తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అంతర్జాతీయ వేదికపై బాహుబలి సందడి చేయనుంది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి: ది బిగినింగ్ సినిమా వరల్డ్ ప్రీమియర్ లైవ్‌ను నిర్వహించబోతున్నారు.
దీనికి చిత్ర బృందం హాజరు కాబోతోందని రాయల్ ఆల్బర్ట్ హాల్ ట్వీట్ ద్వారా తెలిపింది. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి, నటులు ప్రభాస్, రానా, అనుష్క ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రీమియర్ అక్టోబరు 19న సాయంత్రం 7 గంటలకు జరగబోతోంది. ఈ మేరకు ప్రేక్షకుల కోసం టికెట్లను కూడా రాయల్ ఆల్బర్ట్ హాల్ తమ వెబ్‌సైట్‌లో బుకింగ్‌కు ఉంచింది.


