సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో 2005లో తమిళ్ లో తెరకెక్కిన చంద్రముఖి సినిమా అప్పట్లో అతి పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇటు తెలుగులో కూడా డబ్ కాబడిన ఆ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకుంది. శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆ సినిమాలో నయనతార, జ్యోతిక, ప్రభు, వడివేలు, సోను సూద్ ముఖ్య పాత్రల్లో నటించగా విద్యాసాగర్ అందించిన సంగీతం, శేఖర్ వి జోసఫ్ ఫోటోగ్రఫి, దర్శకుడు పి వాసు అద్భుత స్క్రీన్ ప్లే, దర్శకత్వం సినిమాకు అంత పెద్ద విజయాన్ని అందించాయి.
ఇకపోతే అతి త్వరలో ఆ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 అతి త్వరలో తెరకెక్కనుందని డ్యాన్సర్, దర్శకుడు, నటుడు అయిన రాఘవ లారెన్స్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. మీ అందరికి ఒక శుభవార్త తెలియచేయాలి అనుకుంటున్నాను, అతి త్వరలో పి వాసు గారి దర్శకత్వంలో తెరకెక్కనున్న చంద్రముఖి 2లో నటించబోతున్నాను, సన్ పిక్చర్స్ బ్యానర్ పై నా లక్కీ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ గారు ఆ సినిమాని ఎంతో భారీగా నిర్మించనున్నారు. ఆ సినిమా ద్వారా అందుకున్న అడ్వాన్స్ తోనే కరోనా బాధితులకు గాను మొత్తంగా రూ.3 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు లారెన్స్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.