సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరో సంజయ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటంటే..
“ఈ కథ మా నాన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే ఒకే చేశా. ఓ పిట్టకథ తరువాత ఓ వెబ్‌సిరీస్ చేశా. తెలుగులో పెద్దగా ఆడలేదు. హిందీలో బాగా ఆడింది. ఓ పిట్టకథ సినిమా తరువాత నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు కాస్త గ్యాప్ తీసుకున్నా. అందరితో ఫీడ్‌బ్యాక్ తీసుకుని మంచి అడుగు వేయాలని అనుకున్నా. ఓ పిట్టకథ ఓటీటీలో చాలా బాగా ఆడింది. చాలామందికి తెలియదు గానీ.. అమెజాన్‌లో ఫాస్టెస్ట్ 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన సినిమా అదే.
నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా. ఫస్ట్ సినిమా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ తరువాత చాలా ఒత్తిడికి గురయ్యా. దీంతో తరువాత నుంచి ఛాలెంజింగ్ అనే పదం పక్కనపెట్టేశా. ఛాలెంజింగ్ అనేది తీసుకోను.
మా ఇంట్లో ఒక రూల్ ఉంది. పని విషయం గడప బయటనే మాట్లాడుకోవాలి. లోపల పని గురించి మాట్లాడితే.. గడప దాటి వెళ్లాల్సిందే. అప్పటి డే మొత్తం మూవీల గురించి మాట్లాడుకుని ఉంటారు. ఇంటికి వచ్చిన తరువాత మళ్లీ దాని గురించే చర్చ ఎందుకు అని మాట్లాడుకోం. ఇంట్లో ఫ్యామిలీ గురించి, ఇతర సరదా విషయాలు మాట్లాడుకుంటాం. మా డాడీ ఇన్‌పుట్స్ ఇవ్వరు. నేను వెళ్లి అడిగితే సలహా ఇస్తారు. లీడ్ రోల్‌లోనే విభిన్న పాత్రలు చేయాలని ఉంది. ఒక యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. విలన్‌గా ఓ తమిళ చేస్తున్నా. శింబు హీరోగా నటిస్తున్నారు.
రెగ్యూలర్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్.. హీరోయిన్ పెట్టాలని పెడతారు. కానీ ఈ సినిమాలో ప్రణవి రోల్ ఫుల్ లెంగ్త్‌లో ఉంటుంది. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. ఈ సినిమాలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది. అదే రియాలిటీ ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతోంది.
ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది. సెట్స్‌లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. కో యాక్టర్‌గానే కలిసి నటిస్తా. పుష్ప షూటింగ్‌లో అల్లు అర్జున్ గారు నాన్నతో మాట్లాడారు. ‘బ్రహ్మాజీ మీ కొడుకు సినిమా ట్రైలర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది..’ అని బన్నీ గారు అన్నారు. కారు ఎక్కే ముందు ఫయాద్ ఫజిల్ గారికి ఈ ట్రైలర్‌ను కచ్చితంగా చూడాలని చెప్పారు.
నేను మా నాన్నను చూసి ఇండస్ట్రీకి వచ్చా. ఆ తరువాత నేను బన్నీని చూసే అడుగుపెట్టా. ఆయనలాగా కష్టపడి పైకి రావాలని ఉంది. బన్నీ జర్నీ నాకు తెలుసు. ఒక పెద్ద నిర్మాత కొడుకు.. ఈజీగా దొరికి ఉంటుందని బయట అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. ఇవాళ బన్నీ ఆఫీసు ముందు వెళ్లి
ఓ గిఫ్ట్ అన్నకు ఇవ్వమని వాళ్ల అసిస్టెంట్‌కు ఇచ్చి వచ్చా. మళ్లీ రేపు వెళ్లి కలుస్తా.
నాకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు. నేను ఎవరి అయినా కలవాలంటే వాళ్ల ఇంటి బయట నిల్చుంటా. ఇందాక బన్నీ ఇంటి బయట నిలబడ్డా. భీమ్లా నాయక్ సినిమా సమయంలో త్రివిక్రమ్‌ను కలిసేందుకు ఐదు రోజులు అక్కడ జనాల మధ్య లైన్‌లో నిలబడ్డా. ఒక బౌన్సర్ నన్ను చూసి ఏంటి సార్ అక్కడ నిల్చున్నారని అన్నాడు. తరువాత రెండు నిమిషాలు త్రివిక్రమ్ గారితో మాట్లాడా.
నేను నావీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చా. ఆ తరువాత యాక్టింగ్‌లో శిక్షణ కోసం ముంబై వెళ్లా. ఆళ్ల పురుషోత్తం గారి దగ్గరకు వెళ్లా. లావణ్య త్రిపాఠి గారు అక్కడే శిక్షణ తీసుకున్నారు. ఆమె మా నాన్నతో చెప్పి అక్కడికి రికమెండ్ చేశారు. అక్కడ వెళితే.. స్టూడెంట్స్ అంతా నార్త్ వాళ్లే ఉన్నారు. నాది హైదరాబాద్ అని చెబితే.. హైదరాబాదా..? సౌత్ ఇండియానా..? అని ఒక రకంగా చూశారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ ముందుకు వెళుతోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెడితే మనకు ఇచ్చే గౌరవమే వేరు.
హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. అవి హోల్డ్‌లో పెట్టా. ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఓ పిట్టకథ చిత్రం కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. నాకు వెబ్‌సిరీస్ అని.. సినిమా అని వేరే క్యాటగిరీలు ఉండవు. కెమెరానే నా క్యాటగిరీ