శరవేగంగా పూర్తి కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం “హరి హర వీర మల్లు”

0
46

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీ అయిన “హరి హర వీర మల్లు”లో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట సహా మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేమికులు సైతం చాలా ఆసక్తికరంగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.

భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిర్మాత ఏం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. అంతేకాదు సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కీ కూడా పూర్తి చేస్తోంది. సమాంతరంగా మరొకపక్క ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి హరి హర వీర మల్లు పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌’ని విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. హరిహర వీరమల్లు టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ విజువల్ వండర్ ని వెండితెరపై చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతన్, సోజో స్టూడియోస్, యూనిఫి మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకులు: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజరోవ్ జుజీ, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here