యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య ఎప్పటినుండో మంచి అనుబంధం నెలకొని ఉంది. అయితే యాదృచ్చికంగా వారిద్దరిని హీరోలుగా పెట్టి దర్శకధీరులు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ని తెరకెక్కిస్తుండడంతో, ఆ బంధం మరింత బలపడింది. నేడు ఫ్రెండ్ షిప్ డే ని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ మధ్యనున్న స్నేహబంధాన్ని వ్యక్తపరిచారు.
ఎన్టీఆర్ గొప్ప గ్రీకు ఫిలాసఫర్ అయిన సోక్రటీస్ మాటలని కోట్ చేస్తూ , ‘ఒకరితో స్నేహం చేయడానికి తొందరపడకు. కానీ స్నేహం చేయడం మొదలెట్టిన తరువాత ఏమి జరిగినా దృఢంగా చిత్తశుద్ధితో నీ స్నేహాన్ని కొనసాగించు’ అంటూ చరణ్ తో ఉన్న తన స్నేహాన్ని షేర్ చేశారు. రామ్ చరణ్ కూడా ఇంస్టాగ్రామ్ లో “కొన్ని బంధాలు ఏర్పడడానికి సమయం పట్టొచ్చు కానీ అవి ఒక సారి ఏర్పడ్డాక జీవితాంతం కొనసాగుతాయి. తారక్ తో నా బంధం అలాంటిదే” అని పోస్ట్ చేశారు.