సైబరాబాద్ కమిషనరేట్ లో ప్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి, సీపీ సజ్జనార్ తో కలిసి సన్మానించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “‘‘ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనాకు మందు లేని పరిస్థితుల్లో అయోమయం ఉంది. ప్లాస్మా దానం చేయడం అనేది బాధితుల పాలిట సంజీవనిగా ఉంది. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం వారు బతికే అవకాశం ఉంది. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా సోకిన వ్యక్తి దాని నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ఒక్కరు ప్లాస్మా దానం చేస్తే దాని వల్ల 30 మందికి సాయం చేయవచ్చు. ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టపోవడం అనేది ఉండదు.. ప్లాస్మా తగ్గినా 24 గంటల నుంచి 48 గంటల్లో తిరిగి తయారవుతుంది. కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. అందరూ జాగ్రత్తగా ఉంటే 100 శాతం కరోనాను ఎదుర్కొవచ్చు. కొన్నాళ్లు పోతే మందు వచ్చాక జలుబు, జ్వరం మాదిరిగా కరోనా మారిపోతుందని అన్నారు.
రక్తదానం చేసేలా అభిమానులను ప్రోత్సహించాను. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వాలు, ప్రజల నుంచి వస్తున్న సహకారంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలు కొనసాగుతున్నాయని.. బ్లడ్ బ్యాంక్‌కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
సైబరాబాద్ పోలీసులు మొదలు పెట్టిన రక్తదాన కార్యక్రమానికి చిరంజీవి ఎంతో సహాయపడ్డారని సజ్జనార్ చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. కరోనాను జయించిన 3 నెలల్లోపే ప్లాస్మాను డొనేట్ చేయాల్సి ఉంటుందని, ప్లాస్మా యోధులు ప్రాణ దాతలంటూ సజ్జనార్ కొనియాడారు.



