‘కల్కి’ సినిమాను అభిమానులతో పాటు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు  – యాంగ్రీ స్టార్‌ డా. రాజశేఖర్‌ 

0
161

‘గరుడ వేగ’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రంతో కమర్షియల్‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు యాంగ్రీస్టార్‌ డా. రాజశేఖర్‌. రీసెంట్‌గా రాజశేఖర్‌, ఆదా శర్మ హీరోహీరోయిన్లుగా శివాని, శివాత్మిక వైట్‌ లాంబ్‌ పిక్చర్స్‌, వినోద్‌ కుమార్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి విభిన్నకథా చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్‌ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకొని మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ ఇంటర్వ్యూ.

కల్కి రెస్పాన్స్‌ ఎలా ఉంది? 
– నిజంగా ‘కల్కి’ సినిమాలో నా పెర్ఫామెన్స్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే నా లుక్స్‌కి కానీ, నా మ్యానరిజమ్స్‌కి కానీ సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘కల్కి’ సినిమా సాధిస్తున్న కలెక్షన్‌ విషయంలో కూడా సంత ప్తిగా ఉన్నాం. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వచ్చిన యాక్షన్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు. ‘సార్‌… ఇప్పుడే రెండోసారి సినిమా చూసాం. మళ్లీ వెళుతున్నాం’, సార్‌… ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకి వెళ్తున్నాం’ అని ఫోనులు చేస్తుంటే… నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది.

ఈ క్యారెక్టర్‌ కోసం ఏమైనా రీసెర్చ్‌ చేశారా? 
– నాకు ఈ క్యారెక్టర్‌ కోసం ఎలాంటి రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో చాలా సినిమాల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించాను. ఆడియన్స్‌ నుండి, అభిమానుల నుండి ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నాను. ఈ సినిమా కోసం పర్టిక్యులర్‌గా రీసెర్చ్‌ అంటూ ఏం చేయలేదు. కానీ లుక్స్‌ విషయంలో కాస్త జాగ్రత్త వహించాను. ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా ఫిట్‌గా కనిపించడానికి కావాల్సిన డైట్‌ ఫాలో అయ్యాను. అలాగే కొన్ని ఎక్సర్‌ సైజులు చేశాను.

‘గరుడ వేగ, కల్కి’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో రాజశేఖర్‌ న్యూ ఏజ్‌ వైపు అడుగులు వేస్తున్నారా? 
– దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే గత చిత్రాల్లాగా లవ్‌, డ్యూయెట్‌లు పాడే ఏజ్‌ కాదు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది. కేవలం కమర్షియల్‌ చిత్రాల్నే కాదు కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాలను కూడా వారు ఆదరిస్తున్నారు. అందుకని వారి అభిరుచికి తగ్గట్లుగా నేను కూడా కొత్త తరహా కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాను.

యాక్టింగ్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో ఇప్పటి యువ హీరోలతో పోటీ పడుతున్నారు కదా?
– (నవ్వుతూ).. అదేనండీ. ఇలానే చెప్పి దర్శకులు నాతో డ్యూయెట్‌ సాంగ్స్‌ తీసే విధంగా చేయండి.

సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం? 
– నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశా.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మేకింగ్‌ గురించి చెప్పండి? 
– ప్రశాంత్‌ మంచి దర్శకుడు. ‘అ’! సినిమాతో అందరి ప్రశంసలు పొందారు. ఆయన ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చేశాము. ఆయన మాకు ఎలా నేరేట్‌ చేసారో అలాగే సినిమాను తెరకెక్కించారు.

ప్రొడ్యూసర్‌ జీవిత ఈ సినిమాకు ఎలాంటి సహకారాన్ని అందించారు? 
– జీవిత ఒక నిర్మాతగా తనవంతు పూర్తి సహకారాన్ని అందించారు. అలాగే ముందు ఈ సినిమాను నేనే నిర్మిద్దాం అనుకుని ప్రాజెక్టు స్టార్ట్‌ చేశాము. అయితే కల్యాణ్‌గారు మరో నిర్మాతగా ముందుకు వచ్చారు. ఆయన సహకారం కూడా మరువలేనిది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, కల్యాణ్‌గారికి మధ్య కోఆర్డినేషన్‌గా ఉంటూ ఈ సినిమా బాగా రావడానికి దోహదపడింది.

ఏం సెప్తిరి డైలాగ్‌కి ఫాబ్యులెస్‌ రెస్పాన్స్‌ వస్తుంది కదా! ప్రశాంత్‌ వర్మ మీకు ఆ సీన్‌ చెప్పినప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి? 
– సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్‌ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్‌! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్‌ చేసేశాం. రెండోసారి డైలాగ్‌ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్‌ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్‌ ట్రైలర్‌ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

సినిమాలో కర్మ సిద్ధాంతం గురించి ప్రస్తావించారు కదా? మీరు నమ్ముతారా? 
– మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని తప్పకుండా నమ్ముతాను. అది నేనే కాదు ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన సత్యం.

పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది కదా? 
– అవునండీ! ఈ సినిమాకు శ్రవణ్‌ భరద్వాజ్‌గారి మ్యూజిక్‌ మంచి ప్లస్‌ అయింది. అలాగే ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. అలాగే ఐటెం సాంగ్‌కి యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు.

రాహుల్‌ రామకృష్ణ కోణంలో కథను చెప్పారు. ఎందుకలా? 
– స్క్రీన్‌ప్లేలో అదొక స్టైల్‌. హీరో ఇన్వెస్టిగేషన్‌ చేస్తే రొటీన్‌ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్‌ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్‌ ఫీలవుతున్నారు.

సినిమా చూసి శివాని, శివాత్మిక ఏమన్నారు? 
– వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి… ‘మీ నాన్నగారు యంగ్‌ హీరోలకు ధీటుగా ఫైట్స్‌ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ లవ్‌ ట్రాక్‌ను కూడా చాలా బాగా డీల్‌ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్‌ మధ్య టచింగ్స్‌ ఉండవు. ఆదా శర్మతో నా పెయిర్‌ సూపర్‌ ఉందని మా అమ్మాయిలు చెప్పారు.

‘దొరసాని’తో శివాత్మిక ఇంట్రడ్యూస్‌ అవుతున్నారు. తండ్రి, కూతుళ్లు కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా? 
– ఉంది. అయితే… ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, ‘దొరసాని’ కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్‌కి చెప్తే నేనే ప్రొడ్యూస్‌ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది.

మీరు చేయబోయే నెక్స్ట్‌ సినిమా? 
– ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్‌ సత్తారుగారు ‘గరుడవేగ 2’ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారు. తప్పకుండా ఆ సినిమా నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here