సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘లడ్డు గాని పెళ్లి’ గీతం విడుదల
కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ను తీసుకురాబోతుంది.
కేవలం ప్రకటనతోనే ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో “లడ్డు గాని పెళ్లి” అనే బరాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా “లడ్డు గాని పెళ్లి”ని సెప్టెంబర్ 20న విడుదల చేశారు.
‘మ్యాడ్’ చిత్రంలో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన “కళ్ళజోడు కాలేజీ పాప” అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ఆయన స్వరపరిచిన “లడ్డు గానీ పెళ్లి” గీతం అంతకుమించిన ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు. తీన్మార్ బీట్ లతో థియేటర్లలో ప్రతి ఒక్కరూ కాలు కదిపేలా ఈ గీతం ఉంది.
జానపద సంచలనం, గాయని మంగ్లీతో కలిసి భీమ్స్ సిసిరోలియో స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. వారి గాత్రం ఈ పాటకు మరింత ఉత్సాహం తీసుకొచ్చింది. సినిమా ఇతివృత్తం మరియు పాత్రలకు అనుగుణంగా.. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఎంతో అందంగా ఉంది. జానపద బీట్‌లు మరియు యువకులు ఆటపట్టించే రీతిలో జోకులు పేల్చుతూ సాగే సాహిత్యంతో, ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. వీక్షకుల అభిమాన గీతాల్లో ఒకటిగా ఇది తక్షణమే స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో అనుమానమే లేదు.
మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ సంగీత్ శోభన్, నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ “లడ్డు గానీ పెళ్లి” గీతంతో మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ నూతన గీతంలో “కాలేజీ పాప” పాట బిట్ ఇన్‌స్ట్రుమెంటల్ కి వారు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మ్యాడ్ స్క్వేర్’ తో రెట్టింపు వినోదాన్ని పంచడానికి, రెట్టింపు ఉత్సాహంతో మ్యాడ్ గ్యాంగ్ వస్తోందని ఈ ఒక్క పాటతోనే అర్థమవుతోంది.
అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. ‘మ్యాడ్’ కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
శ్రీకరా స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవ నాగవంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు : నవీన్ నూలి
ఛాయాగ్రహణం : షామ్‌దత్
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్