రివ్యూ: నిను వీడ‌ని నీడ‌ను నేనే

0
1625

చిత్రం: నిను వీడ‌ని నీడ‌ను నేనే

బ్యాన‌ర్స్‌: వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్

న‌టీన‌టులు: సందీప్ కిష‌న్‌, అన్య‌సింగ్‌, వెన్నెల‌కిశోర్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, మ‌హేశ్ విట్టా, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు

సంగీతం: ఎస్.ఎస్. తమన్

ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ

ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్: విదేష్

నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్

దర్శకుడు: కార్తీక్ రాజు

విడుదల తేదీ: 12/07/2019

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో హీరోగా మెప్పించిన సందీప్‌కిష‌న్ తొలిసారి నిర్మాత‌గా మారి నిర్మించిన చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే`. తొలి ప్ర‌య‌త్నంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌ని కాకుండా డిఫ‌రెంట్ మూవీ చేసే ఆలోచ‌న‌తో ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ కార్తీక్ రాజు చెప్పిన క‌థ న‌చ్చి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి సందీప్ సిద్ధ‌మ‌య్యారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో ఒక హీరో అద్దంలో చూసుకుంటే వెన్నెల‌కిశోర్ క‌న‌ప‌డుతుంటాడు. అస‌లు ఎందుక‌లా? అనే చిన్న‌పాటి క్యూరియాసిటీని అంద‌రిలో క్రియేట్ చేసి సినిమాపై బ‌జ్ క్రియేట్ చేసుకున్నారు. మ‌రి సందీప్ హీరోగా, నిర్మాత‌గా ఎలాంటి స‌క్సెస్‌ను అందుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో చూద్దాం.

క‌థ‌:

అర్జున్‌(సందీప్ కిష‌న్‌), మాధ‌వి(అన్య‌సింగ్‌) ప్రేమిస్తారు. ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోకుంటే ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ఇద్ద‌రూ ఆనందంగా ఉంటున్న స‌మ‌యంలో భార్య మాధ‌వికి ఓ ఊరికి దూరంగా స‌ర్‌ప్రైజ్ బ‌ర్త్‌డే పార్టీ ఇస్తాడు అర్జున్‌. అక్క‌డ నుండి తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో వారి కారు యాక్సిడెంట్‌కు గుర‌వుతుంది. యాక్సిడెంట్ జ‌రిగిన ప్రాంతం ప‌క్క‌నే శ్మ‌శానం కూడా ఉంటుంది. ఇద్ద‌రూ ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత షాక్ అవుతారు. అందుకు కార‌ణం అద్దంలో చూసుకున్న ఇద్ద‌రికీ వారి రూపాలు వేరుగా క‌న‌ప‌డ‌తాయి. శ్మ‌శానంలోకి వెళ్ల‌డం వ‌ల్ల‌నే అలా జ‌రిగింద‌ని అనుకుంటారు. కానీ పార సైక్రియాటిస్ట్‌(ముర‌ళీశ‌ర్మ‌), పోలీస్ ఆఫీస‌ర్ పోసాని(పోసాని కృష్ణ‌ముర‌ళి) కార‌ణంగా అర్జున్‌, మాధ‌విలిద్ద‌రూ రిషి(వెన్నెల‌కిశోర్‌), దియా(మ‌డొన్నా సెబాస్టియ‌న్‌) దేహాల్లో ఉన్నామ‌నే నిజాన్ని తెలుసుకుని మ‌రింత షాక్ అవుతారు. ఇంత‌కు వార‌లా మార‌డానికి కార‌ణ‌మేంటి? అర్జున్‌, మాధ‌వి, రిషి, దియాల మ‌ధ్య సంబంధమేంటి? చివ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

ఈ మ‌ధ్య హార‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుండి మ‌ద్ద‌తు దొరుకుతుంది. చాలా వ‌ర‌కు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల‌ను అందుకున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఇలాంటి కాన్పెప్ట్‌తో సినిమా చేయ‌డానికి సందీప్ ఆస‌క్తిక‌న‌ప‌రిచారు అంటే అతిశ‌యోక్తి ఉండ‌దు. సాధార‌ణంగా ఆత్మ‌లు, దెయ్యాలంటే అరుపులు, కామెడీలు, భ‌య‌పెట్ట‌డాలు అనే అంశాలే కాదు.. ఎమోష‌న్స్ అనేవి కూడా కీల‌క‌మే. ఒక మ‌నిషి చ‌నిపోయి ఆత్మ‌గా మారిన‌ప్పుడు ఎందుకు భ‌య‌ప‌డాలి? అస‌లు చ‌నిపోయిన మ‌నిషిని ప్రేమించే వాళ్లు కూడా ఉంటారుగా!. వాళ్ల ప‌రిస్థితేంటి? వారి త‌ల్లిదండ్రుల మాన‌సిక సంఘ‌ర్ష‌ణేంటి? అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ఈ క‌థ‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు.

ఫ‌స్టాఫ్ అంతా అస‌లు ఒక‌రి రూపంలో మ‌రొక‌రు ఎలా క‌నిపిస్తున్నారు? ఎందుకు క‌నిపిస్తున్నారు? అనే స‌స్పెన్స్‌తో సాగుతుంది. ఈ మిస్ట‌రీని చేధించే క్ర‌మంలో డాక్ట‌ర్‌, పోలీస్ ప‌డే త‌ప‌న క‌న‌ప‌డుతుంది. ద‌ర్శ‌కుడు కార్తీక్ స‌న్నివేశాల‌ను గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. అస‌లు చ‌నిపోయిన వ్య‌క్తి తానెందుకు చనిపోయాడ‌నే విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అన్నీ కాస్త కొత్త‌గా ఉంటాయి. చివ‌ర‌కు ముగింపు కూడా కొత్త‌గా ఉంటుంది. మ‌న ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌నే సూచ‌న‌లు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు.

ఇక తమ‌న్ సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాలోని స‌న్నివేశాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. ప్ర‌మోద్ వ‌ర్మ కెమెరా ప‌నితనం సింప్లీ సూప‌ర్బ్. ఎందుకంటే ప్రతి విజువ‌ల్‌ను చాలా రిచ్‌గా చూపించారాయ‌న‌. సెకండాఫ్ అంతా ఎమోష‌న‌ల్ ప్యాట్ర‌న్‌లోనే సాగుతుంది. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటింగ్ సినిమాను ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా చేయ‌డంలో కీల‌క‌భూమిక పోషించింది. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్ష‌కుడు క‌న్‌ఫ్యూజ్ అవుతాడు కాబ్ట‌టి ఛోటా కె.ప్ర‌సాద్ త‌న బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించారు. నిర్మాత‌గా మేకింగ్‌లో అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా సినిమా చేసిన సందీప్‌ను మ‌రో ప‌క్క అభినందించాలి.

సందీప్‌కిష‌న్‌, అన్య సింగ్ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సందీప్ ఒక ప‌క్క స్ట‌యిలిష్‌గా క‌న‌ప‌డుతూనే, బ‌రువైన ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌ను అద్భుతంగా క్యారీ చేశాడు. అలాగే వెన్నెల‌కిశోర్, మ‌డొన్నా పాత్ర‌లు నిజంగా కంటే అద్దంలోనే ఎక్కువ‌గా క‌న‌ప‌డ్డాయి. వెన్నెల‌కిశోర్ త‌న పాత్ర‌లో ఒదిగిపోవ‌డ‌మే కాదు… త‌న పాత్ర ప‌రిధి మేర కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక దెయ్యాల‌ను చూసి భ‌య‌ప‌డే పోలీస్ ఆఫీస‌ర్‌గా త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌లో పోసాని కృష్ణ‌ముర‌ళి కామెడీ ప్రేక్ష‌కులను బాగా న‌వ్విస్తుంది. చివ‌ర‌ల్లో మాళ‌వికా నాయ‌ర్‌, డైరెక్ట‌ర్ కార్తీక్ న‌రేన్ రోల్స్ మ‌ధ్య ట్విస్ట్ బావుంది. డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ గెస్ట్ అప్పియ‌రెన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. హీరోగా తన యాక్టింగ్ తోనే కాకుండా నిర్మాతగా కూడా సందీప్ కిషన్ ఉన్నత నిర్మాణ విలువలతో తన ఉత్తమాభిరుచిని చాటుకున్నాడు

బోట‌మ్ లైన్‌: నిను వీడ‌ని నీడ‌ను నేనే.. ఎమోష‌న‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌

రేటింగ్‌: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here