‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మే 31న విడుదల

0
49

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో విశ్వక్ సేన్, మరో భిన్నమైన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన “లంకల రత్న” అనే ఒక బలమైన పాత్రలో కనువిందు చేయనున్నారు.

ఈ సినిమాకి కృష్ణ చైతన్య కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన బ్లాక్ బస్టర్ చిత్రం “ఫలక్‌నుమా దాస్‌”తో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించాడు. ఇప్పుడు, విశ్వక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో దమ్మున్న గ్యాంగ్‌స్టర్ లంకల రత్నగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మే 31న ఫలక్‌నుమా దాస్ విడుదలైన తేదీనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విశ్వక్ సేన్ గత సెంటిమెంట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకంతో ఉన్నారు.

విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాపై ఇదే విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్‌లోని “సుట్టంలా సూసి” అనే మెలోడియస్ సాంగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. మే 10వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ “బ్యాడ్ “ని చిత్ర బృందం విడుదల చేసింది.

ఇక ఇటీవల విడుదలైన టీజర్‌తో, మేకర్స్ లంకల రత్న పాత్ర ఎలా ఉండనుంది? అతని ప్రపంచం ఎలా ఉండనుంది? అనే స్పష్టత ఇచ్చేశారు మేకర్స్. ఈ టీజర్ సినీ ప్రేమికులను ఆకర్షించింది. ఈ టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

యువ అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిత్ మదాడి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here