మూవీ రివ్యూ : గుణ 369

0
10419

చిత్రం : గుణ 369

వ్యవథి: 146 నిముషాలు

సమర్పణ: శ్రీమతి ప్రవీణ్‌ కడియాల

నిర్మాణ సంస్థ: జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.జి.మూవీ మేకర్స్‌

నటీనటులు: కార్తికేయ, అనఘ, మహేశ్‌, నరేశ్‌, హేమ, కౌముది, ఆదిత్యమీనన్‌, శివాజీ తదితరులు

కెమెరా: రామ్‌రెడ్డి

సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌

ఆర్ట్‌: జి.ఎం.శేఖర్‌

ఎడిటర్‌: తమ్మిరాజు

నిర్మాతలు: అనీల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి

యువ కథానాయకుడు కార్తికేయ తొలి చిత్రం `RX 100`తో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అదే స్పీడును ’హిప్పీ‘తో కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే ఈసారి కమర్షియల్ ఫార్మేట్‌పై నమ్మకంతో కార్తికేయ నటించిన చిత్రం `గుణ 369`. ప్రముఖ దర్శకుడు బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో సినిమాలో యాక్షన్ పార్ట్ తక్కువగా ఏం ఉండదని చెప్పకనే చెప్పాడీ దర్శకుడు. మరి `గుణ 369` ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం…

కథ: 

గుణ(కార్తికేయ) బి.టెక్ పాస్ కావడానికి ప్రయత్నాలు చేస్తూనే మరో పక్క గ్రానైట్ క్వారీలో మార్కెటింగ్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. తమ కాలనీలోకి వచ్చిన గీత(అనఘ)ను ప్రేమిస్తాడు. గుణ ప్రవర్తన నచ్చడంతో గీత కూడా అతన్ని ప్రేమిస్తుంది. కథ ఇలా సాగుతుండగా.. ఒంగోలులోనే పెద్ద రౌడీ గద్దల గుంట రాధ(ఆదిత్యమీనన్). దందాలు, సెటిల్‌మెంట్స్ చేసే రాధ హత్య కేసులో గుణ ఇరుక్కుంటాడు. అసలు హంతకులు తప్పించుకుపోవడంతో పోలీసులు 3 నెలలు గుణని జైల్లో ఉంచుతారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన లవర్ గీత, వేరే పెళ్లి చేసుకోవాల్సి రావడంతో తప్పక ఆత్మహత్య చేసుకుందని తెలిసి బాధపడతాడు. అదే సమయంలో రాధ మనుషులు గుణపై, అతని కుటుంబంపై దాడి చేస్తారు. వారి నుండి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు గుణ. తన కొడుకుని చంపిన వారి ఆచూకీ కనుక్కోలేకపోతే.. కుటుంబంతో సహా అందరినీ చంపేస్తానని గుణకి రాధ తల్లి వార్నింగ్ ఇస్తుంది. దాంతో హంతకులను పట్టుకోవడానికి  గుణ ఏం చేశాడు? చివరలో గుణకి తెలిసే షాకింగ్ నిజమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ: 

నటీనటుల పరంగా చూస్తే.. తొలి రెండు చిత్రాలు లవ్ ఎంటర్‌టైనర్స్. కాగా.. మూడో సినిమా పక్కా మాస్ కమర్షియల్. రెండు షేడ్స్ ఉండే పాత్ర. తొలి హాఫ్‌లో కుటుంబం కోసం, ప్రేయసి కోసం తాప్రత్రయ యువకుడిగా కనిపించిన కార్తికేయ.. సెకండాఫ్‌లో పక్కా మాస్ యాక్షన్ హీరోలా అద్భుతమైన స్టంట్స్‌తో మెప్పించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో మంచి ఎమోషల్ పాత్రను చక్కగా ఎలివేట్ చేశాడు హీరో కార్తికేయ. పాత్రలో ఒదిగిపోయాడు. తన నటనలో ఓ మెచ్యూరిటీ ఉంది. ఇక హీరోయిన్ అనఘ, తెలుగులో తొలి  చిత్రమైనా మంచి పాత్రను చేసినందుకు అభినందించాలి. ఇక నటుడు మహేశ్‌కి చాలా మంచి క్యారెక్టర్ పడింది. రంగస్థలంలో పాత్ర తర్వాత .. అంత మంచి పాత్రలో తను కనపడ్డాడు. ఆ పాత్రకు మహేశ్ న్యాయం చేశాడు. ఇక గద్దల గుంట రాధ అనే కీలకమైన రౌడీ పాత్రలో ఆదిత్య మీనన్ చక్కగా నటించాడు. బేసిక్‌గా విలన్ పాత్రలు చేసే ఆదిత్యమీనన్, ఈ పాత్రను సునాయసంగానే చేసినా.. ఆ పాత్రకు ఓ గాంభీర్యాన్ని తీసుకొచ్చాడు. ఇక నరేశ్, హేమ, కౌముది తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు అర్జున్ జంధ్యాల సినిమాను కేవలం కమర్షియల్ యాంగిల్లోనే కాకుండా, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా చిత్రీకరించాడు. ఆ మెసేజ్‌ను ఓ ఎమోషన్‌తో క్యారీ చేసిన తీరు చాలా బావుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం బావుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. రామ్‌రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. సందర్భానుచితం వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి.

రేటింగ్: 3/5

బాటమ్ లైన్ :`గుణ 369`..మంచి సందేశాన్నిచ్చే కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here