ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
ఇస్మార్ట్ శంకర్
తారాగణం: రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్, పునీత్ ఇస్సార్, ఆశిష్ విద్యార్థి, తులసి, సత్యదేవ్, సుధాంశు పాండే, షాయాజీ షిండే, మధుసూదన్, గెటప్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
సంగీతం: మణిశర్మ
పాటలు: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్
ఆర్ట్: జానీ షేక్
ఫైట్స్: రియల్ సతీష్
సమర్పణ: లావణ్య
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 18.07.2019
దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ది ఓ విభిన్న శైలి. అతని సినిమాల్లోని కథగానీ, కథనం గానీ, హీరో క్యారెక్టరైజేషన్ గానీ మిగతా దర్శకులతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ వల్లే ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. ఈరోజు విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి హీరో సెలెక్షన్‌లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు పూరి. ఇప్పటివరకు కొన్ని యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ లవర్‌బోయ్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకున్న రామ్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం హీరోగా ఎన్నుకోవడంలోనే మొదటి సక్సెస్‌ను సాధించారు. ఫస్ట్‌టైమ్ వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కింది? పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని ఎంత రిచ్‌గా నిర్మించారు? ఈ సినిమాతో పూరి మరోసారి తన మార్క్‌ని చూపించారా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ
అతని పేరు శంకర్(రామ్) అలియాస్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ క్యారెక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే రౌడీ. అతను చాందిని(నభా నటేష్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న చాందిని అతని ప్రేమలో పడిపోతుంది. ఆమెతో లవ్ ఎఫయిర్ కొనసాగిస్తున్న టైమ్‌లోనే లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు అనుకునే ఓ డీల్‌ని అతని కాకా(మధుసూదన్) తీసుకొస్తాడు. అడ్వాన్స్‌గా పెద్ద ఎమౌంట్ ఇస్తాడు. ఆ డీల్ ఏమిటంటే ఓ మాజీ మంత్రిని హత్య చేయడం. అనుకున్నట్టుగానే ఆ మాజీ మంత్రిని ఫినిష్ చేస్తాడు శంకర్. ఆ తర్వాత చాందినితో కలిసి గోవా వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న గోవా లోకల్ పోలీసులు అతనిపై ఎటాక్ చేస్తారు. ఆ ఎటాక్‌లో చాందిని చనిపోతుంది. చాందిని చావుకు కారణమైన వారిపై పగతీర్చుకోవడానికి సిద్ధపడతాడు శంకర్. ఆ క్రమంలో తమపై ఎటాక్ చేయించిన కాకాను చంపేస్తాడు. మరో పక్క సిబిఐ ఆఫీసర్ అరుణ్(సత్యదేవ్) మాజీ మంత్రి హత్య కేసును పరిశోధిస్తుంటాడు. ఆ క్రమంలో శంకర్‌ను, అరుణ్‌ను ట్రాప్ చేసి ఓ చోటికి రప్పిస్తారు హంతకులు. ఆప్పుడు వారిద్దరిపై ఎటాక్ జరుగుతుంది. అరుణ్ చనిపోతాడు, శంకర్ ప్రాణాలతో బయటపడతాడు. మర్డర్ కేసుకి సంబంధించిన కీలకమైన విషయాలన్నీ అరుణ్‌కి తెలుసు. అవి తెలుసుకోవాలంటే అరుణ్ మెమరీని ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని, అలా చేస్తే ఆ మెమరీ అంతా రాబట్టవచ్చని చెప్తుంది అరుణ్ ప్రియురాలు సారా(నిధి అగర్వాల్). ఆ ప్రయోగం శంకర్‌పై చెయ్యాలని సిబిఐ డిసైడ్ అవుతుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అరుణ్ మెమరీ అంతా శంకర్ బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. ఒకసారి అరుణ్‌లా, ఒకసారి శంకర్‌లా బిహేవ్ చేసే శంకర్ నుంచి మర్డర్‌కి సంబంధించిన వివరాలు సేకరించగలిగారా? మాజీ మంత్రి హత్య వెనుక ఉన్నదెవరు? శంకర్‌పై ఎటాక్ చేయించింది ఎవరు? అరుణ్‌లా మారిన శంకర్.. సారాను కూడా లవ్ చేశాడా? ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సమీక్ష
ఇప్పటివరకు రామ్‌లో చూడని యాంగిల్ ఈ సినిమాలో కనిపిస్తుంది. పక్కా తెలంగాణ కుర్రాడిలా రామ్ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చేశాడు. తెలంగాణ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ హండ్రెడ్ పర్సెంట్ దించేశాడు. లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక డాన్సులు, ఫైట్స్ అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు. కొన్ని సీన్స్‌లో రామ్ చెప్పిన డైలాగ్స్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. హీరోయిన్లలో నభా నటేష్ తెలంగాణ అమ్మాయిగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రామ్ కాంబినేషన్‌లో చేసిన కొన్ని సీన్స్ యూత్‌ని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తాయి. న్యూరో సైంటిస్ట్‌గా, మరో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. సిబిఐ ఆఫీసర్‌గా సత్యదేవ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో రాణించాడు. మిగతా పాత్రల్లో షాయాజీ షిండే, మధుసూదన్, సుధాంశుపాండే, తులసి ఓకే అనిపించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాలంటే రాజ్ తోట ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సాధారణంగా పూరి సినిమాల్లో ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. దాన్నే రాజ్ కూడా కంటిన్యూ చేస్తూ మంచి ఔట్‌పుట్ ఇచ్చాడు. పాటలు కూడా చక్కగా పిక్చరైజ్ చేశాడు. చాలా కాలం తర్వాత పూరి, మణిశర్మ కాంబినేషన్‌లో సినిమా వచ్చింది. సినిమాలోని బోనాల పాటతోపాటు మిగతా పాటలన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్ పాటలకు మంచి లిరిక్స్ అందించారు. సినిమా రిలీజ్ తర్వాత ఈ పాటలు మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడని చెప్పొచ్చు. పక్కా మాస్, క్రైమ్ బ్యాక్‌డ్రాప్… ఇలా అన్ని సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా మంచి నేపథ్య సంగీతం అందించి మరోసారి తన సత్తా చాటుకున్నారు మణిశర్మ. జునైద్ సిద్ధిఖి ఎడిటింగ్ కూడా చాలా షార్ప్‌గా ఉంది. ఎక్కడా ల్యాగ్ అనిపించే సీన్స్ లేకుండా ఎంతో కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాలో మేజర్ పార్ట్ తీసుకున్నవి ఫైట్స్. రియల్ సతీష్ ఎంతో రిస్కీ ఫైట్స్ కంపోజ్ చేసి వాటిని రామ్‌తో అద్భుతంగా చేయించాడు.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బేనర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వేల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా తీశారు. ఖర్చుకు వెనుకాడకుండా రిచ్ లొకేషన్స్ సీన్స్, ఫైట్స్, పాటలు.. ఇలా సినిమా అంతా రిచ్‌గానే కనిపిస్తుంది. ఈ సినిమా ఇంత హై రేంజ్‌లో నిర్మించారంటే దానికి నిర్మాత చార్మి కౌర్ కృషి ఎంతో ఉందని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చెప్పాలంటే.. మరోసారి తనలోని డైరెక్టర్‌కి పూర్తిస్థాయిలో పని కల్పించాడు పూరి. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పూరి తన అద్భుతమైన టేకింగ్‌తో సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. రామ్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చెయ్యడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్.. ఇలా ప్రతి విషయంలోనూ పూరి తీసుకున్న కేర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన మార్క్ డైలాగ్స్‌తో థియేటర్‌లో విజిల్స్ వేయించారు. సిబిఐ ఆఫీసర్ అరుణ్ మెమరీని శంకర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత రెండు రకాల మనిషిగా రామ్‌తో పూరి చేయించిన సీన్స్ ఎంతో ఫన్‌ని తెచ్చాయి. హీరో క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ సబ్జెక్ట్, డైలాగ్స్, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫైట్స్… ఇలా అన్ని అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రామ్, పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
బాటమ్ లైన్: ఇస్మార్ట్ హిట్
రేటింగ్: 3/5