ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా, మూడు రోజుల క్రితం విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటూ, హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. క్రికెట్ కథాంశంతో పాటుగా దేశానికి వెన్నెముకైన రైతులకు సంభందించి ఒక గొప్ప మెసేజిని మేళవించి, ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. అలానే తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని కూడా ఎంతో గొప్పగా చూపించిన ఈ సినిమాపై ప్రేక్షకులు సహా పలువురు సినిమా ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేడు కళాబంధు శ్రీ టి సుబ్బరామి రెడ్డి గారు ఈ సినిమా చూసి, నిర్మాత కె ఎస్ రామారావు గారు, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు గార్ల సమక్షంలో తన అభిప్రాయాన్ని తెల్పడం జరిగింది.
నాకు రామారావు గారితో 35 ఏళ్ల అనుబంధం ఉంది.ఆయన బ్యానర్ నుండి వచ్చిన అన్ని సినిమాలు నేను చూశాను, అయితే ఈ సినిమా నా మనసుకు ఎంతో నచ్చడంతో దర్శక నిర్మాతలను పిలిపించి, సినిమాపై నా అభిప్రాయాన్ని తెలుపుతున్నానని అన్నారు. ఇక నేడు ప్రేక్షకులు సినిమాల్లో స్టార్స్ ఎవరు అనేది మాత్రమే ఎక్కువగా చూస్తున్నారని, అయితే ఈ కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మాత్రం కథ, కథనాలే స్టార్లుగా తెరకెక్కి, ఆద్యంతం ఎంతో ఆకట్టుకుందని అన్నారు. ఈ సినిమా చూస్తుంటే ఒకప్పటి విశ్వనాధ్ గారి శంకరాభరణం గుర్తుకు వస్తోందని, ఆ విధంగా ఎంతో గొప్పగా తెరకెక్కిన ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ గారు అత్యద్భుతంగా నటించారని, అలానే దర్శకుడు భీమనేని అద్భుత దర్శకత్వ ప్రతిభతో సినిమాను తెరకెక్కించారని సినిమా పై ఆయన పొగడ్తలు కురిపించారు…..!!


