రివ్యూ: రాజ్‌దూత్‌

0
1466

లక్ష్య ప్రొడక్షన్స్‌
రాజ్‌దూత్‌
తారాగణం: మేఘాంశ్‌ శ్రీహరి, నక్షత్ర, ప్రియాంకవర్మ, అనీష్‌ కురువిళ్ళ, ఆదిత్య మీనన్‌, సుదర్శన్‌, కోట శ్రీనివాసరావు, దేవిప్రసాద్‌, ఏడిద శ్రీరామ్‌, మనోబాల తదితరులు
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్‌ చింతా
ఎడిటింగ్‌: విజయవర్థన్‌
సంగీతం: వరుణ్‌ సునీల్‌
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి.
నిర్మాత: ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ(సత్తిబాబు)
రచన, దర్శకత్వం: అర్జున్‌-కార్తీక్‌
విడుదల తేదీ: 12.07.2019

సాధారణంగా హీరోలు తమ నట వారసుల్ని చాలా గ్రాండ్‌గా, ఓ భారీ సినిమాతో హీరోలుగా లాంచ్‌ చేస్తుంటారు. కానీ, దానికి భిన్నంగా రియల్‌స్టార్‌ శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ శ్రీహరి ఓ డిఫరెంట్‌ టైటిల్‌తో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘రాజ్‌దూత్‌’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అర్జున్‌, కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ(సత్తిబాబు) మంచి క్వాలిటీతో నిర్మించారు. నటనలోగానీ, యాక్షన్‌ సన్నివేశాల్లోగానీ ఎంతో నేచురల్‌గా పెర్‌ఫార్మ్‌ చేసి రియల్‌స్టార్‌ అనిపించుకున్న శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ తన తొలి చిత్రంతో ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకోగలిగాడు? ‘రాజ్‌దూత్‌’ అనే బైక్‌ పేరుని సినిమాకి పెట్టడం వెనుక రీజన్‌ ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ

అతని పేరు సంజయ్‌(మేఘాంశ్‌ శ్రీహరి). స్టడీ కంప్లీట్‌a చేసుకొని ఫ్రెండ్స్‌తో లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. అతనికి ఓ గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా ఉంది. పేరు ప్రియ(నక్షత్ర). ప్రియ తండ్రి, సంజయ్‌ తండ్రి మంచి స్నేహితులు. ఆ చనువుతోనే ప్రియ ఇంటికి వచ్చి వెళ్తుంటాడు సంజయ్‌. పనిలోపనిగా ప్రియను తనకిచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని వేధిస్తుంటాడు. ప్రియ తండ్రి కూడా సంజయ్‌కి మాటలతో చురకలు అంటిస్తుంటాడు. అతని యాటిట్యూడ్‌ నచ్చలేదని, ఈ పెళ్లి జరగదని చెప్తాడు. పెళ్ళి విషయంలో సంజయ్‌ టార్చర్‌ కాస్త ఎక్కువ కావడంతో తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఒక పని చెయ్యాలని అంటాడు. అదేమిటంటే 20 ఏళ్ళ క్రితం తన తండ్రి వాడిన రాజ్‌దూత్‌ బైక్‌ కొన్ని కారణాల వల్ల చేతులు మారిందని, దాన్ని తీసుకొచ్చి ఇస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. అయితే అది అంత సులభం కాదని కూడా చెప్తాడు. అయినా సరే ఆ బైక్‌ని ఎలాగైనా తీసుకొస్తానని స్నేహితుడితో కలిసి బయల్దేరతాడు సంజయ్‌. ఈ ప్రయాణంలో సంజయ్‌కి ఎదురైన సమస్యలేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రియ తండ్రి రాజ్‌దూత్‌ తీసుకురమ్మని చెప్పడం వెనుక బలమైన కారణం ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సమీక్ష

మొదట చెప్పుకున్నట్టు హీరోగా మేఘాంశ్‌ లాంచ్‌ ఎలాంటి ఆర్భాటం లేని సినిమాతో జరిగింది. చాలా సింపుల్‌గా నడిచే స్టోరీతోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ సినిమాలో ఉంది. తొలి సినిమా అయినా ఎలాంటి తడబాటు లేకుండా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ఆర్టిస్ట్‌లా చేశాడు మేఘాంశ్‌. పాటల్లో, ఫైట్స్‌లో హీరోగా అతన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్‌ చెయ్యకపోయినా హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని బలంగా ప్రూవ్‌ చేశాడు మేఘాంశ్‌. లవ్‌ సీన్స్‌లో, ఎంటర్‌టైన్‌మెంట్‌లో, డాన్సుల్లో ఫైట్స్‌లో మంచి నటనను ప్రదర్శించాడు. హీరోయిన్‌గా నటించిన నక్షత్ర తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. హీరో రోడ్‌ జర్నీలో తారసపడి అతనికి ధైర్యం చెప్పే క్యారెక్టర్‌లో ప్రియాంక వర్మ ఆకట్టుకుంది. హీరో తండ్రిగా, దేవిప్రసాద్‌, హీరోయిన్‌ తండ్రిగా అనీష్‌ కురువిళ్ళ, ఊరి పెద్దగా ఆదిత్య మీనన్‌, హీరో స్నేహితుడిగా సుదర్శన్‌ తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా మనోబాల క్యారెక్టర్‌ అందర్నీ నవ్విస్తుంది. కోట శ్రీనివాసరావు అతిథి పాత్రలో కనిపించారు.

టెక్నీషియన్స్‌లో ముందుగా సినిమాటోగ్రాఫర్‌ విద్యాసాగర్‌ గురించి చెప్పుకోవాలి. చక్కని ఫోటోగ్రఫీతో సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే లైటింగ్‌ మెయిటెయిన్‌ చేస్తూ సినిమా బ్రైట్‌గా రావడానికి తోడ్పడ్డారు. విజయవర్థన్‌ ఎడిటింగ్‌ కూడా చాలా షార్ప్‌గా ఉంది. ఆడియన్స్‌ ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవకుండా అద్భుతంగా ఎడిట్‌ చేశారు. వరుణ్‌ సునీల్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది. సినిమాలో సిట్యుయేషన్‌ సాంగ్సే ఎక్కువగా ఉన్నాయి. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ‘ప్రాణం నువ్వే కదా!’ అనే పాట ఆకట్టుకుంది. కథ, కథనాలకు తగ్గట్టుగా జె.బి. ఎక్స్‌లెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు.

ఇక నిర్మాత ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ గురించి చెప్పాలంటే రియల్‌స్టార్‌ శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ను తన బేనర్‌ ద్వారా హీరోగా పరిచయం చెయ్యడంతోనే నిర్మాతగా సగం సక్సెస్‌ని సాధించారు. ఈ సినిమా నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బెస్ట్‌ ఔట్‌పుట్‌ రావడానికి సహకరించారు. డైరెక్టర్స్‌ అర్జున్‌, కార్తీక్‌ల గురించి చెప్పాలంటే ఒక మంచి టైటిల్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్‌ చెయ్యగలిగారు. శ్రీహరి తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అది ఎలాంటి కాన్సెప్ట్‌ అయి ఉండాలని అందరూ కోరుకుంటారో దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రాని ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అర్జున్‌-కార్తీక్‌. సినిమాలో ఎక్కువగా రోడ్‌ జర్నీ ఉన్నప్పటికీ ఆడియన్స్‌ ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవ్వకుండా కథను నడిపించారు. సినిమాలో అక్కడక్కడా ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రివీల్‌ చేసిన నిజం అందర్నీ థ్రిల్‌ చేస్తుంది. ఒక చిన్న పాయింట్‌తో కథతో రాసుకున్నప్పటికీ ఆద్యంతం ఆసక్తిదాయకంగా సినిమాను నడిపించడంలో అర్జున్‌, కార్తీక్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు.

ఫైనల్‌గా చెప్పాలంటే ‘రాజ్‌దూత్‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ సినిమా మేఘాంశ్‌ శ్రీహరికి హీరోగా పర్‌ఫెక్ట్‌ లాంచ్‌ అని చెప్పొచ్చు.

బాటమ్‌ లైన్‌: మేఘాంశ్‌ పర్‌ఫెక్ట్‌ లాంచ్‌

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here