విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో ఓ సంచలనం.. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ నే కాదు.. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో.. ముందు నాటకాల్లో బాగా రాణించిన విజయ్ అనుకోకుండా యాక్టర్ అయ్యారు. సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలైన అతడి ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్షేషనల్ స్టార్ గా మలిచింది.

అర్జున్ రెడ్డి సినిమాలో నట విశ్వరూపాన్ని చూపి సంచలనం సృష్టించారు. ఇప్పుడా సినిమాల రిమేక్స్ లోనూ సదురు హీరోలు విజయ్ లా తాము నటించడం లేదని అంటున్నారంటే విజయ్ నటన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ హీరో స్టామినా తెలుసు కనుకే ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటన, స్టామినాకు ఫిదా అయిన అగ్ర నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించాయి. 2018లో ప్రతిష్టాత్మక అల్లు అరవింద్ సారథ్యంలోని గీతాఆర్ట్స్ సంస్థలో చేసే అదృష్టం విజయ్ కు దొరికింది. మెగా హీరోలతోపాటు అగ్ర హీరోలతో సినిమాలు తీసి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన గీతా ఆర్ట్స్ ఈ హీరోతో తీసిన ‘గీత గోవిందం’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ విజయ్ తోనే గీతాఆర్ట్స్ ‘టాక్సీవాలా’ తీసింది. ఈ రెండు సినిమాలు గీతా ఆర్ట్స్ కు మంచి లాభాలను తీసుకొచ్చాయి. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ లో కూడా విజయ్ ‘మహానటి’లో నటించి మెప్పించాడు.

ఇక వరుసగా రెండు సినిమాలు గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించడం.. అవి హిట్ కావడంతో విజయ్ పై అగ్ర నిర్మాణ సంస్థలు కన్నేశాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ విజయ్ తో ‘డియర్ కామ్రేడ్’ మూవీని తీసింది. ఆ సినిమా విడుదలకు రెడీ అయ్యింది.

ఈ సినిమా విడుదల కాకుండానే ఇదే మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయడానికి సిద్ధమవ్వడం విశేషం . దర్శకుడు ఆనంద్ అన్నామలై అనే కొత్త దర్శకుడితో విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవలే కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ‘హీరో’ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది. వైజయంతీ మూవీస్ లో కూడా మరో సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకున్నాడు.

ఇలా అగ్ర నిర్మాణ సంస్థలతో విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇతడి నటనా సామర్థ్యం, విలక్షణ వ్యక్తిత్వంతో ఏ అగ్ర నిర్మాణ సంస్థ కూడా అవకాశం వస్తే విజయ్ ను వదలడం లేదు. అలా విజయ్ దేవరకొండ ఇంత పెద్ద నిర్మాణ సంస్థలతో వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషమనే చెప్పాలి.