బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
సమర్పణ: కె.ఎస్.రామారావు
నటీనటులు: ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్(స్పెషల్ రోల్), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్.నరసింహారావు, వెన్నెల కిశోర్, ‘రంగస్థలం’ మహేశ్, విష్ణు(టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు
సంగీతం: దిబు నినన్
కెమెరా: ఐ.అండ్రూ
కథ: అరుణ్ రాజ్ కామరాజ్
మాటలు: హనుమాన్ చౌదరి
నిర్మాత: కె.ఎ.వల్లభ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
కెరీర్ ప్రారంభం నుండి తమిళ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ గుర్తింపు సంపాదించుకున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేష్. తెలుగులో తొలిసారి ఐశ్వర్యా రాజేష్ నటించిన చిత్రం `కౌసల్య కృష్ణమూర్తి`. తమిళంలో ఐశ్వర్యా రాజేష్ నటించిన `కనా` చిత్రాన్ని తెలుగులో `కౌసల్యకృష్ణమూర్తి` పేరుతో రీమేక్ చేశారు. మరి తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
ఇరగవరం గ్రామంలో నివసించే కృష్ణమూర్తి(రాజేంద్రప్రసాద్)కి వ్యవసాయం అంటే ప్రాణం. వ్యవసాయంతో పాటు క్రికెట్ అంటే కూడా కృష్ణమూర్తికి ప్రాణం. అతన్ని ఊర్లోని వారందరూ క్రికెట్ పిచ్చోడు అని అంటుంటారు. ఇండియా టీమ్ క్రికెట్‌లో ఓడిపోతుంటే, కన్నీళ్లు పెట్టుకుంటున్న తండ్రిని చూసిన కౌసల్య(ఐశ్వర్యా రాజేష్) చిన్నప్పుడే ఇండియన్ టీమ్ తరపున ఆడి గెలిపించాలని అనుకుంటుంది. తల్లి ఒప్పుకోకపోయినా, ఊర్లోని మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడటం నేర్చుకుంటుంది. ఊర్లో అందరూ ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటి? అని విమర్శించినా, కూతురిని ప్రోత్సహిస్తాడు కృష్ణమూర్తి. ఈలోపు వర్షాలు లేకుండా, పొలాలు ఎండిపోవడంతో కృష్ణమూర్తి బ్యాంకులో తీసుకున్న లోనుని కట్టలేక ఇబ్బందులు పడుతుంటాడు. అయినా తన కూతురికి తన ఇబ్బందులు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. కౌసల్య నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపిక అవుతుంది. కోచ్ నెల్సన్(శివ కార్తీకేయన్) ప్రోత్సాహంతో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కి ఎన్నికవుతుంది. తర్వాత కౌసల్య ఇండియా టీమ్‌ని గెలిపిస్తుందా? కృష్ణమూర్తికి వచ్చిన ఇబ్బందులేమిటి? చివరకు సమస్యలు ఎలా తీరాయి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. దేశానికి రైతు వెన్నెముక. అయితే నేడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు లేకుండా పంటలు పండిచలేక ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే.. మరో పక్క తీసుకున్న అప్పుడు కట్టమని బ్యాంకు అధికారులు, వ్యాపారులు వేధిస్తున్నారు. ఈ బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆకలి అంటున్న వారికి అన్నం పెట్టే రైతును పట్టించుకునే నాథుడే లేదు. సెన్సిటివ్ అయిన ఈ విషయాన్ని అరుణ్ రాజ్ కామరాజ్ ఉమెన్ క్రికెట్‌తో లింక్ చేసి ఎమోషనల్‌గా తెరకెక్కించిన చిత్రమే `కనా`. దీన్ని భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై టేస్ట్‌ఫుల్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగులోకి ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. తమిళంలో ప్రధాన పాత్రను పోషించిన ఐశ్వర్యారాజేష్‌ను తెలుగులోకి పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందించారు.
నటీనటుల విషయానికి వస్తే.. కౌసల్య పాత్రలో నటించిన పాప చక్కగా నటించింది. ఇక యుక్త వయసు వచ్చిన అమ్మాయి నుండి ఇండియా తరపున క్రికెటర్‌గా మారిన కౌసల్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటన సింప్లీ సూపర్బ్. పాత్రలో ఒదిగిపోయింది. గ్రామం నుండి ఇంటర్నేషనల్‌గా ఎదిగిన ఉమెన్ క్రికెటర్ పాత్రకు ఆమె న్యాయం చేసినట్లు మరెవరూ న్యాయం చేయలేరేమో అనిపించింది. అమాయకపు ఆడపిల్లగా.. తండ్రి బాధను తీర్చడానికి ఇండియా తరపున క్రికెట్ ఆడాలనుకునే అమ్మాయిగా.. ఇలా భిన్న పార్వ్శాలను ఆమె తన అభినయంతో చక్కగా తెరపై ఆవిష్కరించింది. ఇక సినిమాలో మరో ప్రధానమైన పాత్ర రాజేంద్ర ప్రసాద్‌ది. వ్యవసాయం అంటే ఇష్టపడుతూనే.. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తనదైన స్టయిల్లో అద్భుతంగా నటించారు. భార్య వద్దని అంటున్నా.. కూడా కూతురు క్రికెటర్ కావాలని తాపత్రయపడే తండ్రి పాత్రలో .. అలాగే పంట నష్టపోయినప్పుడు బాధపడే రైతు పాత్రలో మరో పక్క రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకుల గుండెలను మెలిపెడుతుంది. ఇక ముందు క్రికెట్ వద్దంటూనే తర్వాత కలలు కంటే సరిపోదు.. పట్టుదలగా దాన్ని సాధించుకోవాలంటూ కూతుర్ని ఇన్‌స్పైర్ చేసే తల్లి పాత్రలో ఝాన్సీ నటన ఆకట్టుకుంటుంది. ఝాన్సీ పాత్రలో ఒదిగిన తీరు చూస్తే.. తెలుగు సినిమాల్లో హీరో, హీరో్యిన్స్‌కు తల్లి పాత్రకు ఝాన్సీ రూపంలో ఓ మంచి నటి దొరికి నట్టయ్యింది. ఇక హీరోయిన్‌ని ప్రేమించి.. ఆమెకు తోడుగా ఉండే పల్లెటూరి యువకుడి పాత్రలో కార్తీక్ రాజు చక్కగా నటించాడు. రవిప్రకాశ్, మహేష్, వెన్నెలకిషోర్, విష్ణు ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. తమిళ నటుడు శివ కార్తికేయన్ గెస్ట్ రోల్‌లో తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు.
సాంకేతికంగా చూస్తే.. రీమేక్ చిత్రాలను తెరకెక్కించడంలో భీమనేని శ్రీనివాస్ మరోసారి తనెంటో ప్రూవ్ చేసుకున్నారు. తమిళ సినిమాలోని సోల్‌ను తెలుగు నెటివిటీకి మార్చి ప్రేక్షకులను ఆకట్టుకునేలా `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రాన్ని తెరకెక్కించారు. సన్నివేశాలను ఎమోషనల్‌గా మలిచిన తీరు చక్కగా ఉంది. ఐ. అండ్రూ తన కెమెరా పనితనంలో ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించారు. దిబు మీనన్ సంగీతం బావుంది. రాకాసి గడుసు పిల్ల.., ముద్దబంతి.. రేపటి కల.. పాటలన్నీ సందర్భానుచితంగా చక్కగా ఉన్నాయి. హనుమాన్ చౌదరి మాటలు బావున్నాయి. సన్నివేశాల విషయానికి వస్తే పాత్రలను చిత్రీకరించిన తీరు సన్నివేశాల పరంగా చక్కగా చూపించారు. తండ్రి చనిపోయినా క్రికెట్ చూడటానికి ఆసక్తి చూపే సన్నివేశం.. పోలీస్ స్టేషన్‌లో కూతురికి అండగా నిలిచే తండ్రి సన్నివేశం.. ఇక క్లైమాక్స్ పీక్స్‌లో ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, ఐశర్వారాజేష్‌ల నటన కళ్లను చెమరుస్తాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: కౌసల్య కృష్ణమూర్తి..మంచి సందేశమున్న తండ్రీ కూతుళ్ల కథ
రేటింగ్: 3.5/5