రివ్యూ : దొర‌సాని

0
2141

చిత్రం: దొర‌సాని

న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, క‌న్న‌డ కిశోర్‌, విన‌య్ వ‌ర్మ‌, `ఫిదా` శ‌ర‌ణ్య త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్

స‌మ‌ర్ప‌ణ‌: డి.సురేష్‌బాబు

సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి

ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి

కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని

నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

విడుదల తేదీ: 12/07/2019

ప్రేమ‌క‌థాచిత్రాల్లో ప్రేమ స‌క్సెస్ కావ‌డం, ఫెయిల్యూర్ అవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గా ఉంటుంది. అయితే స‌న్నివేశాల‌ను ఎంత కొత్తగా, ఫ్రెష్‌గా తెర‌కెక్కించామ‌నే దానిపైనే ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపుతుంటారు. అలాగే ఈ మ‌ధ్య ప్రేమ‌క‌థా చిత్రాల‌ను పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌డానికి మ‌న ద‌ర్శ‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. అలా తెలంగాణ‌లో 1987 వ‌రంగ‌ల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమ‌థే `దొర‌సాని`. ఓ గొప్పింటి అమ్మాయి, పేదింటి కుర్రాడు మ‌ధ్య ప్రేమ ఎలాంటి మ‌లుపులు తీసుకుని ఎలాంటి మ‌జిలీ చేరింద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా .. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ రెండో కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో, హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యారు. కె.వి.ఆర్‌.మ‌హేంద్రకి ద‌ర్శ‌కుడిగా డెబ్యూమూవీ ఇది. మ‌రి `దొర‌సాని` ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవ‌డానికి క‌థేంటో చూద్దాం..

క‌థ‌:

తెలంగాణ‌లో మారుమూల గామ్రంలో జ‌రిగే ప్రేమ‌క‌థే ఈ చిత్రం. రాజు(ఆనంద్ దేవ‌ర‌కొండ‌) ప‌ట్నంలో చ‌దువుకుని త‌న ఊరికి వ‌స్తాడు. అక్క‌డ గ‌డీ ఉంటుంది. గ‌డీకి దొర‌(విన‌య్ వ‌ర్మ‌) భార్య పెద్ద దొర‌సాని క‌న్నుమూయ‌డంతో చిన్న‌దొర‌సాని దేవ‌కి(శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌)ను అంద‌రూ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆమెను చూసిన రాజు తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రాజు క‌విత్వానికి దేవ‌కి కూడా అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. అయితే గొప్పింటి దేవ‌కి, పేదింటి రాజు ప్రేమ‌కు కులాలు, ఆస్థులు, అంతరాన్ని ఏర్పరుస్తాయి. దొర పోలీసుల స‌హ‌కారంతో రాజును చంపేయాల‌నుకుంటాడు. అయితే అదే స‌మ‌యంలో న‌క్స‌లైట్ నాయ‌కుడు శంక‌ర‌న్న‌(కిశోర్‌) రాజు, దేవ‌కి ప్రేమ‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. పోలీసుల బారినుండి రాజును కాపాడుతాడు. రాజు, దేవ‌కి హైద‌రాబాద్‌కు పారిపోతారు. అక్క‌డ దేవ‌కి అన్న వారిని ఇంటికి ర‌ప్పించుకుంటాడు. మ‌రి ఆ ప్రేమ‌జంట ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. చివ‌ర‌కు వారి ప్రేమ స‌ఫ‌ల‌మైందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

ప్రేమ‌క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఏముంటుంద‌ని అనుకోకూడ‌దు. అలా అనుకుంటే ఇన్నేళ్లుగా ఇన్ని ప్రేమ‌క‌థ‌లు రాలేవుగా. మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఓ క‌థ‌ను ఎలా తెరకెక్కించార‌నేదే ప్రేమ‌క‌థ‌కు ప్ర‌ధాన బ‌లంగా మారుతుంది. ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్.మ‌హేంద్ర ఆ విష‌యంలో వంద‌శాతం స‌క్సెస్ అయ్యారు. ఎందుకంటే సినిమా నేప‌థ్య‌మే 1987, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఎంచుకోవ‌డంలో తొలి విజ‌యం సాధించారు. ప్రేక్ష‌కుడిని సినిమా ప్రారంభ‌మైన కొన్ని నిమిషాల‌కే అందులో లీన‌మ‌య్యేట‌ట్లు సినిమాను తెర‌కెక్కించారీయ‌న‌.

సినిమాకు తెలంగాణ నేప‌థ్యం, యాస ప్ల‌స్ అయ్యాయి. భారీ డైలాగులు ఎక్క‌డా ఉండ‌వు. సింపుల్ డైలాగ్స్ ఉన్నాయి. అప్ప‌టి దొర‌ల కాలంలో ప్ర‌జ‌లు ఎలా ఉండేవారో దాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌. ఎక్క‌డా అస‌భ్య‌క‌ర‌మైన స‌న్నివేశాలు క‌న‌ప‌డ‌వు. ఫ‌స్టాఫ్ అంతా రాజు, దేవ‌కి మ‌ధ్య ప్రేమ‌ను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు..సెకండాఫ్‌లో వారు ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను చూపించారు. ప్రేమికుల‌కు సాయ‌ప‌డేలా అప్పటి ప‌రిస్థితుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌ను యాడ్ చేశారు. స‌న్నివేశాలు స‌హ‌జంగా ఉన్న‌ట్లుంటాయి.

ఆనంద్ దేవ‌ర‌కొండ చాలా చ‌క్క‌గా న‌టించారు. ఇక శివాత్మ‌క న‌ట‌న సినిమాకు హైలైట్ అయ్యింది. ఎక్కువ సంభాష‌ణ‌లు లేక‌పోయినా హీరో, హీరోయిన్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆక‌ట్టుకున్నారు. అన్న‌కు త‌గ్గ త‌మ్ముడిగా ఆనంద్ చ‌క్క‌టి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. క‌థ డిమాండ్ మేర ఓ న్యూడ్ సీన్‌లో న‌టించ‌డం చూస్తే.. న‌ట‌న‌పై త‌న‌కున్న క‌మిట్‌మెంట్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. కిశోర్‌, విన‌య్ వ‌ర్మ స‌హా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం, నేప‌థ్య సంగీతం బావున్నాయి. సన్ని కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. సినిమా నిడివి కూడా త‌క్కువ‌గా ఉండ‌టం ప్ల‌స్ పాయింటే. ఆనాటి వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టేలా ఇంత సహజమైన ప్రేమకథని ఎంచుకుని మంచి నిర్మాణ విలువలతో నిర్మించిన నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని అభినందనీయులు.

బోట‌మ్ లైన్‌: సహజంగా సాగే హృద్యమైన ప్రేమ‌క‌థ `దొర‌సాని`

రేటింగ్‌: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here