‘కాంచన 3’ సమీక్ష

0
574

బ్యానర్స్‌: రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌, లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌
తారాగణం: రాఘవ లారెన్స్‌, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, తరుణ్‌ ఆరోరా, కోవై సరళ, శ్రీమాన్‌, దేవదర్శిని, ఢిల్లీ గణేషన్‌, సూరి, అనుపమ కుమార్‌, తదితరులు
ఎడిటింగ్‌: రూబన్‌
మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి
సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌
కెమెరా: సర్వేష్‌ మురారి, వెట్రి పళని స్వామి
నిర్మాత: ఠాగూర్ మధు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

హారర్‌ కామెడీ చిత్రాలకు క్రేజ్‌ చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ చిత్రాలకు ఆదరణ పెంచిన దర్శకుల్లో రాఘవ లారెన్స్‌ ఒకరు. మాస్‌, డాన్‌, రెబల్‌ వంటి కమర్షియల్‌ చిత్రాలను తన దర్శకుడిగా తనేంటో ప్రూవ్‌ చేసుకున్నారు రాఘవ లారెన్స్‌. అయితే ఆయనకు దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చింది మాత్రం హారర్‌ కామెడీ చిత్రాలే. ముని సినిమాతో దర్శకుడిగా లారెన్స్‌ హారర్‌ కామెడీ చిత్రాలకు ఓ ఊపు తెచ్చాడు. అక్కడి నుండి ముని (హారర్‌ కామెడీ చిత్రాల) సిరీస్‌ను కంటిన్యూ చేస్తూ కాంచన, గంగ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని హారర్‌ కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు లారెన్స్‌. ఇప్పుడు ఈ ముని సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచన 3 ప్రేక్షకుల ముందుక వచ్చింది. అంతకు ముందు వచ్చిన ముని సిరీస్‌ చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో కాంచన 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను కాంచన 3 అందుకుందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం…

కథ:
మినిష్టర్‌ శంకర్‌(తరుణ్‌ అరోరా) తమ్ముడు భవాని(కబీర్‌ దుహన్‌ సింగ్‌) తనను అరెస్ట్‌ చేయాలనుకునే ఓ పోలీస్‌ ఆఫీసర్‌ను హత్య చేస్తాడు. మరుసటి రోజు రాత్రి కాళి(రాఘవ లారెన్స్‌) భవాని, అతని మనుషులను చంపేస్తాడు. మరో కోణంలో ఓ వ్యక్తి తన కూతురుకి దెయ్యం పట్టిందని తెలుసుని రష్యా నుండి భూత వైద్యులను పిలిపించి ఆ ఆత్మలను బంధించి ఓ చెట్టుకు మేకులుగా కొట్టిస్తాడు. ఈ రెండు సిట్యువేషన్స్‌ తర్వాత కథ సిటీకి వెళుతుంది. సిటీలో ఉండే రాఘవ(లారెన్స్‌) తన తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్‌), వదిన(దేవదర్శిని), అన్నకూతురితో సంతోషంగా కాలం గడుపుతుంటాడు. వరంగల్‌లోని తాతయ్య షష్టిపూర్తికి వెళ్లాల్సి వస్తుంది. ముందు ఊరికి రానని చెప్పిన రాఘవ.. అక్కడకు మావయ్యలు..వాళ్ల కూతుళ్లు వస్తున్నారని తెలుసుకుని వెళతాడు. వెళ్లే మార్గంలో తినడానికని ఓ చెట్టు క్రింద కూర్చుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ చెట్టుకు ఉన్న రెండు మేకులను తొలగిస్తారు. అక్కడి నుండి వచ్చేస్తారు. తాతయ్య ఊరు చేరుకున్న రాఘవ.. అక్కడి మరదళ్లను కలుసుకుని వారితో ఆడిపాడుతుంటాడు. రాత్రిళ్లు కాగానే రాఘవ ఉండే ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వస్తుంటాయి. ఇంట్లో ఆత్మ ఉందని ఓ అఘోరా ద్వారా తెలుసుకున్న రాఘవ తల్లి.. ఆత్మలను బంధించమని అఘోరాకే చెబుతుంది. అఘోరా కూడా బంధించానని చెబుతాడు. అందరూ సంతోషంగా ఉంటారు. కానీ మరుసటి రోజు నుండి మళ్లీ శబ్దాలు, ఏడుపులు వినపడుతుంటాయి. మళ్లీ రాఘవ కుటుంబం అంతా అఘోరా దగ్గరకు వెళతారు. అఘోరా చెప్పే విషయాలు విని షాక్‌ అవుతారు. అసలు కాళి ఎవరు? కాళికి, రాఘవకు ఉన్న రిలేషన్‌ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:
దేవుడు ఎక్కడో ఉండడు… మనుషుల రూపంలో మన మధ్యనే ఉంటాడు. అనేదే మెయిన్‌ పాయింట్‌. దీన్ని ఆధారంగా చేసుకుని ఓ కుర్రాడు కొంత మందిని చేరదీసి పెంచుతుంటాడు. వారి బాగోగులు చూస్తుంటాడు. అతనికి వచ్చిన సమస్యేంటి? అనేదే ప్రధానంగా కథ. ముని సిరీస్‌లో ఇంతకు ముందు సినిమాల్లాగానే ఘోస్ట్‌ రివేంజ్‌ డ్రామా. పాత్రధారుల విషయానికి వస్తే లారెన్స్‌ రెండు పాత్రలను చక్కగా పోషించాడు. రాఘవ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటే.. కాళి పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ పాత్రలో లారెన్స్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రను సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులకు పరిచయం చేసి.. అసలు ఈ పాత్రను ఏమైందనే ఆసక్తిని ప్లాష్‌ బ్యాక్‌ వరకు దర్శకుడిగా క్యారీ చేయడంలో లారెన్స్‌ సక్సెస్‌ అయ్యారు. లుక్స్‌ విషయంలోనే కాదు.. నటన విషయంలో చక్కటి వేరియేషన్‌ చూపించారు. ఇక హారర్‌ సన్నివేశాల విషయానికి వస్తే.. రెండు ఆత్మలు ఇతర పాత్రలను భయపెట్టే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. కోవై సరళ పాత్ర ఎప్పటిలాగానే ఆద్యంతం తనదైన స్టయిల్లో నవ్వించింది. తమ ఇంట్లో దెయ్యం ఉందా? లేదా? అని తెలుసుకునే సన్నివేశంలో కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్‌ నటన కామెడీ ఉంటుంది. పాత్రలు భయపడుతూనే ఉన్నా.. ప్రేక్షకులు నవ్వుకుంటారు. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో రెండు ఆత్మలు ఒకే శరీరంలో ఉంటే వ్యక్తి ఎలా ప్రవర్తిసాడు.. అనడానికి రాఘవ తన నటనతో ఫుల్‌ మార్కులను కొట్టేశాడు. గత ముని సిరీస్‌ల్లో ఆత్మలనను బంధించడానికి హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ దేవుళ్లను ఉపయోగించుకున్న లారెన్స్‌ ఈ సినిమాలో అఘోరాలను ఉపయోగించుకున్నాడు. ఇక మగ్గురు హీరోయిన్స్‌ వేదిక, నిక్కీ తంబోలి, ఓవియా సినిమాకు గ్లామర్‌ లుక్‌ను తెచ్చారు. సూరి పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. తరుణ్‌ అరోరా, కబీర్‌ దుహన్‌ సింగ్‌ పాత్రలు వాటి పరిధి మేర చక్కగా నటించాయి. ఫ్లాష్‌ బ్యాక్‌లో కాళి పాత్రను పవర్‌ఫుల్‌గా ఓ వైపు.. మరోవైపు హృద్యంగా చూపించారు. ఇప్పటి రాజకీయాలను సునిశితంగా విమర్శించారు. చివర్లో ఓ ఆత్మకు దేవుడు ఎలా సాయపడి.. గెలిపించాడనే మరో పాయింట్‌ను చూపించారు. తమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలో కీలకమైన హారర్‌ కామెడీ సన్నివేశాలను నెక్ట్స్‌ రేంజ్‌కు తీసుకెళ్లాయనడంలో సందేహం లేదు. సర్వేష్‌ మురారి, పళనిస్వామి కెమెరా వర్క్‌ సింప్లి సూపర్బ్‌. చివర్లో ముని 5 వస్తుందని లీడ్‌ ఇచ్చారు రాఘవ లారెన్స్‌.

చివరగా… కాంచన 3… భయపెడుతుంది.. నవ్విస్తుంది
రేటింగ్‌: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here