రివ్యూ: కల్కి

0
759

కల్కి

బ్యానర్  : హ్యాపీ మూవీస్

తారాగణం: డా.రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, అశుతోష్‌ రాణా, సిద్దు జొన్నలగడ్డ, శత్రు, పూజిత, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిటింగ్‌: గౌతమ్‌ నెరుసు

సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌

సమర్పణ: శివాని, శివాత్మిక

నిర్మాత: సి.కళ్యాణ్‌

రచన, దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ

విడుదల తేదీ: 28.06.2019

‘గరుడవేగ’ చిత్రం ఘనవిజయం అందించిన ఉత్సాహంతో డా.రాజశేఖర్‌ చేసిన తాజా చిత్రం ‘కల్కి’. ‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్‌ చేస్తున్న కల్కిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘అ!’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన ప్రశాంత్‌వర్మ మరో విభిన్న కథాంశంతో రూపొందించిన సినిమా ‘కల్కి’. రాజశేఖర్‌, ప్రశాంత్‌వర్మ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు ఎంత విభిన్నంగా ఉన్నాయి? గరుడవేగ చిత్రంతో హీరోగా మరోసారి తన స్టామినా చూపిన రాజశేఖర్‌కి ‘కల్కి’ ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ‘అ!’ దర్శకుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న ప్రశాంత్‌వర్మ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు కొల్లాపూర్‌లో రెండు వర్గాల మధ్య ఉండే శత్రుత్వంతో మొదలయ్యే ఈ కథలో వారి వారసులైన నరసప్ప(అశుతోష్‌ రాణా), పెరుమాండ్లు(శత్రు) దాన్ని కొనసాగిస్తూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నరసప్ప తమ్ముడు శేఖర్‌బాబు(సిద్ధు జొన్నలగడ్డ) దారుణంగా హత్య చేయబడతాడు. ఇది పెరుమాండ్లు పనే అని భావించిన నరసప్ప మనుషులు పెరుమాండ్లు అనుచరుల్ని చంపుతూ వస్తుంటారు. దాంతో పెరుమాండ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అదే సమయంలో శేఖర్‌బాబు హత్య కేసును ఛేదించేందుకు వస్తాడు పోలీస్‌ ఆఫీసర్‌ కల్కి(రాజశేఖర్‌). అతని కంటే ముందే దేవదత్తు(రాహుల్‌ రామకృష్ణ) అనే జర్నలిస్ట్‌ శేఖర్‌బాబు హత్య వెనుక ఉన్న మిస్టరీని కనుక్కోవడానికి కొల్లాపూర్‌లో దిగుతాడు. కల్కితో దేవదత్తుకి పరిచయం ఏర్పడుతుంది. అక్కడి నుంచి హంతకులు ఎవరు అనేది ఇద్దరూ కలిసి పరిశోధిస్తుంటారు. నరసప్ప, పెరుమాండ్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఎందుకొచ్చింది? శేఖర్‌బాబుని చంపింది ఎవరు? పెరుమాండ్లు ఎందుకు పరారయ్యాడు? కల్కి అంటే భగవంతుడి కలియుగ అవతారం. ఆ పేరుతో వచ్చిన మన కథానాయకుడు కొల్లాపూర్‌లో దుష్టశిక్షణ ఎలా చేశాడు? అనేది మిగతా కథ.

కల్కి పాత్రలో రాజశేఖర్‌ చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌లో తన దైన శైలితో ఆకట్టుకున్నాడు. కొన్ని రిస్కీ ఫైట్స్‌ని కూడా అవలీలగా చేశాడు. డైలాగ్స్‌ కంటే కూడా తన హావభావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అన్నింటినీ మించి ఏం సెప్తిరి ఏం సెప్తిరి అనే తన డైలాగ్‌తోనే కామెడీ చేయడం విశేషం. అతనికి జోడీగా అదా శర్మ కూడా మంచి నటనను ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నరసప్పగా అశుతోష్‌ రాణా టెరిఫిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. పెరుమాండ్లుగా శత్రు కూడా తన పెర్‌ఫార్మెన్స్‌తో మంచి మార్కులు సాధించాడు. ముఖ్యంగా జర్నలిస్ట్‌గా నటించిన రాహుల్‌ రామకృష్ణ పాత్ర సినిమాలో ఎక్కువగానే ఉంది. అయితే అతను కనిపించిన ప్రతిసారీ తన డైలాగ్స్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా పాత్రలు పోషించిన సిద్ధు జొన్నలగడ్డ, పూజిత, నాజర్‌ తదితరులు తమ క్యారెక్టర్ల పరిధి మేరకు ఫర్వాలేదు అనిపించారు.

టెక్నికల్‌ అంశాల గురించి చెప్పాలంటే దాశరథి శివేంద్ర ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎంతో నేచురల్‌గా ప్రతి సీన్‌ రావడంలో అతని కృషి కనిపిస్తుంది. గౌతమ్‌ ఎడిటింగ్‌ కూడా ఎక్కడా ల్యాగ్‌ అనేది లేకుండా చాలా షార్ప్‌గా చేశాడు. శ్రవణ్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి బాగా ప్లస్‌ అయింది. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా అద్భుతంగా చేశాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాటతో వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. సి.కల్యాణ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే రొటీన్‌ కథలకు భిన్నంగా ఉన్న కథతో మరోసారి మ్యాజిక్‌ చేశాడు ప్రశాంత్‌వర్మ. దశావతారాలతోనే హీరో దుష్ట శిక్షణ చేయడం ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. అలాగే నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. రాజశేఖర్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగానే యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్లాన్‌ చేయడం కూడా దర్శకుడి సత్తాను తెలియజేసింది. రాజశేఖర్‌ని ఇంతకుముందు కంటే డిఫరెంట్‌ ప్రజెంట్‌ చెయ్యడంలో వర్మ సక్సెస్‌ అయ్యాడు. నరసప్ప, పెరుమాండ్లు మధ్య ఉన్న శత్రుత్వానికి మూలం ఏమిటనే విషయాల్ని సినిమా ప్రారంభంలోనే విపులంగా చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. కథలో జరుగుతున్న ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించే లోపే వెంట వెంటనే ఇన్సిడెంట్స్‌ జరుగుతుంటాయి. ఆడియన్స్‌ కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళేలోపే వాటన్నింటికీ సొల్యూషన్‌ చూపించాడు. చివరి 20 నిమిషాలు తర్వాత ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలిగించాడు వర్మ. ఫైనల్‌గా చెప్పాలంటే గరుడవేగ తర్వాత రాజశేఖర్‌ నటించిన మరో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కల్కి’.

బాటమ్‌ లైన్‌: పవర్‌ఫుల్‌ ‘కల్కి’

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here