కొత్త మలుపు మూవీ రివ్యూ
సినిమా: కొత్త మలుపు
విడుదల తేదీ: 12 జూన్ 2026
బ్యానర్: తథాస్తు క్రియేషన్స్
CBFC రేటింగ్: UA
నిడివి: 2గం 16ని
నటీనటులు: ఆకాష్ గోపరాజు, భైరవి ఆర్థ్యా, మహేందర్, ప్రభావతి, రఘుబాబు, పృథ్వీ, కిట్టయ్య, మరియు ఇతరులు
సంగీతం: యశ్వంత్ నాగ్
ఎడిటింగ్: శివ శర్వాణి
ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి & సుమంత్ కాచర్ల
నిర్మాత: తాటి బాలకృష్ణ
రచన & దర్శకత్వం: శివ వరప్రసాద్ కె
ప్రముఖ గాయని సునీత గారి కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా చేసిన రెండో చిత్రం ఇది. దర్శకుడు శివ కేసనకుర్తి కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ కలిపి ఫ్యామిలీకి నచ్చేలా తెరకెక్కించారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్ పై తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలోకి వచ్చింది. “ప్రేమలో అపార్థాలకు చెక్ పెట్టే కథ” అని యూనిట్ చెప్పిన మాటలకు తగ్గట్టు సినిమా స్వచ్ఛమైన భావోద్వేగాలతో నిలిచింది. గ్రామీణ వాతావరణం, సహజమైన పాత్రలు, పాజిటివ్ సందేశం సినిమాకు బలంగా నిలిచాయి.
కథ
హైదరాబాద్ లో స్నేహితులతో సరదాగా బతికే కమల్ పెళ్లి వేడుక కోసం తూర్పు గోదావరి గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి అనే అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. ఓ రాత్రి ఇబ్బందికర పరిస్థితిలో చిక్కుకున్న కమల్ ను తెలియని అమ్మాయి కాపాడుతుంది. ఆమె కోసం చేసే వెతుకులాటలో వరలక్ష్మి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మే అని తెలిసే లోపు ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి వస్తుంది. దాంతో అనుమానాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు, వరలక్ష్మి గతం ఏమిటి, ఈ అపార్థాల మధ్య వారి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది అనేది సినిమా కథ. చివర్లో వచ్చే సందేశం ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యమో చాలా స్పష్టంగా చెబుతుంది.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటుల సహజమైన నటన. ఆకాష్ గోపరాజు కమల్ పాత్రలో చాలా కంఫర్ట్ గా కనిపించాడు. మొదటి భాగంలో ఉత్సాహంగా తిరిగే యువకుడిగా, రెండో భాగంలో ప్రేమలో అనుమానాలతో తడబడే అబ్బాయిగా రెండు షేడ్స్ ను చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ లో ఆయన కళ్ళతోనే చాలా విషయం చెప్పేశాడు. స్క్రీన్ మీద ఆయన ప్రెజెన్స్ కుర్రాళ్లకు కనెక్ట్ అవుతుంది.
భైరవి ఆర్థ్యా వరలక్ష్మి పాత్రకు ప్రాణం పోసింది. గ్రామీణ అమ్మాయిగా అమాయకత్వం, మాటలో, నడకలో, చూపుల్లో ఆ సహజత్వం కనిపిస్తుంది. ప్రేమ పుట్టే సన్నివేశాల్లో, అపార్థాలతో బాధపడే చోట ఆమె నటన చాలా నిజాయితీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఆమె చెప్పే డైలాగ్ డెలివరీ సినిమాకు హైలైట్.
రఘుబాబు, పృథ్వీ కామెడీ ట్రాక్ సినిమాను తేలికగా నడిపించింది. గోదావరి యాస, టైమింగ్ తో ప్రతి సీన్ లో నవ్వు పూయించారు. సిద్ధు గోపి పాత్రలో కీలకమైన మలుపు తీసుకొచ్చాడు. ప్రభావతి, మహేందర్ లాంటి సీనియర్ నటులు కుటుంబ భావోద్వేగాలను బలంగా పలికించారు. అందరూ కలిసి సినిమాకు ఒక హాయైన ఫీల్ తెచ్చారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. యశ్వంత్ నాగ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సీన్స్ ను ఎత్తుకు వెళ్లాయి. పాటలు కథలో భాగమైపోయాయి. సుమంత్ కచర్ల ఛాయాగ్రహణం గోదావరి అందాలను కళ్ళకు విందుగా చూపించింది. ప్రతి ఫ్రేమ్ లో పచ్చదనం, నది, పడవలు కనిపించి థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా పెంచాయి. దర్శకుడు శివ కేసనకుర్తి స్క్రీన్ ప్లే ని నెమ్మదిగా అయినా హృదయానికి దగ్గరగా నడిపించారు. మొత్తంగా కొత్త మలుపు అనేది అందమైన విజువల్స్, సహజ నటన, మంచి సందేశంతో కూడిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీకెండ్ లో కుటుంబంతో చూసి ఆనందించడానికి సరిపోయే సినిమా.
బలాలు:
గోదావరి అందాలు
లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
కామెడీ
క్లైమాక్స్ సందేశం
బలహీనతలు :
అక్కడక్కడా నెమ్మదించే కథనం
ఊహించే డ్రామా
విశ్లేషణ
మొదటి భాగం అంతా ఫ్రెష్ వైబ్ తో సాగుతుంది. కోనసీమ అందాలు, పెళ్లి సందడి, ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణలు ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తాయి. కమల్ వరలక్ష్మి మధ్య వచ్చే చిన్న చిన్న సన్నివేశాలు, చూపులతో చెప్పే ప్రేమ చాలా అందంగా చిత్రీకరించారు. రఘుబాబు పృథ్వీ కామెడీ మొదటి భాగానికి పెద్ద ప్లస్. రెండో భాగంలో కథ భావోద్వేగాల వైపు మలుపు తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదమో, గతాన్ని పట్టుకుని వర్తమానాన్ని కోల్పోవడం ఎంత తప్పో దర్శకుడు సున్నితంగా చెప్పారు. క్లైమాక్స్ లో వచ్చే సందేశం నేటి యువతకు చాలా అవసరం. “గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు” అనే లైన్ సినిమా మొత్తానికి సారాంశం.
రేటింగ్: 3/5
చివరగా: కోనసీమ నేపథ్యంలో సాగే ఫ్రెష్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ



