తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన 2.0, పెట్టా చిత్రాల వరుస విజయాలతో మంచి జోరు మీదున్నారు. ఇక ప్రస్తుతం అయన హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందున్న లేటెస్ట్ సినిమా దర్బార్. రజినికాంత్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజిని సరసన ముద్దుగుమ్మ నయనతార జోడి కడుతుండగా, మరొక హీరోయిన్ నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దర్శకుడు మురుగదాస్ విడుదల చేయడం జరిగింది.
అంతేకాదు ఈ సినిమా టైటిల్ అయిన దర్బార్ ను ఆకట్టుకునే స్టయిల్లో డిజైన్ చేయాలని, అలా డిజైన్ చేసిన వాటిలోనుండి ఎక్కువగా ఆకట్టుకున్న ఒక టైటిల్ డిజైన్ ను తమ సినిమా యూనిట్ ఎంపిక చేస్తుందని రజిని ఫ్యాన్స్ ని కోరుతూ మురుగదాస్ ప్రకటించడం జరిగింది. తమిళనాట అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ , సుభాస్కరన్ నిర్మాతగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం. ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, యోగి బాబు, తంబి రామయ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం….!!


