హీరో మంచు విష్ణు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. భారత సాయుధ దళాల గురించి.. ప్రత్యేకించి అందులో తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా ఆయన తెలియజేశారు. ఆర్మీలో తెలుగు జవాన్ల వీరత్వాన్ని లేదా త్యాగాన్ని చూపే వీడియోలు, ఫొటోలు ఎవరి దగ్గరైనా ఉంటే తనకు పంపించాల్సిందిగా కూడా హీరో మంచు విష్ణు కోరారు.
“ప్రపంచంలో మనం నిత్యం శిరస్సు వంచి నమస్కరించాల్సిన వారు ముగ్గురు.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికి లభించాల్సిన గుర్తింపు దక్కట్లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయులైన కన్నతల్లుల్ని, కష్టజీవులైన రైతన్నలను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవాన్లను కలిసే అదృష్టం నాకెప్పుడూ కలగలేదు. ఇప్పుడు భారత ఆర్మ్‌డ్ ఫోర్సెస్ గురించి తెలుసుకొనే కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాను. ప్రపంచంలో ఎంతో సమర్థవంతమైన భారత ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో అడుగుపెట్టి మన దేశాన్ని గర్వింపజేస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ.. ముఖ్యంగా ఆర్మీలో తమ ముద్రవేసిన తెలుగు వీరజవాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీరసైనికుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వాళ్ల పేర్లు ఉంటే నా సోషల్ మీడియా అకౌంట్‌కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంతో వాళ్ల వీరకథల్ని పంచుకుందాం. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్! అంటూ ఓ వీడియో సందేశాన్ని విష్ణు షేర్ చేశారు.
Something I’ve been wanting to share for a long time now – A journey to get to know the larger than life stories of our Telugu men and women in the armed forces whose courage and sacrifice makes my heart swell with pride!
Have something to share? Please share below. pic.twitter.com/lr7beAzcdA
— Vishnu Manchu (@iVishnuManchu) May 13, 2020