మ‌రో ప్ర‌స్థానం మూవీ – రివ్యూ

0
99

చిత్రం: మ‌రో ప్ర‌స్థానం
సెన్సార్‌: యు/ఎ
వ్య‌వ‌థి: 2 గం 3 ని
స‌మ‌ర్ప‌ణ‌: హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్
నటీనటులు: తనీశ్‌, ముస్కాన్ సేథి, రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు
మాటలు,: వసంత కిరణ్, యానాల శివ
పాటలు: ప్రణవం
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్: క్రాంతి (ఆర్కే),
ఫైట్స్: శివ,
నిర్మాణం: మిర్త్ మీడియా
రచన దర్శకత్వం: జానీ

మారుతున్న తెలుగు సినిమా ట్రెండ్‌కు అనుగుణంగా మ‌న హీరోలు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సినిమాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో హీరో త‌నీశ్ కూడా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా మంచి సినిమాలు చేశాడు. మ‌ధ్య‌లో హిట్ సినిమాలు లేక వెనక‌పడిన‌ట్లు అనిపించినా, ఇప్పుడు త‌న రూట్ మార్చుకున్నాడు. రంగు చిత్రంలో లోక‌ల్ రౌడీ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కులు ఆక‌ట్టుకున్న త‌నీశ్ ఇప్పుడు మ‌రోప్ర‌స్థానం అంటూ మ‌న ముందుకు వ‌చ్చాడు. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచాయి. అంతే కాదండోయ్‌.. సింగిల్ షాట్ మూవీగా తెర‌కెక్కడం కూడా ఈ సినిమాకు బాగానే క‌లిసొచ్చింద‌నాలి. దీంతో సినిమా అంద‌రి అటెన్ష‌న్ పొందింది. మ‌రి మ‌రో ప్ర‌స్థానం త‌నీశ్‌కు ఎలాంటి విజ‌యాన్ని, గుర్తింపును ఇచ్చిందో తెలుసుకోవాలంటే ముందు క‌థంటో చూద్దాం.

క‌థ‌:

హైద‌రాబాద్‌లో టాప్‌మోస్ట్ మాఫియా లీడ‌ర్ రాణే(క‌బీర్ దుహాన్ సింగ్‌). పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అత‌ను చెప్పిన‌ట్లు వింటుండ‌టంతో న‌గరంలో నేరాలు, ఘోరాలు చేస్తూ ఎవ‌రికీ త‌ప్పించుకుని తిరుగుతుంటాడు. ఓ మంత్రిని చంప‌డానికి, న‌గ‌రంలో అల్ల‌ర్లు సృష్టించ‌డానికి ముంబై డాన్ ఇబ్ర‌హీం(ర‌వికాలే)తో క‌లిసి బాంబ్ బ్లాస్టుల‌ను ప‌లు ప్రాంతాల్లో ప్లాన్ చేస్తాడు రాణే. ఈ ప‌థ‌కం అంతా సిటీకి ముప్పై కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఓ భ‌వంతిలో జ‌రుగుతుంటుంది. అదే స‌మ‌యంలో గోవా నుంచి రాణే ప్ర‌ధాన అనుచ‌రుడు శివ‌(తనీశ్‌) వ‌స్తాడు. రాగానే, భ‌వ‌నంలో రాణే అండ్ గ్యాంగ్ ఏం చేస్తున్నారు. వారి వేసిన ప్లాన్ ఏంటి? అనే విష‌యాల‌ను ఎవ‌రికీ అనుమానం రాకుండా మైక్రో కెమెరాలో షూట్ చేస్తాడు. ఈ క్ర‌మంలో రాణే ఆక్ర‌మాల‌పై ఆధారాల‌ను సేక‌రించిన జ‌ర్న‌లిస్ట్ స‌మీర‌(భానుశ్రీ)ని ఎత్తుకొస్తారు. ఆమె చిత్ర‌హింస‌లు పెడుతుంటారు. అయితే శివ ఆమెను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తాడు. అస‌లు శివ ప్ర‌వ‌ర్త‌న ఉన్న‌ట్లుండి అలా మార‌డానికి కార‌ణ‌మేంటి? చివ‌ర‌కు రాణే అండ్ గ్యాంగ్‌ను శివ ఏం చేస్తాడు? శివ త‌న ఆధారాల‌ను పోలీసుల‌కు అప్ప‌గించాడా? లేదా? యువిధ‌, నైనా ఎవ‌రు? వారికి శివ‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

ద‌ర్శ‌కుడు జానీ సింగిల్ షాట్‌లో ఓ యాక్ష‌న్ మూవీని చిత్ర‌క‌రిస్తామ‌ని క‌థ‌ను త‌యారు చేసుకుని చెప్పిన‌ప్పుడు వెన‌క‌డుగు వేయ‌కుండా సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న హీరో తనీశ్‌ను ముందుగా అప్రిషియేట్ చేయాలి. నిజానికి ఈ సినిమా చేసే స‌మ‌యంలో త‌ను మోకాలి ఆప‌రేష‌న్ చేసుకోవాల్సి ఉన్నా కూడా, క‌థ న‌చ్చ‌డంతో నొప్పిని భ‌రిస్తూనే షూటింగ్‌ను పూర్తి చేశాడు. లుక్ పూర్తిగా మార్చుకుని కాస్త యాక్ష‌న్ మూవీ హీరోలా క‌నిపించాడు. ఇదొక ప్ర‌ధానాంశమైతే.. ప్ర‌స్తావించాల్సిన మ‌రో విష‌య‌మేమంటే, సింగిల్ షాట్ మూవీని తెర‌కెక్కించ‌డానికి ఎంటైర్ తనీశ్ యూనిట్‌తో క‌లిసి ప‌ది రోజుల పాటు వ‌ర్క్ షాప్‌లో పాల్గొని ఎక్క‌డా డిస్ట్ర‌బెన్స్ లేకుండా సినిమాను పూర్తి చేయ‌డంలో స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాడు. గ్యాంగ్‌లో వంట మ‌నిషి కూతురిగా ఉంటూ హీరో త‌నీశ్‌ను ప్రేమించే అమ్మాయిగా ముస్కాన్ సేథి క‌నిపించింది. ఈమె రోల్ క‌థానుగుణంగా చిన్న‌దే అయినా పాత్ర ప‌రిమితి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. అలాగే జ‌ర్న‌లిస్ట్ స‌మీర‌గా న‌టించిన భానుశ్రీ, మ‌రో హీరోయిన్ నైనా వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఇమిడిపోయారు. ఇక సినిమాలోమెయిన్ విల‌న్‌గా న‌టించిన క‌బీర్ దుహాన్ సింగ్ జిల్ త‌ర‌హాలో విల‌నిజాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ముంబై డాన్ ఇబ్ర‌హీంగా ర‌వికాలే చిన్న పాత్ర‌లో క‌నిపించినా ఓకే అనిపించాడు. ఇక అమిత్‌, త‌నీశ్ స్నేహితుడిగా చేసిన మ‌రో వ్య‌క్తి, టార్జాన్‌, కేరాప్ కంచెర‌పాలెం రాజు.. ఇలా అంద‌రూ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఇక సాంకేతికంగా చూస్తే ద‌ర్శ‌కుడు జానీ ధైర్యాన్ని అభినందించాలి. త‌ను సింగిల్ షాట్ మూవీని తీయాల‌నుకోవ‌డం ఒక ఎత్తైతే దాన్ని కెమెరామెన్ బాల్‌రెడ్డితో క‌లిసి చ‌క్క‌గా ఎగ్జిక్యూట్‌చేశాడు. ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేయాల‌నుకోవ‌డం నిజంగా సాహ‌సం. సునీల్ క‌శ్య‌ప్ అందించిన నాలుగు పాట‌ల్లో రెండు బ్యాగ్రౌండ్ సాంగ్స్‌, రెండు మాంటేజ్ సాంగ్స్‌. మాంటేజ్ సాంగ్స్ ఓకే అనిపించినా బ్యాగ్రౌండ్‌లో టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఇచ్చేలా వ‌చ్చే రెండు పాట‌లు మంచి సాహిత్యంతో ఆక‌ట్టుకుంటాయి. ఇక నేప‌థ్య సంగీతం చాలా బావుంది. ఇక నుంచి కొత్త త‌నీశ్‌ను చూస్తార‌ని చెప్ప‌డ‌మే కాదు, అక్ష‌రాలా వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థా చిత్రాల‌ను ఎంచుకుని సినిమాలు చేస్తున్న హీరో త‌నీశ్ ఈ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. ఇలాంటి ఓ డిఫ‌రెంట్‌, కొత్త ప్ర‌య‌త్నాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే.

చివ‌ర‌గా.. మ‌రో ప్ర‌స్థానం.. ఆక‌ట్టుకునే డిఫ‌రెంట్ యాక్ష‌న్ మూవీ

రేటింగ్‌: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here