‘పండంటి కాపురం’ చిత్రంతో నటుడిగా ఓనమాలు నేర్చుకొని ‘నాలుగు స్తంభాలాట’, ‘ప్రేమ సంకెళ్లు’, ‘రెండు జెళ్ల సీత’ ‘చిత్రం భళారే విచిత్రం’, ‘జంబలకిడి పంబ’ వంటి ఎన్నో డిఫరెంట్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించి తనకంటూ సపరేట్ అభిమానుల్ని ఏర్పరచుకున్నారు సినియర్ నటుడు నరేష్. కొంతకాలం గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. రీసెంట్‌గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాకుండా ‘మా’ అసోసియేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ ఎంతోమందికి తనవంతు సాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లాను దత్తతు చేసుకుని అక్కడ ‘కళాకారుల ఐక్య వేదిక’ సంఘాన్ని ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. నటుడిగానే కాకుండా సేవాతత్పరుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్న నరేష్ పుట్టినరోజు జనవరి 20. ఈ సందర్భంగా హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఆయన స్వగృహంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ-శ్రీమతి విజయనిర్మల, సహజనటి జయసుధ, ‘మా’ అధ్యక్షులు, డా. రాజేంద్రప్రసాద్, కార్యదర్శి శివాజీ రాజా, సీనియర్ జర్నలిస్ట్‌లు బి.ఎ.రాజు, వినాయకరావు, సురేష్ కొండేటి, హీరోలు సుధీర్‌బాబు, నవీన్, నటుడు గౌతంరాజు, నటి హేమ తదితరులు పాల్గొన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ – ”నరేష్ పుట్టినరోజు ఇంత గొప్పగా జరుపుకోవడం చాలా హ్యాపీగా వుంది. హీరోగా ఎన్నో సూపర్‌హిట్ ఫిలింస్, హండ్రెడ్ డేస్, సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో నరేష్ యక్ట్ చేశాడు. కొంతకాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేసి ‘ఘటన’ చిత్రంలో డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ చేశాడు. ‘అ..ఆ’ చిత్రంలో ఫాదర్‌గా ఎంతో ఆకట్టుకున్నాడు. లేటెస్ట్‌గా ‘శతమానం భవతి’ చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్ ద్వారా అందర్నీ నవ్విస్తున్నాడు. ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో కామెడీ రోల్ చేశాడు. ఇంకా ఎన్నో సినిమాల్లో చేయబోతున్నాడు. మరిన్ని మంచి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి” అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ – ”నాకు తెలిసి ఇంత గొప్పగా బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడం నరేష్‌కే సాధ్యం అవుతుందని అనుకుంటున్నాను. రకరకాల వాయిద్యాలతో ఒళ్లు జలదరించేలా కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మా నరేష్ వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలని, కళాకారులు ఆశీర్వదించడం సంతోషంగా వుంది. ఇక్కడకు వచ్చిన మా అభిమానులందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.
‘మా’ అధ్యక్షుడు, నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ”నరేష్‌ని నన్ను సినిమా ఇండస్ట్రీలో ట్విన్స్ అని పిలుస్తుంటారు. మేం ఇద్దరం జంధ్యాలగారి చిత్రాల ద్వారా హీరోగా పరిచయం అయి ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేశాం. నేను సినిమాల్లోకి రాకముందు నుండి నరేష్‌తో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. ఏ యాక్టర్‌కైనా వారి యొక్క బలం, నటన, గొప్పతనం తెలియాలంటే అది వారి ఫ్యాన్స్ చూసే చెప్పాలి. మా అభిమానులందరికీ ఆరాధ్య దైవం కృష్ణగారు. ఆ రోజుల్లో ఎన్నో వెరైటీ చిత్రాలు ‘అల్లూరి సీతారామరాజు’లాంటి గొప్ప సినిమాలు చేసి మాలాంటివారికి ఆదర్శప్రాయంగా నిలిచారు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి సినిమాలు చేసి మరింత పేరు తెచ్చుకోవాలి” అన్నారు.
నరేష్ మాట్లాడుతూ – ”మా కుటుంబంలో అందరి బర్త్‌డేలు ఒక పండగలా అభిమానులు చేస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో వేలాది మంది అభిమానులు తరలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నా బర్త్‌డేకి ఒక ప్రత్యేకత వుంది. నేను దత్తత తీసుకున్న హిందూపూర్, అనంతపురం జిల్లాలోని ఎంతోమంది కళాకారులు తమ డప్పు వాయిద్యాలతో వచ్చి వారి కళను ప్రదర్శించడం మర్చిపోలేని అనుభూతిని కల్గించింది. కృష్ణగారు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సత్కరించుకోవడం చాలా ఆనందంగా వుంది. హిందుపురంలో 16 మందితో కళాకారుల ఐక్యవేదిక సంఘాన్ని స్థాపించాం. 11 వేల మందికి పక్కా గృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించాం. 18,000 వేలమంది కళాకారులను ప్రోత్సాహించి ఉపాధిని కల్పిస్తున్నాం. వెయ్యిమందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజ్ అయిన ‘శతమానం భవతి’ సూపర్‌హిట్ అయి 30 కోట్లు కలెక్ట్ చేసిందని విన్నాను. ఇంకా మరిన్ని డిఫరెంట్ క్యరెక్టర్స్ చేసి నా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అనంతపురం జిల్లాకి నన్ను దత్తత ఇచ్చిన నా తల్లికి, 8000 మంది కళాకారుల ప్రేమను పంచుతున్నారు. కళాకారుల ఐక్య వేదికకు గౌరవ అధ్యక్షులుగా అమ్మకు కిరీటంతో సత్కరించుకోవడం చాలా హ్యాపీగా వుంది” అన్నారు.
అనంతపురం కళాకారుల ఐక్య వేదిక బ్రోచర్‌ను డా.రాజేంద్రప్రసాద్ రిలీజ్ చేసి తొలి ప్రతిని కృష్ణ-విజయనిర్మలకు అందించారు. ఇదే కార్యక్రమంలో ‘మా’ అసోసియేషన్ సభ్యులందర్నీ ఘనంగా సత్కరించి షీల్డ్‌లను అందజేశారు. అలాగే సీనియర్ అభిమానుల్ని ఘనంగా సత్కరించి షీల్డ్‌లను బహుకరించారు. సీనియర్ జర్నలిస్ట్‌లు బి.ఎ.రాజు, వినాయకరావు, సురేష్ కొండేటి, మేకప్‌మేన్ మాధవరావు, యువ కళావాహిని వై.కె.నాగేశ్వరరావు, శృతిలయ అకాడమీ ఆమనిలను నరేష్ ఘనంగా శాలువా బొకేలతో సత్కరించి షీల్డ్‌లను బహుకరించారు. అనంతరం బర్త్‌డే కేక్‌ని అభిమానుల సమక్షంలో కట్ చేసి తన పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకున్నారు నరేష్.


