రాక్షసుడు మూవీ రివ్యూ

0
5390

చిత్రం: రాక్షసుడు

వ్య‌వ‌థి : 149 నిమిషాలు

సెన్సార్‌: యు/ఎ

బ్యాన‌ర్స్: ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల త‌దిత‌రులు

దర్శ‌క‌త్వం: రమేష్ వర్మ పెన్మత్స

నిర్మాత‌లు: సత్యనారాయణ కోనేరు, హవీష్

క‌థ‌, స్క్రీన్‌ప్లే: రామ్ కుమార్

మ్యూజిక్‌: జిబ్రాన్

సినిమాటోగ్ర‌ఫీ: వెంకట్ సి దిలీప్

ఎడిటింగ్: అమర్ రెడ్డి

డైలాగ్స్‌: సాగర్

గత ఏడాది తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల వ‌రుస‌లో “రాట్ససన్” ముందుంటుంది.. ఆ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ “రాక్షసుడు“. పేరుతో తెర‌కెక్కించారు. భారి అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా ఆగష్టు 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ చిత్ర విశేషాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కథ: అరుణ్ కుమార్ (బెల్లంకొండ శ్రీనివాస్) దర్శకుడు అవ్వాలనే ధ్యేయంతో.. ప్ర‌పంచంలో జ‌రిగిన వరుస మిస్ట‌రి హత్యలన్నీటిని స్టడీ చేసి.. ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. ఆ కథతో చాలా మంది ప్రొడ్యూస‌ర్స్ ని క‌లుస్తాడు. కాని ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఈ లోపు తన మామయ్య (రాజివ్ క‌న‌కాల‌) ఫోర్స్ తో.. ఎస్.ఐ పరీక్షలు రాసి డిపార్ట్ మెంట్ లో జాయిన్ అవుతాడు. అప్పటికే.. న‌గ‌ర పోలీసులకు పెద్ద సమస్యగా మారిన వరుస యువతుల హత్య కేస్ లో అరుణ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. తాను ఎన్నాళ్ల నుండో స్క్రిప్ట్ కోసం కలెక్ట్ చేసిన డీటెయిల్స్ బట్టి ఈ హత్యలు చేస్తున్నది ఓ సీరియల్ కిల్లర్ అని గ్రహించి.. అతడ్ని పట్టుకోవడం కోసం ఒక కొత్త దారిని కనుక్కోంటాడు. చివరికి అర్జున్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకోగలిగాడా? అసలు ఆ సైకో కిల్లర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? స్కూల్ లో చదువుకొనే అమ్మాయిలను టార్గెట్ గా ఎందుకు ఎంచుకొన్నాడు? వంటి ప్రశ్నలకు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పిన సమాధానాల సమాహారమే “రాక్షసుడు”

నటీనటుల పనితీరు: ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెర్‌ఫార్మెన్స్ గురించే మాట్ల‌డుకోవాలి. ముందుగా మంచి క‌థ ఉన్న స‌రైన ప్రొడ్యూస‌ర్ దొర‌క‌క అన్ని ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు తిరిగే సాధార‌ణ‌ వ్య‌క్తిగా. త‌రువాత త‌న కుటుంబ అవ‌స‌రాల కోసం అయిష్టంగానే పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యే వ్య‌క్తిగా కథకు అవసరమైన వేరియేషన్ ని చాలా చ‌క్క‌గా చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ అలరించాడు. ఈ సినిమాలో త‌న‌కి దొరికిన స్క్రీన్ స్పేస్ ని పూర్త‌గా ఉపయోగించుకున్నాడు. డిపార్ట్ మెంట్ నుండి ఎలాంటి సాయం లేకున్నా త‌న‌కున్న వ‌న‌రుల‌తోనే అత్యంత కృర‌మైన సైకో కిల్ల‌ర్ ను ప‌ట్టుకునే పోలీస్ ఆఫిస‌ర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ న‌ట‌న ఆకట్టుకుంటుంది. ఇక అందాల భామ అనుపమ క్యూట్ లెక్చరర్ గా ఆకట్టుకొంది. ఆమె వయసుకు మించిన పాత్ర అనిపించినప్పటికీ.. నట ప్రతిభతో దాన్ని స‌రిచేసింది. రాజేవ్ కనకాల ఎమోషనల్ రోల్లో ఎప్పట్లానే ఆకట్టుకొన్నాడు. సొంత కూతురు కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ గా రాజీవ్ కనకాల ఎమోషనల్ సన్నివేశాలలో చక్కగా నటించారు. చాలా రోజుల తర్వాత కాస్త పెద్ద పాత్రలో కనిపించాడు. కొన్ని కీలకపాత్రలు మినహా.. సినిమాలో నెగిటివ్ రోల్స్ ప్లే చేసిన నటులందరూ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.

సాంకేతికవర్గం పనితీరు: జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ & వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్. జిబ్రాన్ నేపధ్య సంగీతం ప్రేక్షకుల్ని ప్రతి సన్నివేశంలో లీనమయ్యేలా చేయడానికి దోహదపడింది. కొన్ని సన్నివేశాల్లో జిబ్రాన్ పనితనం వెన్నులో వ‌నుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆయన మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. వెంకట్ సి.దిలీప్ కెమెరా యాంగిల్స్, కలర్ గ్రేడింగ్, లైటింగ్ & డి.ఐ విషయంలో తన మార్క్ చూపించాడు. ఏ స్టూడియో కోనేరు స‌త్య‌నారాయ‌న ప్రొడక్షన్ వేల్యుస్ బాగున్నాయి. త‌మ బేన‌ర్ కి మెద‌టి సినిమా అయినా నిర్మాణం ప‌రంగా పూర్తి స‌హాకారం అందించారు. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్,ఎడిటింగ్‌ తమిళ వెర్షన్ కంటే తెలుగులో బావున్నాయి. దర్శకుడిగా రమేష్ వర్మ ఒరిజినల్ వెర్షన్ లోని ఎసెన్స్ ని మిస్ అవకుండా ఉత్కంఠగా సినిమాని నడిపించారు. నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టుకోవడంలో కూడా స‌క్సెస్ అయ్యారు.

విశ్లేషణ: సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకొనేలా సాగుతుంది. సినిమా ఓ సైకో కిల్లర్ ని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ, దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఎక్కడా ప్రేక్షకుడిని నిరాశపరచకుండా ఆద్యంతం ఉత్కంఠగా సాగే క్రైమ్ థ్రిల్లర్ అనడంలో సందేహం లేదు. థ్రిల్లర్ జోన‌ర్ ని ఇష్టపడే ప్రేక్షకుడికి` రాక్షసుడు` మంచి అనుభూతిని పంచుతుంది.

రేటింగ్ : 3.25/5

బాట‌మ్‌లైన్ : “రాక్షసుడు” ఉత్కంఠ రేపే థ్రిల్లర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here