రివ్యూ: డియ‌ర్ కామ్రేడ్‌

0
5343

చిత్రం: డియ‌ర్ కామ్రేడ్‌

వ్య‌వ‌థి :169.57 నిమిషాలు

సెన్సార్‌: యు/ఎ

బ్యాన‌ర్స్: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా త‌దిత‌రులు

క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: భ‌ర‌త్ క‌మ్మ‌

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని

మ్యూజిక్‌: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్

ఎడిటింగ్, డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌

డైలాగ్స్‌: జె కృష్ణ‌

ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామాంజ‌నేయులు

సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌

`అర్జున్ రెడ్డి` సెన్సేష‌న‌ల్ హిట్‌తో యూత్‌లో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `గీత‌గోవిందం`తో రూ.100 కోట్ల క‌లెక్ష‌న్‌ క్ల‌బ్‌లో జాయిన్ అయ్యాడు. ఈచిత్రంలో న‌టించిన విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక పెయిర్‌ను హిట్ పెయిర్ అని అంద‌రూ అన్నారు. ఇదే హిట్ పెయ‌ర్ వెంట‌నే మ‌రో సినిమాలో న‌టిస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ఆ సినిమాయే `డియ‌ర్ కామ్రేడ్‌`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా రీచ్ అయ్యిందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ:

చైత‌న్య అలియాస్ బాబీ(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) వైజాగ్‌లో కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్‌. మార్కిస్ట్ భావాల‌ను క‌లిగి ఉండే యువ‌కుడు కావ‌డంతో కోపం ఎక్కువ‌గానే వ‌స్తుంటుంది. అయితే ఆ కోపంలో ఓ కార‌ణం ఉంటుంది. హైద‌రాబాద్ నుండి పెళ్లి చూడ‌టానికి వ‌చ్చిన అప‌ర్ణాదేవి అలియాస్ లిల్లీ(ర‌ష్మిక మంద‌న్న)తో బాబీ ప్రేమ‌లో పడతాడు. అన్న‌య్య కాలేజీ గొడ‌వ‌ల్లో చ‌నిపోవ‌డం వ‌ల్ల లిల్లీకి గొడ‌వ‌లంటే భ‌య‌మే. ఆ కార‌ణంగా కాలేజ్ గొడ‌వ‌ల్లో త‌ల‌దూర్చ‌వద్ద‌ని బాబీని కోరుతుంది. అయితే బాబీ గొడ‌వ‌లు ప‌డుతాడు. దీంతో మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. మూడేళ్ల వ‌ర‌కు లిల్లీ, బాబీని క‌లుసుకోదు. ఆమె జ్ఞాప‌కాల నుండి బాబీ క్ర‌మంగా మారి దారిలో ప‌డ‌తాడు. సౌండ్ థెర‌ఫీలో రీసెర్చ్ చేస్తుంటాడు. అందులో భాగంగా ఓసారి హైద‌రాబాద్ వెళ‌తాడు. అక్క‌డ అనుకోకుండా లిల్లీని క‌లుసుకుంటాడు. అయితే ఆమె మాన‌సిక ప‌రిస్థితి బావుండదు. ఇంత‌కు లిల్లీకి ఏమ‌వుతుంది? లిల్లీ మాన‌సిక ప‌రిస్థితి పాడు కావ‌డానికి కార‌ణ‌మెవ‌రు? లిల్లీ స‌మ‌స్య‌ను తీర్చ‌డానికి బాబీ ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:

న‌టీన‌టుల ప‌రంగా చూస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ డిఫ‌రెంట్ షేడ్స్‌లో ఒదిగిపోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న పోషించిన అర్జున్ రెడ్డి, గీత‌గోవిందం చిత్రాల‌కు భిన్న‌మైన పాత్ర అనే చెప్పాలి. క్యారెక్ట‌ర్ కోపంతో గొడ‌వ‌లు ప‌డుతున్న‌ట్లుగానే ఉంటుంది కానీ.. అందుకు కార‌ణాలు ఉండేలా పాత్ర‌ను డైరెక్ట‌ర్ భ‌ర‌త్ క‌మ్మ డిజైన్ చేశాడు. కాలేజ్ స్టూడెంట్స్ లీడ‌ర్‌, ల‌వ‌ర్‌బోయ్‌, క్లైమాక్స్‌లో ప్రేయ‌సి కోసం తాప‌త్ర‌య‌ప‌డే ప్రేమికుడు.. ఇన్ని వేరియేష‌న్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌ర్‌ను లీడ్ చేసుకున్నాడు. ఫ‌స్టాఫ్ సినిమా అంత‌టా హీరోలోని యాంగ‌ర్ యాంగిల్‌తో పాటు ల‌వ్ యాంగిల్ ఎలివేట్ అవుతుంది. అందుకు త‌గిన‌ట్లు స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు. అలాగే మ‌రో వైపు ర‌ష్మిక మంద‌న్నా గొడ‌వ‌లంటే భ‌య‌ప‌డే అమ్మాయిగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుంటుంది? అనే దానికి చెప్పే కార‌ణం స‌హేతుకంగానే క‌న‌ప‌డుతుంది. చారుహాస‌న్ పాత్ర డీసెంట్‌గా హీరోను ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుంది. ఇక హీరోయిన్ సిస్ట‌ర్‌గా న‌టించిన శృతి, హీరో ఫ్రెండ్స్‌లో కామెడీని పంచే పాత్ర‌లో సుహాస్ ఇలా అన్నీపాత్ర‌లు వాటికి అనుగుణంగా న‌టించాయి.

ఇక టెక్నిక‌ల్‌గా చూస్తే ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ స్టూడెంట్స్‌, ల‌వ్ అనే అంశాల‌తో పాటు ప్ర‌స్తుతం క్రీడల్లో మ‌హిళ‌లు ఫేస్ చేసే ప్ర‌ధానమైన ఓ స‌మ‌స్య‌ను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. చాలా మంచి ప్ర‌య‌త్నం. ఈ పాయింట్‌ను ప్రీ క్లైమాక్స్ నుండి సిద్ధం చేశారు. దానికి లింక్ అప్‌గా హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసుకుంటూ వ‌చ్చారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీతం అందించిన పాట‌ల్లో మెలోడి సాంగ్స్ బావున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సుజిత్ సారంగ్ కెమెరా ప‌నిత‌నం బావుంది. సినిమాను నిర్మాణం ప‌రంగా చూస్తే.. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ మేకింగ్ వేల్యూస్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. స‌న్నివేశాల‌కు త‌గిన డైలాగ్స్ ఉన్నాయి. గీత‌గోవిందం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్దాయి. ఆ అంచ‌నాల‌కు ధీటుగా డియ‌ర్ కామ్రేడ్‌లో న‌టించారు విజ‌య్‌, ర‌ష్మిక‌.

బాటమ్ లైన్: డియ‌ర్ కామ్రేడ్‌……ప్రేమిస్తాడు.. పోరాటంలో తోడుంటాడు

రేటింగ్‌: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here