నాచురల్ స్టార్ నాని నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ‘వి’ తో పాటు ‘టక్ జగదీశ్’ సినిమాల్లో నటిస్తున్న నాని, ‘వి’ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తొలిసారిగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత నాని నటించబోయే తదుపరి సినిమా అనౌన్సుమెంటు కాసేపటి క్రితం రావడం జరిగింది. ఒక టైపు రైటర్ పై హీరో నానికి బర్త్ డే విషెస్ తెల్పుతూ కొంత డిఫరెంట్ గా ఆయన నటించనున్న సినిమా టైటిల్ ‘శ్యామ్ సింగ రాయ్’ ని ఒక వీడియో ద్వారా ప్రకటించింది సినిమా యూనిట్.
గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాకి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు యూనిట్ తమ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి…..!!