ప్రముఖ తమిళ నటులు శివకుమార్ గారి నట వారసత్వంతో కోలీవుడ్ సినిమా పరిశ్రమకు 1997లో ‘నెర్రుక్కు నేర్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసారు యువ నటుడు సూర్య. తొలిసినిమాతోనే తన ఆకట్టుకునే నటనతో మంచి పేరు సంపాదించిన సూర్య, అక్కడి నుండి వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుని మంచి హిట్స్ సాధిస్తూ కోలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ స్టేటస్ ని సంపాదించారు. 2006లో నటి జ్యోతికను పెళ్లాడిన సూర్య దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం. సూర్య కేవలం తమిళ సినిమా పరిశ్రమలోనే కాక తెలుగు సినీ పరిశ్రమలో కూడా తన అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక అతి త్వరలో అయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ బందోబస్త్ విడుదలకు సిద్దమయింది. సూర్య ఎన్ ఎస్ జి కమాండో ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాను ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక నేడు సూర్య 44వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అన్నదానం, రక్తదానం, వృద్దులు మరియు అనాధలకు పండ్లు, భోజనం అందించడం వంటి సేవాకార్యములు చేపట్టారు. అంతేకాక తమ హీరో ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు సోషల్ మీడియా వేదికల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు….!!


