ప్రస్తుతం ఈ మహమ్మారి కరోనా దెబ్బతో ప్రజల మధ్య సామాజిక దూరం పెంచేలా పలు ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా రాబోయే మే నెల 3 వరకు ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. దీనితో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలానే సినిమా షూటింగ్స్ కూడా నిలిచిపోవడంతో, స్టార్స్ అందరూ తమ తమ ఇళ్లలో ఫ్యామిలీ మెంబెర్స్ తో సరదాగా గడుపుతున్నారు. ఇక టాలీవుడ్ యక్షన్ స్టార్ గోపిచంద్ కూడా ప్రస్తుతం హ్యాపీగా తన ఫామిలీ తో గడుపుతున్నారు.
నేడు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన గోపిచంద్ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వలన మనం ఎన్నడూ చూడని ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని, ఇప్పటివరకు ఒకలా ఉన్న మన జీవితాలు ఇకపై మరోలా ఉండనున్నాయని అన్నారు. ఈ సమయంలో పేద, ధనిక అనే బేధాలు లేవని, మన ప్రక్క వారు బాగుంటే చాలు మనం కూడా బాగుంటాము అనే పరిస్థితికి అందరమూ వచ్చామని గోపిచంద్ అన్నారు.
అయితే తనకు మాత్రం ఈ కరోనా వలన హాయిగా ఫ్యామిలీ లో గడిపే సమయం దొరికిందని, కానీ కొందరు ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నప్పటికీ మధ్యలో హీరో ప్రభాస్ సహా మరికొందరు స్నేహితులతో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతుంటానని, ఇటీవల ప్రభాస్ సినిమా జార్జియాలో షూటింగ్ సమయంలో అక్కడి పరిస్థితులు బాలేవు, జాగ్రత్త అని తనకి చెప్పానని, ఆ తరువాత సినిమా యూనిట్ వేగంగా షూటింగ్ ముగించి ఇండియాకి వచ్చేసారని అన్నారు. ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సీటీమార్’ సినిమా కబడ్డీ నేపథ్యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల మధ్య సాగుతుందని, తను ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నట్లు ఆయన చెప్పారు . అతి త్వరలో రజినీకాంత్, దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో తను ఒక పాత్రలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలానే ఇటీవల దర్శకుడు తేజ తనకు ‘అలిమేలుమంగ వెంకటరమణ ‘సినిమా కథ చెప్పారని, కథ ఎంతో నచ్చిందని చెప్పిన గోపిచంద్, అతి త్వరలో ఆ సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలిపారు…….!!