ప్రాపర్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ‘ఎవరు’ మిమ్మల్ని అలరిస్తుంది – హీరో అడివి శేష్

0
1779

పంజా, క్షణం, గూఢచారి లాంటి విభిన్న కథా చిత్రాలతో నటుడిగానే కాదు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు శేష్. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో అడివి శేష్, రెజీనా క‌సండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పై వెంకట్ రాంజీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవనున్న సందర్భంగా హీరో అడివి శేష్ ఇంటర్వ్యూ…

డైరెక్టర్ కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గానే ఎక్కువ సక్సెస్ అయ్యారు కదా?
– నన్ను చూడగానే అందరూ మాది చాలా రిచ్ ఫ్యామిలీ అనుకుంటారు కానీ యుఎస్, కాలిఫోర్నియాలో మాది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా కష్టపడి చదువుకొని పైకొచ్చాను. అలా సినిమా మీద ఇంట్రెస్ట్ తో నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు ‘కిస్’ సినిమాకే పెట్టేసాను. ఆ సినిమాకు సంబంధించి పోస్టర్లకు వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలేదు. అది నాకొక కాస్ట్లీ లెసన్. సో దర్శకుడిగా నేను సక్సెస్ కాలేదు. అందుకే ప్రస్తుతం అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నటుడిగా చేస్తూ స్క్రీన్ ప్లే రైటర్ వ్యవహరిస్తున్నాను.

ఇండస్ట్రీ నుండి ఏం నేర్చుకున్నారు?
– ‘క్షణం’ సినిమాను ముందుగా కొందరికీ చూపిస్తే అస్సలు బాలేదు కష్టం అని అన్నారు. నాకు డైరెక్టర్ కి అలాగే ముఖ్యంగా ప్రొడ్యుసర్ అందరం షాకయ్యాం. తీరా చూస్తే అది సూపర్ హిట్టైంది. ఎప్పుడూ ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేయని బన్నీ ఆ సినిమా ట్వీట్ చేసాడు. అలాగే ప్రభాస్ గారు ఫేస్ బుక్ లో గూఢచారి ట్రైలర్ పోస్ట్ చేశారు. అలాగే మహేష్ బాబు గారు సినిమా గురించి ట్వీట్ చేశారు, నాగార్జున గారు అయితే ఆయన ఓన్ ప్రొడక్షన్ చి||ల||సౌ రిలీజ్ లో ఉండగా నా సినిమా గురించి మాట్లాడారు. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్ గూఢచారి సక్సెస్ మీట్ కి వచ్చి మరి నన్ను కంగ్రాచ్యూలేట్ చేసి వెళ్లారు. మనం మంచి చేస్తే ఇండస్ట్రీ కూడా మంచి చేస్తుందని నిరూపించింది. అలాగే సినిమా ఎవరికి చూపించాలి అనేది కూడా తెలిసింది.

ఈ సినిమాలో కాస్టింగ్ కి సంబంధించి ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా?
– ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ లో సర్ప్రైజ్ అంటూ ఏం లేదు కానీ . కథలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. గూఢచారిలో క్లైమాక్స్ లో ఉండే జగపతి బాబు గారి క్యారెక్టర్ ట్విస్ట్ లా కాకుండా కథతోనే థ్రిల్ అవుతారు.

ప్రీమియర్ షో వేయడానికి ప్రత్యేకమైన రీజన్ ఉందా?
– ఒకరోజు నిర్మాత పీవిపీ గారు సినిమాకు సంబంధించి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం సినిమా మీద మంచి బజ్ వస్తుంది. రిలీజ్ టైమ్ లో ఆ బాంగ్ అనేది మనకు అవసరం అన్నారు. దానికి నేను సర్ ఆ ఈవెంట్ లో ఏం చెప్తాం ? అని ప్రశ్నించాను. ట్రైలర్ వేసి సినిమాలో కంటెంట్ ఏంటో తెలియజేద్దాం అన్నారు. అలాంటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా ప్రీవ్యూ చూపిస్తే బాగుంటుంది కదా అని రిక్వెస్ట్ చేసాను. సో ఆయన కూడా సినిమా మీదున్న నమ్మకంతో వెంటనే ఒకే అన్నారు. అలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులు ప్రీమియర్ ప్లాన్ చేశాం. దాంతో మీ అందర్నీ కలిసి మీతో పాటే సినిమా చూడబోతున్నా..

డైరెక్టర్ వెంకట్ రాంజీ మేకింగ్ గురించి?
– మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్ కి వెళితే అక్కడ రామ్ చరణ్ గారు నన్ను చూసి కంగ్రాట్స్ చెప్పారు. లేదండి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అని అన్నాను కానీ… నేను ట్రైలర్ చూశాను తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అన్నారు. చాలా సంతోషం వేసింది. దీనంతటికి కారణం మా దర్శకుడు వెంకట్ రాంజీ. ఫస్ట్ మూవీ అయినా ఎంతో ప్యాషన్ తో తెరకెక్కించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది.

ఈ సినిమాను ఇంతకుముందే ఎవరికైనా చూపించారా?
– ఇండస్ట్రీ లో నా బెస్ట్ ఫ్రెండ్ లో ఒకరైన వెన్నెల కిషోర్ కి చూపించాను. సినిమా చూసి నన్ను గట్టిగా హగ్ చేసుకుని సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తప్పకుండా హిట్ కొడుతున్నావ్ అన్నాడు. కిషోర్ సినిమాల్లో సరదాగా కామెడీ చేస్తాడు. కానీ బయట సీరియస్ గా ఉంటాడు. ఇంటర్నేషనల్ సినిమాల మీద కూడా మంచి నాలెడ్జ్ ఉంది. నిజానికి వాడే నా బెస్ట్ క్రిటిక్. అలా వాడు చెప్పడంతో నాకు ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది.

ఎవరు సినిమా ఎలా ఉండబోతుంది?
– ఎవరు ప్రతి క్షణం ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. నవంబర్ నుండి నాకు తెలిసిన వారికి సినిమా చూపిస్తూనే ఉన్నాను. ఇప్పటివరకూ 1000 మందికి పైగా సినిమా చూపించాం. అందరికి నచ్చింది. ‘ఎవరు’ మీరు ఊహించినట్టు క్రైం చేసింది ఎవరు అనే దాని చుట్టూ మాత్రమే తిరిగే కథ కాదు. అసలు ఎలాంటి క్రైమ్ జరిగింది?. ఎవరు చేసారు?.. ఎవరి మీద క్రైమ్ జరిగింది? అనే మూడు లేయర్స్ మీద కథ నడుస్తుంది. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ కచ్చితంగా థ్రిల్ అవుతారు.

ఎవరు సినిమాలో మీ క్యారెక్టర్?
– నేను విక్రమ్ వాసుదేవ్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. చాలా కేర్ లెస్ గా ఉండే ఒక పోలీస్ ఆఫిసర్ కి వీడి ప్రపంచాన్ని మించిన ఒక మిస్టరీ కేసు సాల్వ్ చేయాల్సి వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ట్రైలర్ చూస్తుంటే బద్లా సినిమా షేడ్స్ కనిపిస్తున్నాయి కదా?
– అవునండీ చాలా మంది ‘ఎవరు’ సినిమాను బద్లా సినిమాతో పోలుస్తున్నారు. మా సినిమాకు ఒక టాగ్ లైన్ ఉంది అల్ ఆన్సర్స్ షల్ బి క్వశన్డ్ అని.. నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఆల్ క్వశన్స్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ ఫ్యూ అవర్స్.

క్షణం నుండి అన్ని థ్రిల్లర్ కథలే చేస్తున్నారు! మీ మీద అదే ఇంప్రెషన్ పడే అవకాశం ఉందికదా?
– ‘క్షణం అందర్నీ ఆక్కట్టుకున్న థ్రిల్లర్ సినిమా ఆ తర్వాత నేను చేసిన ‘అమీ తుమీ’ ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం. ‘గూఢచారి’లో కొన్ని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఉన్నప్పటికీ అదొక యాక్షన్ డ్రామా. థ్రిల్లర్ కాదు. కాబట్టి క్షణం తర్వాత నేను చేసిన కంప్లీట్ ప్రాపర్ థ్రిల్లర్ సినిమా ఎవరు. ప్రతి థ్రిల్లర్ లో ఏంటంటే ట్విస్ట్ తెలియగానే రిలాక్స్ అయిపోతాం. మళ్ళీ సినిమా చూడాలనిపించదు. నా ఫార్ములా ఏంటి అంటే ప్రతి ట్విస్ట్ వెనకాల ఒక ఎమోషన్ ఉండాలి అప్పుడు ట్విస్ట్ కోసం కాకపోయినా ఎమోషన్ కోసం అయినా ఆడియన్స్ రిపీటడ్ గా సినిమా చూస్తారు.

డైలాగ్ రైటర్ అబ్బూరి రవి నా గురువు అని చెప్పారు కదా?
– నేను చాలా సార్లు చెప్పినట్టు నా గురువు అబ్బూరి రవి. పంజా, క్షణం, గూఢచారి నుండి ఎవరు వరకూ నా అన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ ఆయనే.. నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చింది పివిపి గారు.. అలాగే గూఢచారి డైరెక్టర్ శశి కిరణ్ ని మేజర్ లాంటి ఒక ప్రస్టేజియస్ ప్రాజెక్టు కి డైరెక్టర్ అవమని అడుగుతున్నారు.

మేజర్ మూవీ ఎలా ఉండబోతుంది?
– నేను చేయబోయే నెక్స్ట్ సినిమా మేజర్ అక్టోబర్ లో మొదలవుతుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గారి జీవితంపై ఆ సినిమా రాబోతుంది. 26 / 11 తాజ్ ఎటాక్ లో ఆయన మరణించారు. ఆయనది చాలా హీరోటిక్ లైఫ్. అంత హీరోయిజాన్ని నమ్మరేమో అని కొంత కట్ చేయాల్సి వస్తుంది. అంత గ్రేట్ పర్సన్. అలాగే ఆయనను మిలటరీ అత్యున్నత పురస్కారం ‘అశోక చక్ర’ వరించింది. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను చూడబోతున్నారు. ఆ సినిమాలో మహేష్ బాబు గారితో కొలబ్రేట్ అవ్వడం గ్రేట్ అచీవ్ మెంట్ గా ఫీలవుతున్నాను. ఆ తర్వాత తర్వాత ‘గూఢచారి 2’ సినిమా స్టార్ట్ చేస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here