‘రాజుగారి గది3’ చిత్రాన్ని ఓంకార్‌ ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు – ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా.కె.నాయుడు.

0
1394

ఛోటా.కె.నాయుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు ఉండరు.
అగ్ర దర్శకులతో పాటు స్టార్‌ హీరోలతోనూ పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఎన్నో హిట్ చిత్రాలను ఆయన కెమెరా పనితనంతో సూపర్ హిట్ చిత్రాలుగా మార్చారు. నూటికి దగ్గరగా చిత్రాలకు తన కెమెరాతో ప్రాణం పోశారని చెప్పొచ్చు. తాజాగా ఆయన ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. అశ్విన్‌బాబు, అవికాగోర్‌ జంటగా ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అక్టోబరు 18న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ఛోటా.కె.నాయుడు విలేకరులతో ముచ్చటించారు ఆ విశేషాలు…

సాంకేతిక పరిజ్ఞానం!!
చిత్రసీమలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయాక ఎక్కడైనా అనుకున్నది అనుకున్నట్లు రాకుంటే గ్రాఫిక్స్‌లో మేనేజ్‌ చేసెయ్యొచ్చులే అని తేలికగా తీసుకుంటున్నారు. కెమెరామెన్లకు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనం మన పనిలో మరింత నైపుణ్యం పెంచుకుంటూ ముందుకెళ్లాలి.

నన్ను నేను అప్‌డేట్‌ చేసుకోవడానికి..
ఏటా సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్‌ పురస్కారాలకు ఓ ఐదారు చిత్రాలు నామినేట్‌ అవుతుంటాయి. అవి చాలు నా పరిజ్ఞానం పెంచుకోవడానికి. కొత్త దర్శకులతో చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటా. ఎందుకంటే వాళ్లు మనం ఊహించని ఫ్రేమ్స్, సీన్స్‌ చెప్తుంటారు. అవి భలే కొత్తగా, ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటునే ఉంటా..

కొత్తవాళ్ల మేకింగ్‌ స్టైల్‌ను అనుసరిస్తుంటా..
‘‘కొత్తగా వస్తున్న ఛాయాగ్రాహకుల మేకింగ్‌ స్టైల్‌ను ఫాలో అవుతుంటా. ఏదైనా సినిమా నచ్చితే ఆ చిత్ర కెమెరామెన్‌ను పిలిచి ‘ఈ షాట్‌ ఎలా తీశావ్‌’ అని అడిగి మరీ తెలుసుకుంటా. ఈ విషయంలో నేనెప్పుడూ సిగ్గుపడను. ఇటీవల కాలంలో ‘జెస్సీ’ చిత్రం చూశా. అందులో కొన్ని నైట్‌ ఎఫెక్ట్‌ షాట్స్‌ చూసి నాకే చాలా సిగ్గనిపించింది. ఇప్పటి వరకు నాకెందుకు ఇలా తియ్యాలనిపించలేదు అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ చిత్రానికి పనిచేసిన కెమెరామెన్‌ సునీల్‌ను తర్వాత కలిసి ఆ సీన్స్‌ను ఎలా చిత్రీకరించింది అడిగి తెలుసుకున్నా. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చూశాక దర్శకుడు వెంకటేష్‌ మహాతోనూ ఇలాగే మాట్లాడి.. ఆ చిత్ర విశేషాలు తెలుసుకున్నా. ఇలా ఎవరు కొత్తగా చేసినా సరే వాళ్ల ప్రతిభకు నేను ముగ్దుడినైపోతా.

ఫేవరెట్ జోనర్!!
– నాకు యాక్షన్, లవ్‌ స్టోరీలు చేయడమంటే చాలా ఇష్టం. ఆ జోనర్లు నాకెంతో సౌకర్యంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కాకుండా చిత్రసీమలో నాకు బాగా నచ్చే మరో విభాగం ఏదైనా ఉంది అంటే.. అది కొరియోగ్రఫీనే. నాకు సినిమాలు తప్ప మరేమీ తెలియవు. నా తుది శ్వాస వరకు ఇక్కడే పని చేస్తుండాలని కోరుకుంటా’’.

తక్కువ సమయంలో పూర్తి చేసిన చిత్రం ‘రాజుగారి గది3’.
‘‘నేనిప్పటి ఎన్నో జోనర్లలో చేశాను కానీ, హారర్‌ కామెడీ చిత్రానికి ఎప్పుడూ పని చేయలేదు. ఆ కోరిక ‘రాజుగారి గది3’తో తీరింది. ఓంకార్‌ నాకు ‘స్టాలిన్‌’ చిత్ర సమయం నుంచి తెలుసు. అప్పుడే తన ప్రతిభ చూసి ఓ గొప్ప స్థాయికి వెళ్తాడనిపించింది. తన తొలి చిత్రం ‘జీనియస్‌’ కథను ముందు నాకే చెప్పాడు. విన్నప్పుడే కథ అద్భుతంగా అనిపించింది.. కానీ, అప్పుడు తనతో చేయడం కుదరలేదు. నిజానికి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత నేను రాత్రిళ్లు చిత్రీకరణలకు వెళ్లట్లేదు. కానీ, ఓంకార్‌ ఈ కథ చెప్పాక నైట్‌ షూటింగ్‌కు ఓకే అన్నా. ఈ సినిమా పూర్తిగా నైట్‌ ఎఫెక్ట్‌లోనే సాగుతుంది. దీన్ని ఓంకార్‌ ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. మరో విశేషం ఏంటంటే నా కెరీర్‌లోనే అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన చిత్రమిది’’.

అశ్విన్‌ – అవికా తమ అద్భుతమైన నటనతో నన్ను ఆశ్చర్యపరిచారు..
‘‘ఈ చిత్ర విషయంలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన వాటిలో అశ్విన్‌ నటన ఒకటైతే.. మరొకటి అవిక అభినయం. ఈ చిత్రంలో అశ్విన్‌ హీరో అని ఓంకార్‌ నాకు చెప్పినప్పుడు నేను షాక్‌ అయ్యా. నా దృష్టిలో అన్నింటి కన్నా హీరో అన్నదే చాలా కష్టం. డ్యాన్స్, ఫైట్స్‌ ఇలా అన్ని అంశాలపై పరిజ్ఞానం ఉండాలి. ఇవన్నీ అశ్విన్‌ చేయగలడా అనిపించింది. కానీ, ఇందులో తను పెద్ద డైలాగ్స్, క్లిష్టమైన డ్యాన్స్‌ మూమెంట్లను ఒకే షాట్‌లో పూర్తి చేసేవాడు. ఇక అవికా కూడా అంతే. నాకు ఓంకార్‌ అవికా గురించి చెప్పినప్పుడు ఆమె నటనపై నాకంత ఆసక్తి ఏర్పడలే. సెట్స్‌లో కూడా తనతో నేను చాలా తక్కువగా మాట్లాడేవాడ్ని. కానీ, క్లైమాక్స్‌ చిత్రీకరణకు వచ్చేటప్పటికి ఆమె అభినయం చూసి ఆశ్చర్యపోయా. తనలో ఇంత గొప్ప నటి ఉందా అనిపించింది. నిజంగా సినిమా పూర్తయేటప్పటికి ఆమెకు అభిమానినైపోయా. ఇక సినిమాలో బ్రహ్మాజీ, అలీల కామెడీ ట్రాక్‌ మరింత హైలైట్‌గా నిలుస్తుంది.

దర్శకత్వం…
నా దృష్టిలో దర్శకత్వం చాలా కష్టమైన పని. ఇక నాకున్న టెంపర్‌కి డైరెక్షన్‌ అన్నది ఇప్పట్లో అయ్యే పనికాదు. అంతేకాదు నేను మెగాఫోన్‌ పడుతున్నాడంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. కాబట్టి నేనొక సినిమా తీస్తే ఆ అంచనాలు అందుకునేలా మంచి కథ దొరకాలి. ఒకవేళ వీటన్నింటికీ తగ్గట్లుగా పరిస్థితులు అనుకూలిస్తే.. 80ఏళ్ల తర్వాత దర్శకుడిగా మారతానేమో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here