ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తన వంతు సహాయం అందించడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం అంతకంతకూ పెరుగుతున్న కరోనా నిర్మూలనకు పోరాటంలో కోటి రూపాయల విరాళం అందించారు. కరోనా నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్య మంత్రుల సహాయ నిధికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్,
“కరోనా వైరస్ ను నిర్మూలించడానికి మన ప్రభుత్వాల పని తీరును, చేపట్టిన కార్యక్రమాలు, తీసుకుంటున్న జాగ్రత్తలకు ప్రశంసించాలి. వారి పోరాటానికి నా వంతు సహాయం అందించాలని కోటి రూపాయలను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సి ఎమ్ రిలీఫ్ ఫండ్ కి విరాళంగా అందిస్తున్నాను. సహాయం చేయగలిగిన వాళ్ళు వీలైనంతగా చేయండి. బాధ్యత కలిగిన పౌరుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ లాక్ డౌన్ సమయంలో తప్పనిసరిగా నియమాలు అన్నింటినీ పాటించండి. కలిసికట్టుగా ఈ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొందాం. మనవాళ్ళను కాపాడుకుందాం. ఈ యుద్ధంలో మానవత్వం తప్పకుండా విజయం సాధిస్తుంది. అప్పటివరకు ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి.” అని తెలిపారు….!!