“జితేందర్ రెడ్డి” సినిమా రివ్యూ
కథ:
ఇది ఒక రియల్ స్టోరీ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జగిత్యాల తాలూకాలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించడం జరిగింది. నిజానికి అప్పట్లో తెలంగాణ ప్రాంతం అంతా నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం వల్ల అప్పటి దొరల వల్ల ఇబ్బందులు పడిన ఎంతోమంది జనానికి అండగా ఉండేవారు నక్సలైట్లు. అయితే ఆ నక్సలైట్లలో కొందరు తమ వ్యక్తిగత లాభాల కోసం అభం శుభం తెలియని వారిని కూడా పొట్టన పెట్టుకునేవారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకుడిగా ఎదిగిన జితేందర్ రెడ్డి(రాకేష్ వర్రే) ఆ చుట్టుపక్కల అనేక మందికి అండగా నిలుస్తాడు. చిన్నప్పుడే జితేందర్ రెడ్డి నక్సలిజానికి ఎదురు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అంతలా జితేందర్ రెడ్డిని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? అప్పటి ప్రభుత్వాలు నర్సలిజాన్ని రూపుమాపడానికి ఏం చేశాయి? జితేందర్ రెడ్డి తీసుకున్న చర్యలేమిటి లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ సినిమాలో జితేందర్ రెడ్డి అనే పాత్రలో బాహుబలి ఫేమ్ నటుడు రాకేష్ వర్రే నటించాడు. నిజానికి నిజ జీవిత వ్యక్తి కావడంతో ఆయనతో పరిచయం ఉన్న వారంతా ఈజీగా ఏమైనా తేడాలుంటే గుర్తుపట్టేస్తారు. కానీ రాకేష్ మాత్రం జితేందర్ రెడ్డి అనే పాత్రలో ఒదిగిపోయారు. నడక దగ్గర నుంచి నడత మాట తీరు విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. నటన విషయంలో కూడా ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేకుండా తనదైన శైలిలో నటించాడు.. ఇక ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలో నటించిన సుబ్బరాజు, రవి ప్రకాష్ సహా ఛత్రపతి శేఖర్ వంటి వారు తమదైన అనుభవంతో ఆకట్టుకున్నారు. ఇక ఇతర పాత్రలలో నటించిన వైశాలి రాజ్, రియా సుమన్ వంటి వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం :
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి. ఎందుకంటే 80 నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా సెట్స్ సిద్ధం చేయడంతో పాటు వేషధారణ అలాగే మిగతా అన్ని విషయాలలోనూ తీసుకున్న కేర్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. సినిమాటోగ్రఫీ సినిమాని వేరే లెవల్ కు తీసుకువెళ్లింది. ముఖ్యంగా ఒక రకమైన రిచ్నెస్ తీసుకొచ్చింది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరింత కత్తెరకు పని పెడితే బావుండేది అనిపిస్తుంది. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. కొన్ని పాటలు కూడా భలే ఆసక్తికరంగా అనిపించాయి.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా కథ ఒక ఏబీవీపీ నాయకుడిది. కాబట్టి ఇది ఆ భావజాలం ఉన్న వారికి మాత్రమే నచ్చుతుంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఒకప్పటి స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే ఏబీవీపీ ఏమిటి? ఇతర సంఘాలు ఏమిటి ? ఇలాంటి విషయాలను చాలా ఆసక్తికరంగా డిస్కస్ చేశారు. ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందితే గ్రామస్తులు చదువుకుంటారు, చదువుకుంటే తమకు ఇక ఉనికి ఉండదు అని భావించిన నక్సలైట్లు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారు? లాంటి విషయాలను చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఊరికి బస్సు వస్తే అభివృద్దా.. ఉన్న బస్సులను తగలబెడితే అభివృద్దా? కొత్త రోడ్లు వేస్తే అభివృద్దా.. ఉన్న రోడ్లను పగలకొడితే అభివృద్దా? విద్వేషాలు ఉసిగొల్పడం అభివృద్దా..ఐక్యంగా ఉండటం అభివృద్దా? వంటి ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జితేందర్ రెడ్డి క్లైమాక్స్ అందరికీ తెలుసు కానీ అసలు జితేందర్ రెడ్డి ఎందుకు ఏబీవీపీలో చేరాడు? ఎందుకు ఆయనలో జాతీయ భావాలు ఏర్పడ్డాయి? ఇలాంటి విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. లవ్ స్టోరీస్ చేసిన డైరెక్టర్ ఏనా ఈ సినిమా చేసింది అని అనుమానం కలిగేలా విరించి వర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
ఫైనల్లీ
జితేందర్ రెడ్డి.. ఓ జాతీయ వాది జీవిత కథ
రేటింగ్
3.25/5