చేసిన సినిమాల కంటే చేయకుండా ఆపేసిన స్క్రిప్ట్స్ ఎక్కువ. రామ్ వరకు వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేశాం. కథపై నాకు సంతృప్తి కలిగినప్పుడు రామ్ హీరోగా సినిమా చేస్తా.

‘నువ్వే నువ్వే’ విడుదలై 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా త్రివిక్రమ్ మీ కాళ్లకు నమస్కరించారు. అప్పుడు మీ అనుభూతి?
అది మా శ్రీను (త్రివిక్రమ్) సంస్కారం. మేం కలిసి మంచి సినిమాలు చేశాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది.

మీరు, త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? రామ్ హీరోగా సినిమా చేస్తారా?
రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏం ఉన్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బావుంటుందని అతను అనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here