స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ‘సామజవరగమనా’ అనే లిరికల్ సాంగ్ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, అత్యధిక లైక్స్ దక్కించుకున్న తెలుగు సాంగ్ గా పెద్ద రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలోని ‘రాములో రాములా’ అనే పల్లవితో సాగె రెండవ సాంగ్ వీడియో ప్రోమోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.
అల్లు అర్జున్ తో పాటు సుశాంత్, పూజ హెగ్డే, టబు, మురళి శర్మ తదితర ఆర్టిస్టులందరూ కలిసి డాన్స్ చేసిన ఈ పార్టీ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి, మంగ్లీ మంచి యాస భాషలో ఆలపించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించడం జరిగింది. ‘రాములో రాములా…నా పానం తీసిందో రో’, ‘రాములో రాములా… నన్నాగం చేసిందిరో’ అంటూ సాగె ఈ వీడియో ప్రోమోలో బన్నీ సహా మిగతా నటులందరూ కూడా స్టయిలిష్ లుక్స్ లో అదరగొట్టడం జరిగింది. మంచి కిరాక్ స్టైల్ లో సాగిన ఈ సాంగ్ ప్రోమో, ప్రస్తుతం శ్రోతలను విశేషంగా అలరిస్తూ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇకపోతే దీని పూర్తి లిరికల్ సాంగ్ ని దీపావళి రోజున రిలీజ్ చేయనున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్…..!!


